వరికి తెగుళ్లు

ABN , First Publish Date - 2022-10-19T05:03:58+05:30 IST

పంట వేసింది మొదలు చేతికొచ్చి విక్రయించే వరకు అన్నదాతకు కష్టాలు వీడడం లేదు. సీజన్‌ ఆరంభంలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడగా కోతల దశలో అల్పపీడన ప్రభావంతో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పంట చేతికి వచ్చే దశలో తెగుళ్ల బెడద రైతులను కలవరపెడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరికి దోమపోటు, మొగిపురుగు, ఇతర తెగుళ్ల సోకుతుండడంతో దిగుబడి తగ్గుతుందని అన్నదాతలు దిగులు పడుతున్నారు.

వరికి తెగుళ్లు
ఇల్లంతకుంటలో దోమపోటు సోకిన వరి

- వీడని వర్షాలతో దోమపోటు

- మొగిపురుగు ఇతర తెగుళ్లతో ఆందోళన  

- తడారని పొలాల్లో కోతకు ఇబ్బందులు 

- ధాన్యం దిగుబడిపై అన్నదాతల దిగాలు 

- జిల్లాలో 1.76 లక్షల ఎకరాల్లో సాగు 

- 3.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పంట వేసింది మొదలు చేతికొచ్చి విక్రయించే వరకు అన్నదాతకు కష్టాలు వీడడం లేదు. సీజన్‌ ఆరంభంలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడగా కోతల దశలో అల్పపీడన ప్రభావంతో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పంట చేతికి వచ్చే దశలో తెగుళ్ల బెడద రైతులను కలవరపెడుతోంది.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరికి దోమపోటు, మొగిపురుగు, ఇతర తెగుళ్ల సోకుతుండడంతో దిగుబడి తగ్గుతుందని అన్నదాతలు దిగులు పడుతున్నారు. వ్యవసాయ అధికారులు తెగుళ్ల నివారణపై అవగాహన కల్పిస్తున్నా వర్షాలు వీడకపోవడంతో పొట్ట దశకు చేరుకున్న క్రమంలో దిగుబడి వస్తుందో? రాదోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పొలాలు తడారకపోవడంతో హార్వేస్టర్లతో ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది. చైన్‌ సిస్టమ్‌ హార్వేస్లర్టు మాత్రమే వినియోగించాల్సి ఉండడంతో సరిపడా హార్వేస్టర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారం భించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో వర్షాలు కురుస్తుండడంతో కోతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు  దోమ పోటు ఇతర తెగుళ్లతో రైతులు అందోళన చెందుతున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల వరి కోతలు వారం రోజులుగా కోతలు ప్రారంభించారు. మరికొన్ని మండలాల్లో  కోతకు వరి పంట సిద్ధంగా ఉంది. గంభీరావుపేటలో 18,350 ఎకరాలు, ఇల్లంతకుంట 24363, ముస్తాబాద్‌ 21244, సిరిసిల్ల 4293, తంగళ్లపల్లి 19266, వీర్నపలి 6551 ఎల్లారెడ్డిపేట 16581, బోయినపల్లి 12306, చందుర్తి 14506, కోనరావుపేట 17641, రుద్రంగి 5449, వేములవాడ  5083, వేములవాడ రూరల్‌లో 10442 ఎకరాల్లో వరిసాగు చేశారు. కోతలు కూడా ప్రారంభించారు. వర్షాలతో ఇబ్బందులు పడుతుండగా బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడన ప్రభావం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో దిగుబడిపై రైతులు ఆవేదన చెందుతున్నారు. 

  ధాన్యం దిగుబడిపై అంచనా  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.76 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దీని ద్వారా 3.70 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులు పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 254 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ ద్వారా 54 కేంద్రాలు, సింగిల్‌ విండోల ద్వారా 188 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా 10 కేంద్రాలు, మెప్మా ద్వారా 4 కేంద్రాలు మార్కెట్‌ కమిటీల ద్వారా 3 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.   

దోమపోటుతో పంటకు నష్టం  

- గన్నారం నర్సయ్య, రైతు పెద్దలింగాపూర్‌

వరిపంటకు దోమపోటు సోకడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. రెండు ఎకరాల భూమిలో వరిపంటను సాగు చేశాను. తరచూ వర్షం పడుతూ, ఎండ కొడుతుండడంతో దోమపోటు వచ్చింది. పక్క చేనుకూ సోకుతోంది. దోమపోటు వస్తే రెండు రోజుల్లోనే పంటపూర్తిగా దెబ్బతింటుంది. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వచ్చి రైతులకు అవగాహన కల్పించాలి. వరి రైతులకు ఈ సారి కష్టాలు తప్పేట్లు లేవు.


Updated Date - 2022-10-19T05:03:58+05:30 IST