మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ABN , First Publish Date - 2022-01-29T05:25:54+05:30 IST

గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ అధికారులను ఆదేశించారు.

మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జీడీనగర్‌లో నర్సరీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ

-  కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ 

అంతర్గాం, జనవరి 28: గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ అంతర్గాం మండలంలోని కుందనపల్లి గ్రామాన్ని సందర్శించి బుగ్గగుట్ట సమీపంలో ఏర్పాటు చేసిన మల్టీ లేయర్‌ ప్లాంటేషన్‌, ఉపాధిహామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడుతూ పని ప్రదేశంలో వసతుల కల్పన, వేతనాలు చెల్లింపులను అడిగి తెలుసుకున్నారు. కూలీల జాబ్‌కార్డులో పనివివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి కూలీ వేతనాలు సత్వరం చెల్లింపులు జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి వైరస్‌ను నివారించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా గ్రామీణాభివృద్ధికి శాఖ అధికారి శ్రీధర్‌, ఎంపీవో సమ్మిరెడ్డి, ఏపీవో రమేష్‌, టీఏ రాజేశం పాల్గొన్నారు. 

- పాలకుర్తి: గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని జీడీనగర్‌ నర్సరీని  కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ శుక్రవారం తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలోని ఇళ్లకు పంపిణీ చేసే మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇళ్లలోకి అధికంగా పూలమొక్కలు పంపే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అనంతరం బుగ్గ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మల్టీలేయర్‌ ప్లాంటేషన్‌ను పరిశీలించి, వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్‌, డీఆర్‌డీవో పీడీ అశోక్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ మాధవి, ఇన్‌చార్జీ ఎంపీడీవో షబ్బీర్‌, సంబంధిత అధికారులు, సర్పంచ్‌ సూర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T05:25:54+05:30 IST