వేములవాడలో బీభత్సం

ABN , First Publish Date - 2022-09-12T05:17:21+05:30 IST

వేములవాడలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షం శనివారం రాత్రి భీభత్సం సృష్టించింది. మండలంతోపాటు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వేములవాడలో బీభత్సం
వేములవాడ మండలం శాత్రాజుపల్లి వెళ్లే మార్గంలో వరద ధాటికి తెగిన డివైడర్‌

వేములవాడ టౌన్‌  సెప్టెంబరు 11 : వేములవాడలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షం శనివారం రాత్రి భీభత్సం సృష్టించింది. మండలంతోపాటు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  పట్టణ పరివాహక ప్రాంతం, మండలంలోని ఒర్రెలు, కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. వేములవాడకు పట్టణానికి వచ్చే అన్ని రహదారులు నీటితో కొట్టుకుపోవడంతో పట్టణానికి రాకోకలు నిలిచిపోయాయి. ఒర్రెలు, కాలువాలు మూలవాగులోకి రావడంతో మూలవాగు ప్రవాహం మరింత పెరిగింది. వేములవాడ నుంచి కొండగట్టు వెళ్లే మార్గంలో శాత్రాజుపల్లి సాయిరక్ష బిల్డింగ్‌ సమీపంలోని ఒర్రె ఉప్పొంగడంతో నీటిప్రవాహానికి రోడ్డుపైన డివైడర్‌ రెండు చోట్ల కూలిపోయింది. దీంతో చెరువు మత్తడిదూకే విధానాన్ని తలపించింది. కొనాయపల్లి పరిధిలోని బుడిగజంగాల కాలనీలోకి నీరు రావడంతో అధికారులు ముందస్తుగా తరలించారు. మల్లారం రోడ్డు వైపు వెళ్లే రోడ్డును ఒర్రె ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎస్‌ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్‌ ఎదురుగా ఉన్న కాలనీలోని 15 ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. చెక్కపెల్లి మార్గంలోని సబ్‌స్టేసన్‌ పూర్తిగా నీటిమయం కావడంతో ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ అంతరాయం తల్తెతంది. పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తిప్పాపూర్‌ నుంచి నాంపల్లి వెళ్లే మార్గంలోని నిమ్మఒర్రె, కట్టుకాలువ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. తిప్పాపూర్‌ శౌరాలకాలనీలోని ఇళ్లలోకి నీరు చేరడంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవిరాజు, స్థానిక కౌన్సిలర్‌ నీలం కళ్యాణిశేఖర్‌  పరిశీలించారు. మారుపాక, నాంపల్లి నుంచి వచ్చే నిమ్మ ఒర్రె, కట్టుకాలువ నీటి ప్రవాహంతో గొల్లపల్లి గ్రామ శివారులోని సుమారు 50 ఎకరాల్లోని పంటపొలాలలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.  వేములవాడ మండలంలోని ఆరెపల్లి, సంకెపల్లి గ్రామాల్లో నిర్వాసితులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ రాజారెడ్డి, వేములవాడ పట్టణ సీఐ వెంకటేష్‌ తెలిపారు.



Updated Date - 2022-09-12T05:17:21+05:30 IST