ఫిరంగిలా గర్జించాలి

ABN , First Publish Date - 2022-02-19T06:26:19+05:30 IST

‘బీజేపీ, కాంగ్రెస్‌ వాళ్లు కేసీఆర్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే మౌన పాత్ర వహించకుండా ఫిరంగిలా గర్జించాలి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న మనం తిరుగులేని శక్తిగా, హ్యాట్రిక్‌ దిశగా సాగాలి’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు

ఫిరంగిలా గర్జించాలి
మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

-  హ్యాట్రిక్‌ దిశగా సాగాలి

- గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నాం

 - రెండు నెలలకోసారి పార్టీ సమావేశాలు 

- రాకుంటే చర్యలు 

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు

- జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం

-  అధ్యక్షుడిగా తోట అగయ్య బాధ్యతల స్వీకరణ 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

‘బీజేపీ, కాంగ్రెస్‌ వాళ్లు కేసీఆర్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే మౌన పాత్ర వహించకుండా ఫిరంగిలా గర్జించాలి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న మనం తిరుగులేని శక్తిగా, హ్యాట్రిక్‌ దిశగా సాగాలి’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. జిల్లా కేంద్రంలో సాయిమణికంఠ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా  అధ్యక్షుడిగా తోట అగయ్య పదవీ బాధ్యతల స్వీకరించారు. అనంతరం పార్టీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌  మాట్లాడుతూ పార్టీతోనే పదవులు వచ్చాయని, మర్చిపోవద్దని అన్నారు. 60 లక్షల మంది సభ్యత్వం కలిగి వారు కష్టపడితేనే పదవులు వచ్చాయని, టీఆర్‌ఎస్‌ అజేయంగా ఎదిగిందని అన్నారు. 12,769 గ్రామ సర్పంచుల్లో 10 వేల మంది, 5 వేల మంది ఎంపీటీసీల్లో 3618 మంది, 147 మున్సిపాలిటీలలో 136 మంది చైర్‌పర్సన్‌లు, మేయర్‌లు, 539 జడ్పీటీసీల్లో 473 మంది, 32 జడ్పీ చైర్మన్‌లలో వంద శాతం మనవాళ్లేనని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనవాళ్లే ఉన్నారని అన్నారు. అవాలా రేవంత్‌, బేకార్‌ బండి మాట్లాడితే ఆగమై పోవద్దన్నారు.   తుర్పారా బట్టి ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టాలన్నారు.   కుటుంబ సభ్యుల్లా కార్యకర్తలను కాపాడుకోవాలన్నారు. సభ్యత్వం పొందిన ప్రతీ వారికి రూ.2 లక్షల బీమా కల్పించామన్నారు. జిల్లాలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా నిలబడాలని నూతన అధ్యక్షుడికి సూచించారు. రెండు నెలలకు ఒకసారి పార్టీ సమావేశాలు జరగాలన్నారు. సమావేశాలకు రానివారిపై చర్యలు ఉంటాయన్నారు. ర్యాలీలో చూస్తే మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు తనముందే బ్యాంక్‌లో పనిచేసుకొని వెళ్తూ కనిపించారన్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించబోమన్నారు.  శిక్షణ తరగతులు  నిర్వహిస్తామన్నారు. నిజం గడప దాటకముందే అబద్ధం ఊరు దాటుతుందని, తెలంగాణకు ట్రైబల్‌ యూనివర్సిటీ ఇవ్వని మోదీ పచ్చి అబద్ధాలతో వాట్సప్‌ యూనివర్సిటీని నడుపుతున్నారని, దానికి ఆయనే వైస్‌ ఛాన్స్‌లర్‌ అని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనన్ని పథకాలు అమలు చే శామని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. పథకాల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా తెలియజేయాలని, సర్పంచ్‌లు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా నిత్యం ప్రజలతో ఉండాలన్నారు.  కొవిడ్‌ సమయంలోనూ సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఒకప్పుడు ప్రజాప్రతినిఽధులు గ్రామాలకు వెళ్లాలంటేనే భయపడేవారని ఎక్కడ ఖాళీ బిందెలతో అడ్డుకంటారేమోనని అనుకునేవారని అన్నారు. ఇప్పుడు ఎర్రటి ఎండలోనూ నర్మాల మత్తడి దూకుతోందని, తంగళ్లపల్లి బ్రిడ్జి వద్ద సముద్రంలా నీళ్లు కనిపిస్తున్నాయని అన్నారు. సరిగ్గా ఎనిమిదేళ్ల్ల క్రితం ఫిబ్రవరి 18న పార్లమెంట్‌, లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాసైన రోజని, కేసీఆర్‌ నాయకత్వం ద్వారా కొత్త రాష్ట్రం ఏర్పడిందని  అన్నారు. ఇప్పుడు కూడా నరేంద్రమోదీ తెలంగాణపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు.  మోదీ ప్రభుత్వ కింద పనిచేసే నీతి అయోగ్‌ రూ.24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని సిఫార్సు చేస్తే 24 పైసలు ఇవ్వలేదన్నారు.  నమో దుకాణం తెరిచారని, నమో అంటే నరేంద్ర మోదీ కాదు నమ్మించి మోసం చేయడమేనని అన్నారు. గుజరాత్‌లో ఏదో చేశారని జీవితాలు మారుస్తారని అధికారం ఇస్తే ఉన్న జీవిత బీమాను అమ్ముతున్నారని, డైలాగ్‌లు మాత్రం అద్భుతంగా చెబుతారని అన్నారు. ఏదైనా గట్టిగా అడిగితే అక్భర్‌, బిన్‌లాడెన్‌, పాకిస్థాన్‌, హిందూస్థాన్‌  అంటారన్నారు. ఏుటా రూ.2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కోటలు దాటే మాటలు చెప్పి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.  కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మూడేళ్లలో వేములవాడ రాజన్నకు, సిరిసిల్ల పవర్‌లూం నేతన్నలకు ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు.           

