భైంసా వెళ్లేందుకు వీసా తీసుకోవాలా?

ABN , First Publish Date - 2022-11-28T01:49:15+05:30 IST

భైంసా వేరే దేశంలో ఉందా.. భైంసా వెళ్లాలంటే వీసా తీసుకోవాలా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ప్రశ్నించారు.

భైంసా వెళ్లేందుకు వీసా తీసుకోవాలా?

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌ క్రైం, నవంబరు 27: ‘భైంసా వేరే దేశంలో ఉందా.. భైంసా వెళ్లాలంటే వీసా తీసుకోవాలా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఆదివారం రాత్రి ఆయన కరీంనగర్‌లో మాట్లాడుతూ భైంసాను ప్రత్యేక దేశం చేసి ఓవైసీ కుటుంబానికి అప్పజెబుతున్నారా అని సీఎంను ప్రశ్నించారు. భైంసాలో 12 ఇళ్లు దహనం చేస్తే కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేని సీఎం.. నీరు నిజమైన హిందువును అని అంటావా అని మండిపడ్డారు. నిర్మల్‌ ప్రజలు వెయ్యి ఊడల మర్రి చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజు నిజాం మెడలు ఏ విధంగా సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌ వంచారో అదే గతి పడుతుందన్నారు. భైంసా ప్రజలకు మేము భరోసా ఇవ్వవద్దా? అన్నారు. భైంసా తెలంగాణ రాష్ట్రంలో ఒక భాగమనే విషయం సీఎం గుర్తుంచుకోవాలన్నారు. భైంసాను కాపాడలేని నీవు ముఖ్యమంత్రివా.. చేతకాకుంటే అన్నిమూసుకుని ఇంట్లో కూర్చోవాలని ఘాటుగా వాఖ్యలు చేశారు. భైంసాను కాపాడలేని, చేతకాని దద్దమ్మ సీఎం అన్నారు. పాతబస్తీ నుంచి ప్రశాంత వాతావరణంలో యాత్రను ప్రారంభించిన చరిత్ర బీజేపీదేనన్నారు. భైంసా సున్నితమైన ప్రాంతమని పోలీసు అధికారులు ఇప్పుడు హఠాత్తుగా చెబుతున్నారని, తాము అనుమతి కోరినప్పుడు సున్నితమైన ప్రాంతమనేది గుర్తుకురాలేదా అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. భైంసాలో 3 రోజుల నుంచి బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నప్పడు ఈ ముఖ్యమంత్రికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భైంసా వస్తుంటే బందోబస్తు ఏర్పాట్లు చేసినప్పుడు గుర్తుకు రాలేదా అన్నారు. బీజేపీ ప్రజాసంగ్రామయాత్ర అంటే ఎందుకు భయపడుతున్నాడో సీఎం చెప్పాలన్నారు. ఇప్పటి వరకు 4 విడతలప్రజాసంగ్రామయాత్ర ప్రశాంతవాతావరణంలో పూర్తి విజయవంతం చేశామన్నారు. బీజేపీ ప్రజాసంగ్రామయాత్రను ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు.

Updated Date - 2022-11-28T01:49:17+05:30 IST