‘ఉపాధి’ ప్రణాళిక సిద్ధం

ABN , First Publish Date - 2022-12-10T00:46:06+05:30 IST

జిల్లాలో ఉపాధిహామీ పనుల ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. గ్రామీణులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామాల్లో పనులు దొరకడంతో వలసలు తగ్గాయి. ఏటా ఉపాధి కూలీలకు అవసరమయ్యే పనులు, పనిదినాలకు సంబంధించిన యాక్షన్‌ప్లాన్‌ను రూపొందిస్తూ పనులు కల్పిస్తున్నారు.

‘ఉపాధి’ ప్రణాళిక సిద్ధం

- 2023-24 సంవత్సరానికి 27,98,470 పనిదినాలు

- బడ్జెట్‌ వ్యయం రూ.119.77 కోట్లు

- గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు

- జిల్లాలో 2.23 లక్షల మంది ఉపాధి కూలీలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలో ఉపాధిహామీ పనుల ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. గ్రామీణులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామాల్లో పనులు దొరకడంతో వలసలు తగ్గాయి. ఏటా ఉపాధి కూలీలకు అవసరమయ్యే పనులు, పనిదినాలకు సంబంధించిన యాక్షన్‌ప్లాన్‌ను రూపొందిస్తూ పనులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులను గుర్తించింది. పనిదినాల బడ్జెట్‌ను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందించింది. గతంలో కంటే ఈసారి జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో పనుల గుర్తింపుకోసం గ్రామసభలను నిర్వహించారు. ఉపాధి పనులపై గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెత్తనానికి కేంద్రం ఇప్పటికే బ్రేక్‌ వేసింది. ఎన్‌ఐసీ కొత్త సర్వర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారమే నవంబరులో గ్రామసభలు నిర్వహించారు. గ్రామం, మండలం జిల్లా, రాష్ట్ర స్థాయిలో బడ్జెట్‌ను రూపొందించి కేంద్రానికి నివేదికలు పంపించే ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో గుర్తించిన ప్రకారం 2024 మార్చి 31 వరకు పనులు చేపట్టనున్నారు. పనులు పారదర్శకతో చేపట్టేందుకు బడ్జెట్‌ను రూపకల్పన చేశారు.

జిల్లాలో పనిదినాలు

జిల్లాలో 1,040,00 జాబ్‌ కార్డులు ఉండగా 2.23 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ఇందుకు సంబంధించి 2023-24 సంవత్సరానికి లేబర్‌ బడ్జెట్‌ యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించారు. ===27,98,470 పనిదినాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2.23 లక్షల మంది ఉపాధికూలీలకు పనిదినాలు కల్పించనున్నారు. బోయినపల్లి మండలంలోని 23 గ్రామాల్లో 1,60,782 పనిదినాలు, చందుర్తి 19 గ్రామాల్లో 2,27,050, ఇల్లంతకుంట 33 గ్రామాల్లో 2,66,849, గంభీరావుపేట 21 గ్రామాల్లో 3,24,780, కోనరావుపేట 28 3,28,650, ముస్తాబాద్‌ 22 గ్రామాల్లో 2,99,570, రుద్రంగి 10 గ్రామాల్లో 68,543, తంగళ్లపల్లి 30 గ్రామాల్లో 3,19,350, వీర్నపల్లి 17 గ్రామాల్లో 2,56,000, వేములవాడ 11 గ్రామాల్లో 55,106, వేములవాడ రూరల్‌ 17 గ్రామాల్లో 1,45,290, ఎల్లారెడ్డిపేట 24 గ్రామాల్లో 3,46,500 పనిదినాలు కల్పించడానికి బడ్జెట్‌ రూపొందించారు. జిల్లాలో ఉపాధిహామీ కూలీకి రోజు రూ.257, మెటీరియల్‌ బడ్జెట్‌లో రూ.171 కలిపి ఒక రోజు రూ.428 చొప్పున రూ.119.77 లక్షల అంచనా బడ్జెట్‌ను రూపొందించారు.

