సత్వరమే స్పందించాలి

ABN , First Publish Date - 2022-07-05T05:43:05+05:30 IST

ప్రజావాణి ఫిర్యాదులు, సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 24 ఫిర్యాదులు, వినతి పత్రాలను స్వీకరించారు.

సత్వరమే స్పందించాలి
సమస్యలను వింటున్న కలెక్టర్‌

-  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూలై 4: ప్రజావాణి ఫిర్యాదులు,  సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు.  కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన  ప్రజావాణిలో ప్రజల నుంచి 24 ఫిర్యాదులు, వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే సమస్యల అర్జీలను  సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని, భాధితులకు న్యాయం చేయాలని అన్నారు.  భూసమస్యల  పరిష్కారం కోరుతూ ఎక్కువగా అర్జీలు వస్తున్నందున రెవెన్యూ ఫిర్యాదులు, వినతులపై  అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. వీటితోపాటు ధరణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.  


క్షేత్రస్థాయిలో డ్రైడే నిర్వహించాలి

వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా డ్రైడే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో చేపట్టాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. గ్రామాలతోపాటు పట్టణాల్లోని వార్డుల వారీగా పారిశుధ్యంపై దృష్టిసారించాలన్నారు.  సీజనల్‌ వ్యాధులను నివారించడానికి ప్రతీ మంగళ, శుక్రవారాల్లో  డ్రైడే  నిర్వహించాలని సూచించారు.  మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఐకేపీ, మెప్మా, ఏఎన్‌ఎంలు గ్రామాల్లో  ఇంటింటికీ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.  మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయించాలని, ఫాగింగ్‌ మిషన్‌లతో స్ర్పే చేయించాలని సూచించారు.  జిల్లా అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్‌,  ఖీమ్యానాయక్‌, ఆర్డీవోలు  శ్రీనివాసరావు, లీల, జిల్లా అఽధికారులు పాల్గొన్నారు. 


పెద్దూర్‌ పాఠశాలకు స్థలాన్ని కేటాయించాలి

సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూర్‌ ప్రభుత్వ పాఠశాలను పదోతరగతి వరకు అప్‌గ్రెడ్‌ చేశారని,  సరైన గదులు లేక విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని, స్థలాన్ని కేటాయించాలని  వార్డు కౌన్సిలర్‌ లింగంపల్లి సత్యనారాయణ, విద్యాకమిటీ అధ్యక్షుడు తమ్మెట జీవన్‌, నాయకులు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి  వినతిపత్రాన్ని అందించారు. పెద్దూర్‌ గ్రామంలోని సర్వే నంబరు 11లో 16 గుంట ప్రభుత్వ భూమి ఉందని అందులో 4 గుంట భూమిని  ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించారని,  ప్రభుత్వ భూమిని పాఠశాలకు కేటాయించాలని కోరారు. మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎరవెల్లి వెంకటరమణారావు, మాజీ ఉపసర్పంచ్‌ జెట్టి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T05:43:05+05:30 IST