తెలంగాణ మట్టి బిడ్డ మోహన్‌

ABN , First Publish Date - 2022-08-25T05:52:05+05:30 IST

తెలంగాణ మట్టి వాసనలు ముఖ్యంగా సిరిసిల్ల జీవితాలను, నేత కార్మికుల గుండెఘోషను వినిపిస్తూ సాహిత్యం వైపు అడుగులు వేసిన బాలసాహితీవేత్త, అనువాదకుడు, సభా వ్యాఖ్యానానికి వన్నెతెచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ పత్తిపాక మోహన్‌కు ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

తెలంగాణ మట్టి బిడ్డ మోహన్‌
అవార్డు పొందిన సంకలనం

- పిల్లలకు సాహిత్య అక్షరాలు

- బాలసాహిత్యానికి వారధి 

- ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి ఎంపిక 

సిరిసిల్ల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మట్టి వాసనలు ముఖ్యంగా సిరిసిల్ల జీవితాలను, నేత కార్మికుల గుండెఘోషను వినిపిస్తూ సాహిత్యం వైపు అడుగులు వేసిన బాలసాహితీవేత్త, అనువాదకుడు, సభా వ్యాఖ్యానానికి వన్నెతెచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ పత్తిపాక మోహన్‌కు ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి కవిత్వంలో డాక్టర్‌ సి నారాయణరెడ్డి, అనువాదంలో డాక్టర్‌ నలిమెల భాస్కర్‌, ఇప్పుడు బాల సాహిత్యంలో డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ నిలిచారు. బాలసాహిత్యం అభివృద్ధి కోసం కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రతి యేడాది అత్యున్నత స్థాయి బాలసాహిత్యానికి 2010 సంవత్సరం నుంచి అందిస్తూ వస్తుంది. 2022 సంవత్సరానికి గాను అనేక సంకలనాలతో పోటీపడి డాక్టర్‌ పత్తిపాక మోహన్‌  రచనలతో బాలల తాతా బాపూజీ (పిల్లల కోసం గాంధీ గేయాలు, గేయకథ) సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైంది. ఈ మేరకు బుధవారం అకాడమీ ప్రకటించింది. సంకలనాన్ని జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రెండు భాగాలు ఉండగా మొదటి భాగంలో గాంధీ గేయాలు, రెండో భాగంలో గాంధీ గేయకథ పొందుపరిచారు. 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలు చదివి పాడుకునే విధంగా సరళమైన భాషలో సంకలనాన్ని తీసుకువచ్చారు. సంకలనంలో గాంధీజీ ముఖ్యఘట్టాలకు సంబంధించిన చిత్రాలను పొందుపరచడంతో  సంకలనం  ఆకర్షణీయంగా మారింది. పత్తిపాక మోహన్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత వృత్తి నేపథ్యం గల కుటుంబంలో జన్మించాడు. మోహన్‌ ఏడో తరగతిలో రిపబ్లిక్‌ డే సందర్భంగా సభా వ్యాఖ్యానంతో మొదలైన ప్రస్థానం ఢిల్లీ వరకు చేరింది. ‘పత్తిపాక మోహన్‌ మైక్‌ ముందుకు వచ్చి మాట్లాడితే సభంతా తంగేడుపూలు పూస్తాయి.. ఆయన గొంతు పలికితే గునుగు పూలు.. దసన్న పూలు వేదిక మీద నాట్యమాడుతాయి’ అని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి నారాయణరెడ్డి చెబుతూ మోహన్‌ను వ్యాఖ్యాత దక్షకుడుగా అభివర్ణించారు. సభా వ్యాఖ్యాతతో మొదలైన తన ప్రస్థానం అక్షరం వైపు నడిపించింది. వాస్తవికతతో అందించే రచనలతో అస్థిత్వవాద కవిగా ముద్ర వేసుకున్నాడు. తెలుగు ఉపాధ్యాయుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన మోహన్‌ ప్రస్తుతం నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా ఢిల్లీలో ఉపసంపాదకుడిగా పనిచేస్తున్నారు. 2001లో గజల్‌పై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ను అందుకున్నారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సంబంఽధించిన ఎన్‌బీటీలో చేరిన తరువాత పిల్లల కోసం సాహిత్యం వైపు పూర్తిస్థాయి లో అడుగులు వేస్తూ కవి, రచయిత, విమర్శకులు, బాలసాహితీవేత్తగా అనేక సంకలనాలను అందించారు. పిల్లల కోసం ఇరుగుపొరుగు భాషల నుంచి అనువాద పుస్తకాలను వెలువరిచారు. 

