టెట్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-06-12T05:35:38+05:30 IST

ఐదేళ్ల సుదీర్ఘ కాలం తరువాత టెట్‌ ముందుకొచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు టెట్‌ నోటిఫికేషన్‌తో ఊరట చెందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరి సారిగా 2017 జూలై 23న టెట్‌ నిర్వహించింది. ఆ సమయంలో కొందరు అభ్యర్థులు సిలబస్‌పై కోర్టుకు వెళ్లడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పరీక్షలు సజావుగా జరిగాయి. సుదీర్ఘ రోజుల అనంతరం ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో టెట్‌ నిర్వహించడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

టెట్‌కు సర్వం సిద్ధం
పరీక్ష హాల్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లు వేస్తున్న సిబ్బంది

- ఐదేళ్ల తర్వాత నిర్వహణ 

- పరీక్షకు 12,781 మంది అభ్యర్థులు 

- జిల్లా వ్యాప్తంగా 29 పరీక్ష కేంద్రాలు,  

 - నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

-  పరిశీలించిన అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ 

  (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఐదేళ్ల సుదీర్ఘ కాలం తరువాత టెట్‌ ముందుకొచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు టెట్‌ నోటిఫికేషన్‌తో ఊరట చెందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరి సారిగా 2017 జూలై 23న టెట్‌  నిర్వహించింది. ఆ సమయంలో కొందరు అభ్యర్థులు  సిలబస్‌పై కోర్టుకు వెళ్లడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పరీక్షలు సజావుగా జరిగాయి. సుదీర్ఘ రోజుల అనంతరం ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో టెట్‌ నిర్వహించడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేశారు. పేపర్‌-1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్‌ - 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 29 పరీక్ష కేంద్రాలు, 112 హాల్‌లు సిద్ధం చేశారు.  వీటిలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 11, వేములవాడ 4 కేంద్రాలు, అగ్రహారంలో 4 కేంద్రాలు ఉన్నాయి. 


పరీక్షకు 12,788 మంది అభ్యర్థులు 

ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 12,788 మంది హాజరుకానున్నారు. ఇందులో పేపర్‌-1కు 6841 మంది, పేపర్‌-2కు 5941 మంది ఉన్నారు. వీరు పరీక్షలు రాయడానికి పరీక్ష కేంద్రాల్లో అన్నీ సౌకర్యాలను కల్పించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ పర్యవేక్షించారు. ఇందుకోసం 348 మంది ఇన్విజిలేటర్లు, 112 మంది సూపరింటెండెంట్లను నియమించారు. 8 రూట్‌ అధికారులు, 29 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు, 29 మంది చీఫ్‌ సూపరింటిండెంట్‌లను నియమించారు. వీరందరూ శనివారం కలెక్టరేట్‌లో రిపోర్ట్‌ చేసి ఆర్డర్లను తీసుకున్నారు. నియామక సిబ్బంది విధులకు గైర్హజరైయితే సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. 

 నిమిషం ఆలస్యమైతే పరీక్షకు నో  

ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతించరు. గంట ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు హాజరు కావాలని సూచిస్తున్నారు. మొబైల్‌, ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్‌లు, బ్యాగ్‌లు మొదలైన వాటిని కేంద్రంలోకి అనుమతించరు. టెట్‌ హాల్‌టికెట్‌లో ముద్రించిన సూచనలను అభ్యర్థులు జాగ్రత్తగా చదివి పాటించాల్సి ఉంటుంది. బ్లాక్‌ పెన్‌, పరీక్ష ప్యాడ్‌ తెచ్చుకోవాలి. వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. హాల్‌టికెట్‌లో అభ్యర్థుల పేరు తల్లిపేరు, తండ్రి పేరు, అక్షర దోషాలు, కులం, లింగం, దివ్యాంగులు తదితర వివరాల్లో పొరపాట్లు ఉంటే పరీక్ష కేంద్రం నిర్వాహకుల వద్ద ఉండే నామినల్‌ రోల్‌లో మార్చుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేకపోయినా తాజాగా దిగిన ఫొటోను అతికించి గెజిటెడ్‌ అధికారితో అటెస్టడ్‌ చేయించి డీఈవోను సంప్రదించాలి.

టీచర్‌ నియామకాల్లో టెట్‌ వెయిటేజీ

ప్రాథమిక, ఉన్నత స్థాయిలో బోధన ప్రమాణాలను పెంపొందించడానికి 2011 నుంచి ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం టెట్‌ తప్పనిసరిగా చేసింది. ప్రాథమిక స్థాయిలో బోధనకు పేపర్‌ 1, ఆపై స్థాయి బోధనకు పేపర్‌ 2 పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. టెట్‌లో సాధించిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో వెయిటేజీ ఉంటుంది. టెట్‌ 150 మార్కులతో నిర్వహిస్తుండగా ఇందులో జనరల్‌ అభ్యర్థులు 90 మార్కులు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే టీఆర్‌టీకి క్వాలిఫై అవుతారు. ఈ సారి అభ్యర్థులు 120కి పైగా స్కోర్‌ చేసే విధంగా నిరంతరం చదివారు. 


మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు 

టెట్‌కు సర్వం సిద్ధం చేశామని,  అభ్యర్థులు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అన్నారు. శనివారం  కలెక్టరేట్‌లో రూట్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, ఇన్విజిలేటర్లకు ఆర్డర్లను అందించడంతోపాటు పరీక్ష సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. రూట్‌ అధికారులకు ఉదయం 6 గంటలకు ట్రెజరీ కార్యాలయాలను ఓపెన్‌ చేసి పరీక్ష పత్రాలను అందజేస్తామన్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌లు ఉదయం 7.30 గంటలకు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నియామక సిబ్బంది సకాలంలో రిపోర్టు చేయకపోయినా, హాజరు కాకపోయినా సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


Read more