బహిరంగ చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2022-09-27T05:55:57+05:30 IST

ఐదు సంవత్సరాలు ఎంపీగా, మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఏం చేశారో? కరీంనగర్‌ ఎంపీగా తాను ఏం చేసానో ప్రజలకు తెలియజేయడానికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

బహిరంగ చర్చకు సిద్ధం
సిరిసిల్లలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 26 : ఐదు సంవత్సరాలు ఎంపీగా, మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఏం చేశారో? కరీంనగర్‌  ఎంపీగా తాను ఏం చేసానో ప్రజలకు తెలియజేయడానికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2009లో ఎంపీగా ఎన్నికై సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి పవర్‌లూం అప్‌ గ్రేడేషన్‌, చేర్పులు మార్పులు, నూతన క్లస్టర్‌ ప్రతిపాదన, ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేశానని, నాడు కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావును సిరిసిల్లకు తీసుకొచ్చానని తెలిపారు.  అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలను సిరిసిల్ల ప్రజలకు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు.  కేంద్రియ విద్యాలయం, బీడీ కార్మికులకు ఆస్పత్రి, జిల్లా పరిధిలోని మండలాలకు మోడల్‌ స్కూల్స్‌, కస్తూర్బా పాఠశాలలను తీసుకొచ్చామన్నారు. సిరిసిల్ల రేణుక ఎల్లమ్మ దేవాలయం నుంచి రగుడు చౌరస్తా వరకు బైపాస్‌ రోడ్డును ఆర్‌అండ్‌బీ రాష్ట్ర మంత్రి టీ జీవన్‌రెడ్డి హయాంలో ఏర్పాటు చేశామన్నారు. అనంతరం స్థానికేతరుడైన బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఎంపీగా గెలిచి ఈ ప్రాంతపైన ఎటువంటి శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. ఎంపీగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న వినోద్‌కుమార్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఏం చోశారో? చెప్పాలన్నారు. వినోద్‌కుమార్‌ తన సొంత జిల్లా వరంగల్‌కు టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీస్‌ తీసుకెళ్ల్లారన్నారు.  కరీంనగర్‌లో   సొంత మెడికల్‌ కళాశాల ఉండడంతో మరోటి రాకుండా అడ్డుపడుతున్నారన్నారు.  నాడు  జగిత్యాల మీదుగా కరీంనగర్‌ నుంచి వరంగల్‌కు నేషనల్‌ హైవే 563 తీసుకొచ్చానని, దాన్ని కొత్తపల్లి వద్ద టర్న్‌ తీసుకొని ప్రతిమ వైద్య కళాశాల నుంచి రామగుండం రోడ్డు నుంచి మానకొండూరు చెంజర్ల రోడ్డుకు అలైన్మెంట్‌  కలుపుతున్నారని ఆరోపించారు. వరంగల్‌కు వెళ్లే జగిత్యాల వాసులు రామగుండం రోడ్డుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత ప్రయోజనల కోసం అలైన్మెంట్‌ను మార్పులు చేశారని, వినోద్‌కుమార్‌ తన ప్రతిమ వైద్యశాల నుంచి నేషనల్‌ హైవే 563ని తీసుకెల్తున్నారని ఆరోపించారు.జోక్యం చేసుకోవాలని అలైన్మెంట్‌ మార్చవద్దని కాంగ్రెస్‌ పార్టీ తరఫున  ఎంపీ సంజయ్‌కి  వినతిపత్రం అందించామన్నారు.    సిరిసిల్ల టెక్స్‌టైల్స్‌లో అనేక క్లస్టర్లు  మూత పడుతున్నాయన్నారు. నేతన్నకు బీమా చనిపోయాక వచ్చే ప్రతిఫలం మాత్రమేనని, బతికుండగా నేతన్నలు బాగుండాలనుకుంటే నేతన్న బంధు, ఆర్థిక సహాయం, ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. 2004 అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నేతన్నల ఆత్మహత్యల నివారణకు  మహిళా సంఘాలకు రూ.5 లక్షల చొప్పున వడ్డీలేని రుణం అందించినట్లు చెప్పారు.   కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, వేములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల, వేములవాడ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్‌, సాగరం వెంకటస్వామి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళా విభాగం కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, జిల్లా నాయకుడు కూస రవి, చుక్క శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-27T05:55:57+05:30 IST