4,424 పనుల గుర్తింపు

కేంద్ర ప్రభుత్వం పాత విధానాలకు స్వస్తి పలికి కొత్త విధానాలతో ఉపాధిహామీ పనులకు శ్రీకారం చుట్టింది. గతంలో అనేక పనులను ప్రణాళికలో తీసుకున్నా ఈసారి అయా గ్రామాల్లో ఏకకాలంలో 20 పనులు మాత్రమే ప్రారంభించే వెసులుబాటు కల్పించింది. ఒక పని పూర్తయిన తర్వాతనే మరో పని చేపట్టే విధంగా ఆదేశాలు ఉన్నాయి. దీనికి తోడుగా గ్రామసభలోనే ఉపాధి పనులను గుర్తించారు. ఉపాధిహామీ పనులపై నిఘా పెంచడంతోపాటు కూలీలకు నేరుగా వారి ఖాతాల్లోనే కూలి డబ్బులు జమ చేస్తున్నారు. ఈసారి పనుల గుర్తింపులో భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యం ఇచ్చారు. కాలువలు, కుంటలు, చెరువుల్లో పూడికతీత, నీటి సంరక్షణ, పాంపాండ్‌లు, చేపల చెరువులు, వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెల మేకల పెంపకం, కోళ్ల పరిశ్రమ షెడ్ల నిర్మాణం, నర్సరీలు, పండ్లతోటల పెంపకం, సామూహిక, వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన పనులను గుర్తించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఏ, బీ, సీ, డీ కేటగిరిల్లో 4,424 పనులను గుర్తించారు. ఇందులో ఏ కేటగిరీలో 1900, బీ కేటగిరీలో 1454, సీ కేటగిరీలో 33, డీ కేటగిరీలో 1037 పనులను గుర్తించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 46.49 లక్షల పనిదినాలు లక్ష్యంగా పెట్టుకోగా 20.82 లక్షల పనిదినాలు కల్పించారు. 44.78 శాతం పూర్తయ్యాయి. కూలీల వేతనాలకు సంబంధించి రూ.42.81 కోట్లు జమకాగా, మెటీరియల్‌ కోసం రూ.17.04 కోట్లు ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా నేషనల్‌ మోబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా పనులను వెంట వెంట నమోదు చేస్తున్నారు. నవంబరు వరకు జిల్లాలో డైయింగ్‌ ప్లాట్‌ఫాంలు 1681 పనులు మంజూరవగా 772 ప్రగతిలో ఉన్నాయి. రూ.2.11 కోట్ల ఖర్చుతో 366 పూర్తి చేశారు. పశువుల పాకల నిర్మాణాలు 1301 మంజూరవగా రూ.10.83 కోట్లతో 612 పనులు పూర్తి చేయగా 271 కొనసాగుతున్నాయి. గొర్రెలు, మేకల పాకల నిర్మాణాలు 424 మంజూరవగా రూ.7.23 కోట్లతో 42 పూర్తి చేయగా 156 పనులు కొనసాగుతున్నాయి. మ్యాజిక్‌ సోప్‌ ఫీట్‌లు 34,667 మంజూరవగా రూ.17.69 కోట్లతో 27,115 పూర్తి కాగా 876 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఫాంపాండ్‌లు 2167 మంజూరవగా రూ.15.97 కోట్లతో 1301 పూర్తి చేశారు. 553 పనులు ప్రగతిలో ఉన్నాయి. గ్రామ సంతలు జిల్లాలో 20 మంజూరవగా రూ.25.36 లక్షలతో రెండు మాత్రమే పూర్తి చేశారు. నాలుగు ప్రగతిలో ఉండగా 14 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మన ఊరు మనబడిలో పాఠశాలల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్‌ షెడ్‌లు, వైకుంఠధామాల పనులను పూర్తి చేశారు.

Updated Date - 2022-12-10T00:46:11+05:30 IST