- ఎన్నెన్నో సంకలనాలు 

బాలసాహితీవేత్త అనువాదకుడు, కవి, సంపాదకుడిగా ఎన్నెన్నో సంకలనాలను వెలువరించారు. సిరిసిల్ల మానేరు రచయితల సంఘం వ్యవస్థాపకుడిగా అనేక సంకలనాలను అందించారు. బాలసాహిత్యంలో 2004లో పిల్లల కోసం మన కవులు, సహస్ర భాగవత సప్తాహా దీప్తి, 2009లో చందమామ రావే, 2016లో వెన్నముద్దలు, 2018లో అకుపచ్చని పాట, ఒక్కేసి పువ్వేసి చందమామ, 2019లో అఆఇఈ బాల లయలు, 2020లో బాలల తాతా బాపూజీ, 2021లో జయహో బాలసాహిత్యం, పిల్లల కోసం సినారె కథ, మూడుపిల్లల కథలు, మోహన్‌ పిల్లలతో కవిత్వాలు రాయించి వెలువరిచిన సంకలనాల్లో 1997లో స్వర్ణభారతికి బాల భారతి కవితా నీరాజనం, 2013లో పిల్లలకోసం మనపాటలు, 2017లో పిల్లల కోసం పొడుపు కథలు, 2017లో కథలవాగు, కవితల సింగిడి, 2019లో వానావానా వల్లప్ప, అకుపచ్చని అశలతో, ఎంకటి కథలు, 2020లో సహన పరీక్ష, మా బడి కథలు, 2021లో జో అచ్యుతానంద జోజో ముకుందా, సరికొత్త అవు, పులి కథలు, 2022లో కథల చెట్టు, సిరిసిల్ల సిరిమల్లెలు సంకలనాలను వెలువరించారు. సంపాదకత్వంలో 1993లో  కవితా పాంచజన్యం, 2004లో గూడూరి సీతారం కథలు, 2005లో పెరటి చెట్టు, డాక్టర్‌ ఎన్‌ గోపి నానీలు, 2013లో కరీంనగర్‌ జానపదీయాలు, 2017లో ఊరి దుఃఖం, దీంతో పాటు 64 వసంతాల సినారె, వడ్డెపల్లి రజతోత్సవ సంచికలు, బీఎస్‌ రాములు స్వర్ణోత్సవ సంచిక, మిద్దె రాములు బోనం, సీతారం గానుగ చెట్టు సంచికలు వెలువరిచారు. వివిధ పత్రికల్లో బాలసాహిత్య రచనలు అందించారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక తరగతుల పుస్తకాలతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు పాఠ్యాంశ పుస్తకాల్లో గేయాలను అందించారు. బాల సాహిత్యంలో మోహన్‌ చేసిన అనువాదాల్లో ఇంగ్లీష్‌ నుంచి 2007లో ప్రాణస్నేహితులు, ముత్తు కలలు, 2008లో టిప్పుసుల్తాన్‌ కథ, ఝాన్సీరాణీ కథ, తోకలు, అనంది ఇంధ్రదనస్సు, 2009లో మంచి మిత్రులు, 2010లో ఎందుకు, మామిడిపండు పక్షులు, 2011లో షీబూకు గంట దొరికింది. ఫజిల్‌, 2012లో ఏదీ ఇస్తామో దానిని తిరిగి పొందుతాము, జీరోమితే, 2021లో సోమరిపోతు ఎలుక, భక్త సాల్‌బేగ, సూర్యుడు చంద్రుడు కలిసి మెలిసి, కలిసినపుడు అభివాదం చేయంది, నీకంటే నేనే గొప్ప, పొడుగు పొట్టి, ఏం జరిగింది, 2022లో ఈ సువిశాల ప్రపంచం, మొత్తాయి నాయి నాయనమ్మ, కాబూలీవాలా సేవకుడైన రాజు, హిందీ నుంచి 2021లో సరదా సరదా మెట్రో, కుంభమేళా, 2011లో చంద్రుడు లెక్క మరిచిపోయాడు, అనువాదాలను అందించారు. కవిత్వంలో ఖడ్గధార, సముద్రం, బంతిపూలు, కౌముది, తెగిన పోగు, మనకవులు, పచ్చబొట్టు, కఫన్‌, లాక్‌డౌన్‌ కవితా సంపుటాలు అందించారు. సాహిత్య రంగంలో బాల సాహిత్య కమిటీలు, వర్క్‌షాప్‌లను నిర్వహించారు. మోహన్‌ రచనలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి. 

