ధర్మపురి వద్ద తగ్గిన గోదావరి ప్రవాహం

ABN , First Publish Date - 2022-07-18T06:41:37+05:30 IST

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ధర్మపురి వద్ద గోదావరి నీటి ప్రవాహం తగ్గింది. మహారాష్ట్ర, నిజామాబాద్‌ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి వాగుల ద్వారా ప్రవహించిన నీరు వల్ల గోదావరి నీటి ప్రవాహం రోజు రోజుకు పెరిగింది.

ధర్మపురి వద్ద తగ్గిన గోదావరి ప్రవాహం
వరద తగ్గడంతో ధర్మపురి వద్ద తేలిన స్నానఘట్టాలు

ధర్మపురి, జూలై 17: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ధర్మపురి వద్ద గోదావరి నీటి ప్రవాహం తగ్గింది. మహారాష్ట్ర, నిజామాబాద్‌ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి వాగుల ద్వారా ప్రవహించిన నీరు వల్ల గోదావరి నీటి ప్రవాహం రోజు రోజుకు పెరిగింది. భారీ వర్షాలకు తోడుగా నిర్మల్‌ జిల్లా కడెం-నారాయణరెడ్డి ప్రాజెక్టు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ గేట్లు తెరచి దిగువకు లక్షల సంఖ్యలో క్యూసెక్కుల నీరు విడుదల చేయడం వల్ల గోదావరి నది వరద ప్రమాద స్థాయికి చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల పలు వీధుల్లో నీరు చేరి అనేక మంది నిరాశ్రయులయ్యారు. గోదావరి వరద బాధితులను సహాయక కేంద్రాలకు తరలించారు. ప్రభుత్వ అధికారులు, అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు, పలు స్వచ్ఛంద సంస్థలు బాధితులకు సేవలు అందించారు. అలాగే వారందరికీ నిత్యావసర సరుకులు, తక్షణ సహాయం అందిం చి భోజన వసతి కల్పించారు. రెండు రోజుల నుంచి గోదావరి వరద కొంత తగ్గి పోవటం వల్ల బాధితులు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. వరద తాకిడికి గురైన బ్రాహ్మణవాడ, బోయవాడ, కుమ్మరివాడ, గంపలవాడ, గోలివాడ, తెనుగువాడ, ఇందిరమ్మ, ఒడ్డెర కాలనీల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు పేరుకపోయిన బురద మట్టిని తొలగిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మురికి కాలువలు శుభ్రం చేయించి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టులోనికి ఇన్‌ఫ్లో లేదు. ప్రాజెక్టు సంబంధించిన 16 గేట్లు తెరచి 4500 క్యూసెక్కుల నీరు దిగువకు గోదావరి నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం గోదావరి నది నీటి ప్రవాహం తగ్గి పోవటం వల్ల సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు చేరుకుని తిరిగి స్నానాలు చేస్తున్నారు. ధర్మపురి మండల తహసీల్దార్‌ వెంకటేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, కమీషనర్‌ రమేష్‌, సీఐ బిళ్ల కోటేశ్వర్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.  

  Read more