క్రమబద్ధీకరణలో కదలిక

ABN , First Publish Date - 2022-09-27T05:54:54+05:30 IST

ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు కసరత్తు మొదలైంది. 2014 జూన్‌ 2వ తేదీకి ముందు నిర్మించిన ఇళ్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు.

క్రమబద్ధీకరణలో కదలిక
సిరిసిల్ల పట్టణం

- ప్రభుత్వ స్థల్లాలో అక్రమ నిర్మాణాలు 

- 58, 59 జీవోల కింద 275 దరఖాస్తులు 

- ఐదు నెలలకు మళ్లీ కసరత్తు 

- 58 జీవో దరఖాస్తుల పరిశీలన పూర్తి

- కొనసాగుతున్న 59 జీవో దరఖాస్తుల పరిశీలన 


 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్ల  క్రమబద్ధీకరణలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు  కసరత్తు మొదలైంది. 2014 జూన్‌ 2వ తేదీకి ముందు నిర్మించిన ఇళ్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలి స్తున్నారు.  ప్రత్యేక యాప్‌ ద్వారా నమోదు చేస్తున్నారు. ఈ సంవత్సరం మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 58, 59 జీవోల కింద 275 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 58 జీవో ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ప్రస్తుతం 59 జీవో కింద 139 దరఖాస్తులు రాగా వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు 64 దరఖాస్తులను పూర్తి చేశారు. దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి జిల్లా, డివిజన్‌స్థాయి అధికారితో పాటు ఒక సహాయకుడు, స్థానికంగా ఉండే ఉద్యోగిని నియమించారు. సెల్‌ఫోన్‌లో జీవో 59కి సంబంధించిన ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశారు. యాప్‌లో దరఖాస్తు నంబరు నమోదు చేయగానే దరఖాస్తుదారుడి వివరాలు వస్తాయి. దాని ప్రకారం విచారణ జరుపుతున్నారు. 2014 జూన్‌2వ తేదీ కంటే ముందు నిర్మించిన ఇంటి వివరాలు, ఇంటి పన్నులు, విద్యుత్‌ బిల్లు, కుళాయి పన్ను, స్థలం సంక్రమించిన తీరు తదితర అంశాలను తెలుసుకుంటున్నారు. విచారణలో భాగంగా ఇంటి ముందు ఒక ఫొటోను కూడా తీసుకుంటున్నారు. 59 జీవో ప్రకారం రెగ్యులరైజ్‌ చేసిన తరువాత సంబంధిత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఐదు నెలల తరువాత ఇళ్ల క్రమబద్ధీకరణలో కదలిక రావడంతో  దరఖాస్తుదారులకు ఊరట లభించినట్లయ్యింది. 

జీవోలపై నామ మాత్రపు స్పందన 

ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చినా జిల్లాలో నామమాత్రపు స్పందనే వచ్చింది. జీవో నంబరు 58, 59పై ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించకపోవడంతో నిరుపేదలు క్రమబద్ధీకరణ అవకాశాన్ని వినియోగించుకోలేదని భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సదస్సులు, గ్రామసభలు పెట్టి ప్రచారం కల్పించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. మొదట జీవో నంబరు 58, 59 విడుదల చేయగా దానికి అనుబంధంగా జీవో నంబరు 14 విడుదల చేసింది. 125 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మాణాలు చేపడితే  ప్రభుత్వం  ఉచితంగానే క్రమబద్ధీకరించనుంది. 250 చదరపు గజాలలోపు ఉన్నవాటిని మార్కెట్‌ విలువలో 50 శాతం, 250 నుంచి 500 గజాలలోపు ఉన్న ఇళ్లకు  75 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే వందశాతం రుసుము వసూలు చేయాలని నిర్ణయించిది. ఈమేరకు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గతంలో బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం చేసుకున్న దరఖాస్తుదారులు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. 58, 59 జీవో క్రమబద్ధీకరణపై కూడా దరఖాస్తుదారులు అయోమయంలోనే ఉన్నారు. 

జిల్లాలో క్రమబద్ధీకరణకు 275 దరఖాస్తులు

పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేసుకున్నావారికి క్రమబద్ధ్దీకరణ ఎంతో ఉపయోగపడే అవకాశం ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో దరఖాస్తులు తక్కువగానే వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ స్థలాల్లో  వేల సంఖ్యలో నిర్మాణాలు ఉన్నాయి. వాటికి సంబంధించి దరఖాస్తు మాత్రం చేసుకోలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాల్లో కేవలం 275 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 58 జీవో కింద 136 దరఖాస్తులు రాగా సిరిసిల్లలో 6 దరఖాస్తులు, తంగళ్లపల్లి 58, గంభీరావుపేట 1, వేములవాడ 38, రుద్రంగి ఒకటి,  కోనరావుపేట 26, ఇల్లంతకుంట 3, ముస్తాబాద్‌ 1, వీర్నపల్లిలో రెండు దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం పరిశీలిస్తున్న 59 జీవోలో 139 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తంగళ్లపల్లిలో 38, సిరిసిల్ల 35, వేములవాడ 37, కోనరావుపేట 5, ఇల్లంతకుంట 6, చందుర్తి 6, ముస్తాబాద్‌ 3, గంభీరావుపేట 2, బోయినపల్లి 2, రుద్రంగి ఒకటి, వేములవాడ రూరల్‌ 2, ఎల్లారెడ్డిపేటలో 2 దరఖాస్తులు వచ్చాయి.

జిల్లాలో అక్రమ నిర్మాణాలు, లే అవుట్‌లు 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పడిన తరువాత అభివృద్ధిలో ముందుకు సాగుతోంది. ఈ  క్రమంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. జిల్లా కేంద్రం చుట్టుపక్కల గ్రామాలు, సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో జిల్లా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న వేములవాడ, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, బోయినపల్లి, చందుర్తి మండలాల్లో కొందరు రియల్‌ వ్యాపారులు అనుమతులు లేకుండానే ప్లాట్లుగా మార్చి భూములను విక్రయిస్తున్నారు. అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ స్థలాలు సైతం ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారులు అక్రమ ప్లాట్లపై దృష్టి సారించినా గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం సాగిస్తున్నారు. 


Read more