సాహిత్య రంగంలో అక్షరాలతో పరుగులెత్తుతున్న  మోహన్‌ అనేక అవార్డులను అందుకున్నారు.  అనేక పురస్కారాలను పొందారు. శ్రీలంక, బ్యాంకాక్‌, మెక్సికో లతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన బుక్‌ పెయిర్‌, కవి సమ్మేళనాల్లో పాల్గొని ప్రతిభను కనబరిచారు. 

- సాహితీవేత్తల హర్షం..

సిరిసిల్లకు చెందిన బాల సాహితీవేత్త డాక్టర్‌ పత్తిపాకమోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సాహితీ సంస్థలు, కవులు, రచయితలు అభినందనలు తెలిపారు. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యుత్తమమైన పురస్కారానికి ఎంపిక కావడం పట్ల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ నలిమెలభాస్కర్‌, అఖిల భారత తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, కవి, అనువాదకుడు సీని విమర్శకుడు వారాల అనంద్‌, సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి, ప్రధాన కార్యదర్శి వాసరవేణి పర్శరాములు, ఉపాధ్యక్షుడు టి వి నారాయణ, కవులు, రచయితలు గరిపెల్లి అశోక్‌, అడెపు లక్ష్మణ్‌, జిందం అశోక్‌, డాక్టర్‌ జనపాల శంకరయ్య, గోనె బాల్‌రెడ్డి, నాగేంద్రశర్మ, పోరండ్ల మురళీధర్‌, షెహానాజా, చిటికెన కిరణ్‌ తదితరులు అభినందనలు తెలిపారు. 

-  మోహన్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు 

కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారానికి ఎంపికైన సిరిసిల్లకు చెందిన డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం అభినందించారు. మోహన్‌ సాహిత్య రంగంలో ఇంకా అనేకమైన ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. 

-  బాలసాహిత్య సేవకు గుర్తింపు 

అవార్డు గ్రహీత డాక్టర్‌ పత్తిపాక మోహన్‌

రెండు దశాబ్దాలుగా బాల సాహిత్య సేవకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గుర్తింపుగా భావిస్తున్నాం. సిరిసిల్ల, హైదరాబాద్‌, ఢిల్లీ వరకు నా సాహిత్య ప్రయాణానికి సిరిసిల్ల కవులు, రచయితలు ముఖ్యంగా డాక్టర్‌ సి నారాయణరెడ్డి, నలిమెల భాస్కర్‌, జూకంటి జగన్నాథం, గూడూరి సీతారాంల స్పూర్తి, సిరిసిల్ల పాత్రికేయులు, మరెందరో అందించిన ప్రోత్సహాంతో ఈ రంగంలో ముందుకు వెళ్లాను. చందమామ కథలు మొదలుకోని యుద్ధనపూడి నవలలు, సినిమా కథలు మా మేనత్త ఇందిరాబాయి వినిపించేది. సాహిత్య ప్రపంచంతో నాకు అనుబంధం ఏర్పడింది. బాల సాహిత్యం వికాసమే భవితకు పునాదిగా భావిస్తాను. పిల్లలు సాహిత్యంలో తమ రచనలు చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. 


Read more