ప్రజల్లో సామాజిక స్పృహ పెరగాలి

ABN , First Publish Date - 2022-06-11T06:34:25+05:30 IST

దేశ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే మనసుకు బాధ కలుగుతోందని, ప్రజల్లో సామాజిక స్పృహ పెరగాలని, సమాజంలో మార్పు జరగాలని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

ప్రజల్లో సామాజిక స్పృహ పెరగాలి
క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్న వినోద్‌కుమార్‌, రమే్‌షబాబు

వేములవాడ టౌన్‌, జూన్‌ 10: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే మనసుకు బాధ కలుగుతోందని,  ప్రజల్లో సామాజిక స్పృహ పెరగాలని, సమాజంలో మార్పు జరగాలని మాజీ ఎంపీ,  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. వేములవాడ మండలంలోని అగ్రహారంలో క్రీడా ప్రాంగాణాన్ని, చీర్లవంచలో దళితబంధు లబ్ధిదారుడు ఏర్పాటు చేసుకున్న సూపర్‌ మార్కెట్‌ను  ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా  వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ మూడు, నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో  జరిగిన అత్యాచార సంఘటన తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడడం నీచమైన చర్యన్నారు.   సెల్‌ ఫోను ఎంత మంచి చేస్తుందో అంతే చెడు చేస్తుందన్నారు. యువత సెల్‌ ఫోన్లకు అలవాటు పడకుండా తీర్చిదిద్దేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు.   జిల్లాలో వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లో తల్లిదండ్రులు క్రీడలకు మొదటి ప్రాధన్యం కల్పించి   పిల్లలను ప్రోత్సహిస్తారన్నారు. మన దేశం కూడా అదే విధానంలో ముందుకు వెళ్లాలనే క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు రాష్ట్రం ముందుకొచ్చిందన్నారు. 

ఫ వెట్టిచాకిరి నుంచి విముక్తికోసం, పేదరికంతో అల్లాడుతున్న ప్రజల కోసం నిజాం, నైజాం సర్కారుకు వ్యతిరేకంగా తుపాకి పట్టి పోరాడిన వ్యక్తి చెన్నమనేని రాజేశ్వర్‌రావు అని బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ఉన్నత కుటుంబంలో జన్మించినా పేదల కోసం పోరాడారని గుర్తు చేశారు.  ఆనాడే ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసిన ఘనత రాజేశ్వర్‌రావుకు దక్కుతుందన్నారు.   సీఎం కేసీఆర్‌తో ఆయన కల నెరవేరిందన్నారు. 

‘దళితబంధు’ దేశంలోనే మహత్తర కార్యక్రమం 

 ‘దళితబంధు’ దేశంలోనే మహత్తరమైన కార్యక్రమమని ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద దళితులకు ఈ పథకం వర్తించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందన్నారు.  దళితల కుటుంబాల్లో వెలుగులు నింపేందకు సీఎం కేసీఆర్‌కు వచ్చిన గొప్ప ఆలోచన అన్నారు.  నిర్వాసితుల సమస్యలు ఒక్కోటి పరిష్కరిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వేములవాడ అర్భన్‌ మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, ఎంపీపీ బూర వజ్రవ్వ, జడ్పీటీసీ మ్యాకల రవి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, సెస్‌ డైరెక్టర్‌ రేగులపాటి హరిచరణ్‌రావు, సర్పంచులు రంగు సత్తెమ్మరాములు, రాసూరి రాజేశం తదితరులు ఉన్నారు. 

Read more