అట్టహాసంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ABN , First Publish Date - 2022-04-10T06:25:00+05:30 IST

జిల్లా కేంద్రంలో 48వ రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలబాలికల కబడ్డీ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలోనే వివిధ జిల్లాల నుంచి 68 కబడ్డీ టీమ్‌లు పాల్గొననున్నాయి.

అట్టహాసంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
క్రీడాజ్యోతిని వెలిగిస్తున్న ఎస్పీ, ఎమ్మెల్యేలు, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌

సిరిసిల్ల, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి):  జిల్లా కేంద్రంలో 48వ రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలబాలికల కబడ్డీ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలోనే వివిధ జిల్లాల నుంచి 68 కబడ్డీ టీమ్‌లు పాల్గొననున్నాయి.   పోటీలను సాంస్కృతిక సారధి, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, ఎస్పీ రాహుల్‌హెగ్డే, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు జిందం చక్రపాణి ప్రారంభించారు. సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ఒలంపిక్‌ కాగడాను తీసుకవచ్చి క్రీడాజ్యోతిని వెలిగించారు. ఒలంపిక్‌ జెండాను నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, రాష్ట్ర జెండాను ఎస్పీ రాహుల్‌హెగ్డే, జిల్లా కబడ్డీ జెండాను ఎమ్మెల్యేలు అవిష్కరించారు. క్రీడాకారుల మార్చ్‌ఫాస్ట్‌ అందరినీ ఆకట్టుకుంది. క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించి బెలూన్లను ఎగురవేశారు. తొలిసారిగా సిరిసిల్లలో మ్యాట్‌పై కబడ్డీ అడడం క్రీడాభిమానులను ఆకర్షించింది.   కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌యాదవ్‌, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ అకునూరి శంకరయ్య, సిరిసిల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కార్యదర్శి కోడి అంతయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీకుమార్‌, పోలీస్‌ అధికారులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కబడ్డీ అసోసియేషన్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 


కబడ్డీ జీవితాన్ని నేర్పుతుంది

కబడ్డీ జీవితాన్ని నేర్పుతుందని, పట్టుదలను కలిగిస్తుందని సాంస్కృతిక సారధి చైర్మన్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. క్రీడాకారులను చూస్తుంటే రెసిడెన్షియల్‌లో చదువుతున్న అనందం వారి మొఖాల్లో కనిపిస్తోందన్నారు. కబడ్డీ అంటే తనకెంతో ఇష్టమన్నారు. ‘కబడ్డీ, కబడ్డీ అంటూ సిరిసిల్ల చూసి వద్దామా.. కబడ్డీ చూసి మురిసిపోదామా’ అంటూ పాటపాడి ఉత్సాహపరిచారు. వేములవాడ అంటే రాజన్న గుర్తుకు వస్తాడు. సిరిసిల్ల అంటే రామన్న గుర్తుకు వస్తాడని అన్నారు. 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను రంగు రంగుల డ్రెస్స్‌లో చూస్తే తీరోక్క రంగులతో పెద్ద బతుకమ్మ పేర్చినట్లుగా ఉందన్నారు. కడపటి వార్తలందేసరికి బాలుర జట్లలో సిరిసిల్ల, మొదక్‌ జట్లు తలపడగా మెదక్‌, వికారాబాద్‌, నిర్మల్‌ తలపడగా వికారాబాద్‌, బాలికల జట్లలో మెదక్‌, మంచిర్యాల్‌ తలపడగా మంచిర్యాల్‌, ఖమ్మం, సంగారెడ్డి తలపడగా ఖమ్మం జట్లు విజయం సాధించాయి. 

క్రీడాకారులకు ప్రోత్సాహం

తెలంగాణ ప్రభుత్వ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తామన్నారు. క్రీడల్లో రాణించాలన్నారు. 

నిబద్ధతతో ఆడాలి

క్రీడలతో భవిష్యత్‌లో ఎదిగే అవకాశాలు అందిపుచ్చుకోవాలని నిబద్ధతతో ఆడాలని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు  అన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్ల చెప్పారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. 

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి 

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, గెలుపు, ఓటములు జీవితంలో ఎలా ఉండాలో చూపిస్తాయని  ఎస్పీ రాహుల్‌హెగ్డే  అన్నారు. కబడ్డీ ఇతర దేశాల నుంచి రాలేదని, పూర్తిగా మన దేశానికి సంబంధించిందని అన్నారు. కబడ్డీ శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందన్నారు. క్రీడాకారులకు పోలీస్‌ శాఖ ద్వారా పూర్తి సహకారాలు అందిస్తామన్నారు. క్రీడాకారులు ప్రతిభను చాటాలని సూచించారు. 

 అన్ని సౌకర్యాలు కల్పించాం

 జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలు జరగడం సంతోషాన్నికలిగించిందని క్రీడాకారులకు  ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల క్రీడలకు కేంద్రంగా మారుతుందన్నారు. మంత్రి కేటీఆర్‌ స్టేడియం నిర్మాణాలపై దృష్టి పెట్టారన్నారు.  

Read more