ఆయిల్‌ పామ్‌ సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-09-26T05:43:47+05:30 IST

రాష్ట్ర ప్రజల వంట నూనెల అవసరాలు తీర్చేందుకు ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు 3.66 లక్షల టన్నుల పామాయిల్‌ అవసరం కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 0.45 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది.

ఆయిల్‌ పామ్‌ సాగుకు సన్నద్ధం
చిగురుమామిడి ఆయిల్‌ఫామ్‌ నర్సరీ

 - జనవరి నుంచి మొక్కల పంపిణీ

- జిల్లాలో 11,400 ఎకరాల్లో సాగు ప్రణాళిక

- ఎకరాకు రూ. లక్ష ఆదాయం వస్తుందని అంచనా

- బిందు సేద్యానికి 80 నుంచి 100 శాతం మేరకు సబ్సిడీ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర ప్రజల వంట నూనెల అవసరాలు తీర్చేందుకు ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు 3.66 లక్షల టన్నుల పామాయిల్‌ అవసరం కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 0.45 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. 3.21 లక్షల టన్నుల పామాయిల్‌ కొరతను తీర్చేందుకు ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫామ్‌ సాగును చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలు ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలంగా గుర్తించింది. అందులో కరీంనగర్‌ జిల్లా ఒకటి. 

- లోహియా కంపెనీకి బాధ్యతలు

జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించి గెలలను సేకరించే బాధ్యతను కూడా లోహియా కంపెనీకి అప్పగించింది. జిల్లాలో 2023 నుంచి 11,400 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును చేపట్టాలని నిర్ణయించారు. తర్వాత దశల్లో దీనిని విస్తరించే అవకాశం ఉన్నది. మానకొండూర్‌, గన్నేరువరం, చిగురుమామిడి, గంగాధర, సైదాపూర్‌ మండలాల్లో వెయ్యి ఎకరాల చొప్పున, రామడుగు, చొప్పదండి, తిమ్మాపూర్‌ మండలాల్లో 800 ఎకరాల చొప్పున సాగును చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. హుజూరాబాద్‌, జమ్మికుంట మండలాల్లో 700 ఎకరాల చొప్పున, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో 600 ఎకరాల చొప్పున, శంకరపట్నం, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లో 500 ఎకరాల చొప్పున, కొత్తపల్లిమండలంలో 400 ఎకరాల చొప్పున సాగును చేపడతారు. 

- చిగురుమామిడి మండలంలో నర్సరీ

సాగుకు అవసరమయ్యే మొక్కలను సరఫరా చేసేందుకు లోహియా సంస్థ ఇప్పటికే చిగురుమామిడిలో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నది. 2023 జనవరి నుంచి రైతులకు మొక్కలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఒక్కో మొక్క ఖర్చు 193 రూపాయలు కాగా ప్రభుత్వ సబ్సిడీ పోనూ 20 రూపాయలకే ఒక మొక్కను రైతులకు అందించాలని నిర్ణయించారు. ఆసక్తి ఉన్న రైతులు పట్టాదారు పుస్తకం జిరాక్స్‌, 1బీ జిరాక్స్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోలతో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా ఉద్యానవన అధికారినిగాని, లోహియా కంపెనీ ఫీల్డ్‌ ఆఫీసర్‌నుగాని సంప్రదించాల్సి ఉంటుంది. 

-ఎర్ర నేలలు, నీరు నిలవని నల్ల నేలలు అనుకూలం

ఆయిల్‌ పామ్‌ సాగుకు ఎర్రనేలలు, నీరు నిలువని నల్లనేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలల్లో ఈ పంట సాగు చేయడానికి అనువుగా ఉండదు. ఎకరానికి 57 మొక్కలను నాటవచ్చు. మొక్క నాటినప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు పప్పు ధాన్యాలు, కూరగాయలు, పత్తి, మొక్కజొన్న, పూల మొక్కలల్లాంటి  అంతర పంటలు వేసుకునే అవకాశం ఉన్నది. ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులకు బిందుసేద్యానికి అవసరమయ్యే మైక్రో జెట్‌లను ఏర్పాటు చేసుకోవడానికి ఉద్యానవనశాఖ రాయితీ ఇస్తున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ, బీసీ రైతులకు, ఐదెకరాలలోపు భూమి ఉన్న ఓసీ రైతులకు 90 శాతం సబ్సిడీ, ఐదెకరాల పైన భూమి ఉన్న ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీతో బిందు సేద్యానికి ఆర్థిక సహాయం అందిస్తారు. 

- మూడు సంవత్సరాల తర్వాత దిగుబడి

ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటిన తర్వాత 14 నుంచి 18 నెలలకు పూత మొదలవుతుంది. 36 నెలలవరకు ఈ పూతను తొలగించాలి. మూడు సంవత్సరాల తర్వాత నాణ్యమైన దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఎకరానికి 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఒక్కో చెట్టు నుంచి సంవత్సరానికి 8 నుంచి 12 గెలలు కోతకు వస్తాయి. ఒక్కో గెల 25 నుంచి 30 కిలోల బరువు ఉంటుంది. మార్కెట్‌లో ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ గెలల సరాసరి ధర టన్ను 15 వేల రూపాయలు పలుకుతున్నది. ఎకరం ఆయిల్‌ పామ్‌ సాగుపై సంవత్సరానికి సుమారు లక్షా 50 వేల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 30 వేల రూపాయల ఖర్చు పోను నికరంగా లక్ష నుంచి లక్షా 20 వేల రూపాయల వరకు రైతుకు లాభం చేకూరే అవకాశం ఉన్నదని ఉద్యానవన శాఖ చెబుతుంది. ఆయిల్‌ పామ్‌ గెలలను జిల్లాకు కేటాయించిన కంపెనీ కొనుగోలు చేసి 15 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తుంది. చీడపీడల బాధ ఎక్కువగా లేని ఆయిల్‌ పామ్‌ సాగు రైతులకు లాభసాటిగా ఉండే అవకాశం ఉన్నది. 


Read more