దేశానికి దిక్సూచి తెలంగాణ

తెలంగాణలో ఒకప్పుడు రైతుల అత్మహత్యలు, నక్సలైట్లు, పోలీసుల చర్యలు ఉండేవని, ఇప్పుడు దేశానికే దిక్సూచిగా మారిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్‌ 18 గంటలు శ్రమించారన్నారు. తెలంగాణ అభివృద్ధిని, కాంగ్రెస్‌, బీజేపీ ఓర్వలేకపోతున్నాయన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ సిరిసిల్లకు రావాలంటేనే భయం వేసేదంటూ మానాల గుట్టల్లో ఎన్‌కౌంటర్‌ వంటి సంఘటనలు గుర్తు చేశారు.  ఎమ్మెల్యే రమేష్‌బాబు మాట్లాడుతూ దేశ వ్యవస్థను బీజేపీ ప్రైవేటీకరణ పేరుతో అమ్మేస్తోందన్నారు. జిల్లాలో ఒకప్పుడు అందరూ ఎర్రజెండా కింద ఉన్నవాళ్లమేనని మతవాదులను నియత్రించడం తెలుసని అన్నారు.  తన తండ్రి చెన్నమనేని రాజేశ్వర్‌రావు కేటీఆర్‌ గెలవాలని కాంక్షించారన్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ యూపీలో బీజేపీని గెలిపించారని అక్కడికి వెళ్లినపుడు 150 కిలోమీటర్లు వెళ్లాలంటే ఆరుగంటల సమయం పట్టిందని దీనిని బట్టి అక్కడ ఏస్థాయిలో అభివృద్ధి జరిగిందో అర్థంచేసుకోవచ్చని అన్నారు. అనంతరం మోదీ ఖిలాడీ అంటూ  గిడ్డంగుల చైర్మన్‌ సాయిచంద్‌ పాటలు పాడి చైతన్య పరిచారు.  సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్‌ మాజీ చైర్మన్‌ చిక్కాల రామారావు, సీనియర్‌ నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రామ్మోహాన్‌, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్‌, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఆర్‌ఎస్‌ మండలాల అధ్యక్షులు వరుస కృష్ణహారి, పాపగారి వెంకటస్వామి గౌడ్‌, గుజ్జుల రాజిరెడ్డి, బొంపల్లి సురేందర్‌రావు, గజభీంకార్‌ రాజన్న, మల్యాల దేవయ్య, మ్యాకల ఎల్లయ్య, డేగావత్‌ తిరుపతి, గోస్కుల రవి, ఊరడి ప్రవీణ్‌, కత్తెర పాక కొండయ్య, నర్సింహరెడ్డి, విఽవిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-19T06:26:19+05:30 IST