వంద శాతం నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-09-09T05:06:23+05:30 IST

గర్భిణుల నమోదుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, జిల్లాలో వారం రోజుల్లోగా వందశాతం లక్ష్యం పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

వంద శాతం నమోదు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గర్భిణుల నమోదుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, జిల్లాలో వారం రోజుల్లోగా వందశాతం లక్ష్యం పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌  నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్‌ ఆఫీసర్‌లు, ఆర్‌బీఎస్‌కే వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.    ఫ్రంట్‌ లైన్‌వర్కర్స్‌కు కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ ఇవ్వడంలో జిల్లా వెనుకబడి ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.  ఎన్‌క్యూఏఎస్‌ సర్టిఫికెట్‌కు సంబంధించి ఈనెల 25న రాష్ట్ర అధికారుల బృందం జిల్లాలో తనిఖీలు నిర్వహించనున్నందున కోనరావుపేట, కొదురుపాక, సిరిసిల్ల పీఎస్‌ నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడాలన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో సంస్థాగత డెలివరీల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆసుపత్రికి ఇద్దరు గైనకాలజిస్టులను, ఒక పిల్లల వైద్యుడు, ఒక మత్తు డాక్టర్‌ను కేటాయించినందున డెలివరీల సంఖ్యను మరింతగా పెంచాలని అన్నారు. దీని ద్వారా జిల్లా ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గేలా చూడాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌  డాక్టర్‌ మహేష్‌రావుకు కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌ రావు, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ రజిత, సిరిసిల్ల వేములవాడ ఆసుపత్రి సూపరింటెండెంట్‌లు డాక్టర్‌ మురళీధర్‌రావు డాక్టర్‌ మహేష్‌రావు  పాల్గొన్నారు.

Read more