వరి నాట్లకు వలస కూలీలు

ABN , First Publish Date - 2022-12-31T00:31:05+05:30 IST

వ్యవసాయ కూలీలకు డిమాండ్‌ పెరిగింది. పునాస పంటల వరి కోతలు ఒకే సారి పూర్తి కావడం, యాసంగి సాగును మొదలు పెట్టడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూలీల కొరతతో రైతులు సతమతం అవుతున్నారు

వరి నాట్లకు వలస కూలీలు
నారుమడిలో బీహార్‌ కూలీలు

- కూలీల కొరతతో అడ్వాన్స్‌లు

- గతేడాది కూలి రూ.500

- ఇప్పుడు రూ.650 వరకు

- ఇతర రాష్ట్రాల కూలీలతో నాట్లు

- జిల్లాలో యాసంగి సాగు 1.79 లక్షల ఎకరాలు

- 1.73 లక్షల ఎకరాల్లో వరి

- కూలీల కొరతతో అన్నదాతల సతమతం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వ్యవసాయ కూలీలకు డిమాండ్‌ పెరిగింది. పునాస పంటల వరి కోతలు ఒకే సారి పూర్తి కావడం, యాసంగి సాగును మొదలు పెట్టడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూలీల కొరతతో రైతులు సతమతం అవుతున్నారు. నాట్లు వేయడానికి ముందుగానే వ్యవసాయ కూలీలకు రైతులు అడ్వాన్స్‌లు చెల్లి స్తున్నారు. ఇతర జిల్లాల నుంచి రవాణా చార్జీలు చెల్లించి కూలీలను రప్పిస్తున్నారు. దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో యాసంగిలో నాట్ల జోరు పెరిగింది. అదును దాటకముందే నాట్లు వేసేందుకు అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల కూలీలతో నాట్లు వేయిస్తున్నారు. వరి సాగుపై ఈ సారి కూడా అంక్షలు లేకపోవడంతో జిల్లాలో ఎక్కువమంది అన్నదాతలు వరివైపే మొగ్గు చూపారు.

ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వ్యవసాయ కూలీలు వలస వెళ్లేవారు. జిల్లాలో సమృద్ధిగా భూగర్భ జలాలు పెరగడం, చెరువులు, కుంటలు ప్రాజెక్ట్‌లలోకి కాళేశ్వరం జలాలు సమృద్ధిగా వచ్చి చేరడంతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగును పెంచుకుంటున్నారు. దీంతో నాట్లు వేయడానికి కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్న వారికి ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్న కూలీలతో నాట్ల జోరు పెరిగింది. బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌తోపాటు ఆంధ్రా, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూలీలు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకొని నాట్లు వేస్తున్నారు. నాట్లు వేసేందుకు జిల్లాలో గత సంవత్సరం రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు కూలి ఉండేది. ప్రస్తుతం రూ.550 నుంచి రూ.650 వరకు చెల్లిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రవాణా ఛార్జీలు కూడా ఇస్తున్నారు. మగవారికి రూ.800 నుంచి రూ.1000 వరకు చెల్లిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలు ఎకరం చొప్పున గుత్తాగా మాట్లాడుకొని నాట్లు వేయిస్తున్నారు. ఎకరానికి రూ.5500 నుంచి రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. ఇతర రాష్ట్రాల కూలీలతో యాసంగి సాగులో నాట్లు సకాలంలో పూర్తవుతాయని రైతులు భావిస్తున్నారు.

జిల్లాలో 1.73 లక్షల ఎకరాల్లో వరి

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 1.79 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో ప్రధానంగా వరి లక్షా 73 వేల 600 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇప్పటికే 40 శాతం వరినాట్లు పడ్డాయి. మొక్కజొన్న 1750 ఎకరాలు, శనగలు 765 ఎకరాలు, పెసర 495 ఎకరాలు, మినుములు 60 ఎకరాలు, బబ్జెర్లు 65 ఎకరాలు, నువ్వులు 1110 ఎకరాలు, చెరకు 195 ఎకరాలు, పొద్దు తిరుగుడు 1110 ఎకరాలు, గోధుమ 80 ఎకరాలు సాగు చేస్తున్నారు.

Updated Date - 2022-12-31T00:31:14+05:30 IST