అడుగడుగునా గుంతలు

ABN , First Publish Date - 2022-11-28T00:51:15+05:30 IST

పలు జిల్లాలను కలిపే రాయపట్నం రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

అడుగడుగునా గుంతలు

చొప్పదండి, నవంబరు 27: పలు జిల్లాలను కలిపే రాయపట్నం రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మూడేళ్లుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో రహదారి బాగా దెబ్బతిన్నది. రోడ్డు సగం మేర దెబ్బతినడంతో విధిలేని పరిస్థితుల్లో వాహనాదారులు రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చొప్పదండి మండల పరిధిలోని రుక్మాపూర్‌ నుంచి ఆర్నకొండ శివారు వరకు వందకుపైగా గుంతలు ఏర్పడ్డాయి. కొలిమికుంట గ్రామ శివారు నుంచి మొదలుకొని చొప్పదండిలోని గుమ్లాపూర్‌ క్రాస్‌ రోడ్‌ వరకు రహదారి గుంతల మయమైంది. ఆర్నకొండ బస్టాండ్‌ వద్ద రోడ్డుపైన తారు కొట్టుకుపోగా మట్టి రోడ్డుగా మారింది. ఇక్కడి ప్రజలు అనేక సార్లు రోడ్డును బాగు చేయాలని ఆందోళనలు నిర్వహించారు. ఇటీవల కొలిమికుంట వద్ద రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మరమతులకు ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. ప్రతి నిత్యం ఈ రహదారిపై వెళ్లే వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రోడ్డుకు మరమతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2022-11-28T00:51:16+05:30 IST