పల్లె దవాఖానాలపై వైద్యుల అనాసక్తి

ABN , First Publish Date - 2022-03-16T05:57:28+05:30 IST

పల్లె దవాఖానాల్లో పనిచేసేందుకు డాక్టర్లు ఆసక్తి చూపడం లేదు.

పల్లె దవాఖానాలపై వైద్యుల అనాసక్తి

- జిల్లాలో 31 ఆరోగ్య ఉప కేంద్రాల ఎంపిక

- ఎంబీబీఎస్‌ డాక్టర్ల కోసం రెండుసార్లు నోటిఫికేషన్లు

- ఆరు నెలలుగా ప్రజలకు అందని వైద్య సేవలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పల్లె దవాఖానాల్లో పనిచేసేందుకు డాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సబ్‌సెంటర్లను దశల వారీగా పల్లె దవాఖానాలుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. వీటి ద్వారా సేవలందించేందుకు వైద్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. వీటిలో డాక్టర్లను నియమించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు ఆరు నెలల్లో రెండుసార్లు నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ ఎవరు ఆసక్తి చూపడం లేదు. 

జిల్లాలో మొదటి విడత 31 సెంటర్లు..

జిల్లాలో తొలి విడతలో 31 సబ్‌సెంటర్లను పల్లె దవాఖాలుగా మార్చేందుకు ఎంపిక చేశారు. ఆయా కేంద్రాల్లో డాక్టర్ల నియామాకాల కోసం గత ఏడాది సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచించింది. ఈ దవాఖానాల్లో స్టాఫ్‌నర్సులను నియమించాలని భావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి సబ్‌ సెంటర్‌కు ఒక డాక్టర్‌ను నియమించి ఎక్కడికక్కడే మెరుగైన వైద్య సేవలను అందించాలని నిర్ణయించింది. ప్రతి కేంద్రానికి ఒక ఎంబీబీఎస్‌ డాక్టర్‌ను కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని నిర్ణయించింది. ప్రతి 5 వేల జనాభాకు ఒక సబ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 102 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా, ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటి పరిధిలో ఇద్దరు ఏఎన్‌ఎంలు, ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ఆశా కార్యకర్తను నియమించారు. వీరి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నారు. సబ్‌సెంటర్ల వద్దకు వచ్చే వారికి సాధారణంగా కొన్ని మందులను ఏఎన్‌ఎంలు అందజేస్తున్నారు. వ్యాధి తీవ్రతను గుర్తించి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, లేదంటే సివిల్‌ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ప్రతి సబ్‌ సెంటర్‌లో ఒక ఎంబీబీఎస్‌ డాక్టర్‌ను నియమించినట్లయితే జ్వరాలు, దగ్గు, జలుబు, ఇతరత్రా చిన్న చిన్న వ్యాధులు సోకిన వాళ్లకు అక్కడిక్కడే వైద్యం అందించే అవకాశాలుంటాయని సీఎం కేసీఆర్‌ భావించారు. వ్యాధి ముదరక ముందే ప్రాథమిక స్థాయిలోనే చికిత్స అందిస్తే ప్రజలు ఆ వ్యాఽధుల నుంచి త్వరిగతిన కోలుకుంటారని భావించారు. అవసరమైన రక్త, మూత్ర పరీక్షల శాంపిళ్లను సేకరించి వెల్‌నెస్‌ సెంటర్లకు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు పంపించినట్లయితే వాటి ఆధారంగా చికిత్స కూడా అందించనున్నారు. ప్రస్తుతం జ్వరాలు ప్రబలితే ప్రజలు నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గానీ, ఇతర ఆసుపత్రులకు గానీ వెళ్లాల్సి వస్తున్నది. సబ్‌ సెంటర్లలోనే డాక్టర్లను నియమిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని భావించారు. 

ఎంపికైన పీహెచ్‌సీలు..

తొలి విడతలో జిల్లాలోని సుల్తానాబాద్‌ గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఐతరాజుపల్లి, పూసాల, గట్టెపల్లి, కొదురుపాక, సుల్తానాబాద్‌ పట్టణంలోని ఆశోక్‌నగర్‌ 1, 2 కేంద్రాలు, సుద్దాల, రేగడిమద్దికుంట, కనుకుల, తొగర్రాయి గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలను పల్లె దవాఖానాలుగా మార్చాలని నిర్ణయించారు. అలాగే కమాన్‌పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జూలపల్లి, పేరపల్లి, రొంపికుంట, రాణాపూర్‌, కన్నాల, బేగంపేట్‌, ముస్త్యాల, కల్వచర్ల, రత్నాపూర్‌, వెంకట్రావుపల్లి, జల్లారం గ్రామాల్లోని కేంద్రాలను, మంథని మండలం గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మంథని 1, 2, 3 సబ్‌ సెంటర్లు, పుట్టపాక, నగరం, సిరిపురం, గుంజపడుగు, ఎగ్లాస్‌పూర్‌, అడవి శ్రీరాంపూర్‌, ఆరెంద గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో ఎంబీబీఎస్‌ డాక్టర్లను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించేందుకు గాను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మొదట సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేశారు. అక్టోబర్‌ 12 వరకు గడువు విధించారు. కానీ కేవలం కొందరు మాత్రమే దరఖాస్తు చేసినప్పటికీ, పని చేసేందుకు వాళ్లు ముందుకు రాలేదు. దీంతో మరోసారి ఫిబ్రవరి 4వ తేదీన 28 దవాఖానాల్లో డాక్టర్ల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రస్తుతం కూడా అంతంత మాత్రంగానే దరఖాస్తులు వచ్చాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. పల్లె దవాఖానాల్లో పనిచేసేందుకు ఎంబీబీఎస్‌ డాక్టర్లు ఆసక్తి చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. 

Read more