ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరందించాలి

ABN , First Publish Date - 2022-03-23T06:18:13+05:30 IST

మిషన్‌భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు

ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి 22: మిషన్‌భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీరు  అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం వేములవాడ పట్టణ పరిధిలోని మిషన్‌భగీరథ ద్వారా తాగునీటి సరఫరా అభివృద్ధి పనుల పురోగతిపై  సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా కోసం చేపడుతున్న పనుల్లో వేగం పెంచాలన్నారు. కొత్తగా చేపట్టిన 900, 500, 1100 కేఎల్‌ఈఎల్‌ఎస్‌ఆర్‌ పనులు పూర్తయినట్లు, 1200 కేఎల్‌ పనులు ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. ఇదివరకే అర్భన్‌ కాలనీ, న్యూ అర్భన్‌ కాలనీ, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయన్నారు. 113 కిలోమీటర్ల మేర పైపులైన్‌ పూర్తయ్యియ్యినట్లు, లీకేజీల నియంత్రణ పనులు ప్రగతిలో ఉన్నట్లు చెప్పారు. పట్టణ జనాభా 38,500 ఉండగా వీరికి 65 లక్షల లీటర్ల నీటి డిమాండ్‌ ఉందన్నారు. పట్టణంలో రెండు ఓపెన్‌ బావులు, 70 పవర్‌బోరులు ఉన్నాయన్నారు. ఇంటిగ్రేటేడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ పనులు రగ్రౌండింగ్‌ అయ్యాయని, మిగతా పనులు ప్రగతిలో ఉన్నాయని అన్నారు. టీయూఎఫ్‌ ఐడీసీ పనులకు టెండర్లు పిలిచామన్నారు.   కూరగాయల మార్కెట్‌ పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రధాన కూడళ్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడవద్దని, ప్రతీ రోజు పనుల పురోగతిపై క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.  సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, మిషన్‌భగీరథ ఎస్‌ఈ రవీందర్‌, గ్రిడ్‌ ఈఈ విజయ్‌కుమార్‌, ఇంట్రా ఈఈ జానకి, వేములవాడ మున్సిపల్‌ కమీషనర్‌ శ్యాంసుందర్‌రావు, టీపీఎస్‌ అంజయ్య, ఏఈ నర్సింహ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-23T06:18:13+05:30 IST