జలమయం

ABN , First Publish Date - 2022-09-12T05:14:07+05:30 IST

అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదనీటితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంలోని సర్దార్‌నగర్‌, వెంకంపేట, సంజీవయ్యనగర్‌, కొత్తబస్టాండ్‌లతో పాటు శాంతినగర్‌లో భారీగా వరదనీరు చేరింది.

జలమయం
సిరిసిల్ల పాతబస్టాండ్‌ వద్ద జలమయం

- జిల్లాలో భారీ వర్షం 

- మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు

- భారీగా ఎగువ మానేరు మత్తడి 

- పొంగిపొర్లుతున్న వాగులు 

- మత్తడి దూకుతున్న చెరువులు 

- ఇళ్లలోకి చేరిన నీరు... పంట చేలలోకి వరదనీరు

- మరమగ్గాల ఖార్కానాల్లోకి వరదనీరు

-  అధికారులు అప్రమత్తం 

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదనీటితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంలోని సర్దార్‌నగర్‌, వెంకంపేట, సంజీవయ్యనగర్‌, కొత్తబస్టాండ్‌లతో పాటు శాంతినగర్‌లో భారీగా వరదనీరు చేరింది. ఇళ్లలోకి నీళ్ల్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొత్తబస్టాండ్‌ నుంచి కొత్త చెరువు వరకు ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు నిలిచింది. రంగినేని ట్రస్టు సమీపంలో వరదనీరు చేరడంతో కరీంనగర్‌ రోడ్డు డివైడర్‌ను తొలగించి నీటిని వదిలారు. పెద్దబజార్‌లో భారీగా వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సిరిసిల్ల మార్కెట్‌ జలమయంగా మారింది. కార్మికవాడలైన బీవైనగర్‌, సుందర య్యనగర్‌, తారకరామానగర్‌, గణేష్‌నగర్‌ ప్రాంతాల్లో వర్షపు నీరుతో ఇబ్బందులు పడ్డారు. మున్సిపల్‌ సిబ్బంది వరదనీరు తొలగించడంతోపాటు సహాయక చర్యలు చేపట్టారు.  ఇళ్లలోకి నీరు చేరడంతో  వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శాంతినగర్‌ తదితర ప్రాంతాల్లో మరమగ్గాల ఖార్కానాల్లోకి నీళ్లుచేరాయి. జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు చేరింది. మత్తడి దూకింది. సిరిసిల్ల మానేరువాగు, వేములవాడ మూలవాగులు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌లో ఎల్లంపల్లి మినీరిజర్వాయర్‌ గేట్లు తెరవకపోవడంతో మత్తడి దూకి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలోకి నీళ్లు చేరాయి. చందుర్తిలో పలు ఇళ్లలోకి నీళ్లు రావడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో మూడు ఇళ్లు కూలిపోయాయి. వేములవాడ అర్బన్‌ మండలంలోని మల్లాపూర్‌ రోడ్డులో పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి శివారులో తాత్కాలికంగా వేసిన రోడ్లు కొట్టుకుపోయింది. పదిర చిట్టివాగుపై ప్రధాన రహదారి వంతెన దెబ్బతింది. ఇల్లంతకుంట మండలం బిక్కవాగు వద్ద తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. చందుర్తి మండలం కొత్తపేట వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయిన్‌పల్లి, వేములవాడ, వీర్నపల్లి, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి మండలాల్లోని చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు చేరింది. అలుగు పారడంతో ఒర్రెలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సహాయకచర్యలు అందించే విధంగా   కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే  అధికారులను అప్రమత్తం చేశారు. కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. 

నీట మునిగిన వరి, పత్తిచేన్లు

భారీ వర్షాలు, వరదలతో రైతులు అతలాకుతలం అవుతున్నారు. జూన్‌, జూలైలో భారీ వర్షాలు కురవగా ఆగస్టులో కాస్తా ఊరటనిచ్చాయి. మళ్లీ సెప్టెంబరులో ఎడతెరిపిలేని వర్షంతో  రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పత్తి, వరి పంటలు నీట మునిగాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో 200 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో పత్తి నీట మునిగింది. అక్కపల్లి, పదిర గ్రామాల్లో వరి దెబ్బతింది. చందుర్తి మండలం మూడపల్లిలో పత్తిచేనులోకి వరదనీరు చేరింది. మల్యాలలో వరి నీట మునిగింది. కోనరావుపేట మండలంలో వరి పొలాల్లోకి వరదనీరు చేరింది. జిల్లాలోని వివిధ మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. 

జిల్లాలో 128 మిల్లీ మీటర్ల వర్షం 

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం వరకు 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముస్తాబాద్‌ మండలంలో అత్యధికంగా 177.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా రుద్రంగి మండలంలో 42.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వేములవాడ రూరల్‌లో 148.4, 

చందుర్తిలో 115.4, బోయిన్‌పల్లిలో 113.0, వేములవాడలో 139.6, సిరిసిల్లలో 157.0, కోనరావుపేటలో 160.6, వీర్నపల్లిలో 88.3, ఎల్లారెడ్డిపేటలో 194.0, గంభీరావుపేటలో 109.6, తంగళ్లపల్లిలో 152.3, ఇల్లంతకుంటలో 66.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 


మిడ్‌మానేరు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరుచేరడంతో 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 43 వేల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. భారీగా వస్తున్న వరదనీటితో గేట్లు ఎత్తి 49,591 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 27.50 టీఎంసీల సామర్థ్యానికి 20.219 టీఎంసీల నీరు ఉంది. జిల్లాలోని గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులోకి చేరిన వరదనీరుతో మత్తడి దూకుతోంది. దీంతో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.  

మూడో రోజు కొనసాగిన నిమజ్జనం

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీ వర్షాలతో నిమజ్జనం మూడోరోజు కూడా కొనసాగింది. భారీ విగ్రహాలు తరలించడానికి వర్షంతో ఇబ్బందులు పడ్డారు. ఆదివారం వర్షంలో సైతం సిరిసిల్ల మానేరు వాగుకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.




Updated Date - 2022-09-12T05:14:07+05:30 IST