రూ.18కోట్ల పనులకు ఆమోదం

ABN , First Publish Date - 2022-12-30T23:40:44+05:30 IST

రామగుండం నగరపాలక సంస్థ ఖజా నాలో సొమ్ములు లేకున్నా, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకున్నా ఐదేళ్లకు సరిపడా అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు ఒకే సారి ఆమోదం పలికారు. వార్షిక బడ్జెట్లు, నిధులతో సంబంధం లేకున్నా ఏకంగా రూ.18కోట్ల పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

 రూ.18కోట్ల పనులకు ఆమోదం
మాట్లాడుతున్న మేయర్‌ అనీల్‌కుమార్‌

ఓసీపీ-5దుమ్ముతో జనం ఉక్కిరిబిక్కరవుతున్నారన్న కార్పొరేటర్లు

కోల్‌సిటీ, డిసెంబరు 30: రామగుండం నగరపాలక సంస్థ ఖజా నాలో సొమ్ములు లేకున్నా, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకున్నా ఐదేళ్లకు సరిపడా అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు ఒకే సారి ఆమోదం పలికారు. వార్షిక బడ్జెట్లు, నిధులతో సంబంధం లేకున్నా ఏకంగా రూ.18కోట్ల పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. శుక్రవారం మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌ అధ్యక్షతన రామగుండం నగరపాలక సంస్థ సాధారణ సమావేశంనిర్వహించారు. ఈ సమావేశంలో ఒక్కో డివిజన్‌కు రూ.50లక్షల నుంచి రూ.2కోట్ల వరకు పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అత్యధికంగా 33వ డివిజన్‌ పరిధిలోని ఫైవింక్లయిన్‌ ఏరియాలో అభివృద్ధి పనులకు రూ.2కోట్లు పెట్టగా 26వ డివిజన్‌లో రూ.1.5కోట్లు, 25వ డివిజన్‌లో రూ.1కోటి ప్రతిపాదనలు పెట్టారు. ఈ సమావేశంలోనే శానిటేషన్‌ సామగ్రి, జెట్టింగ్‌ మిషన్‌ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ట్రాక్టర్ల కొనుగోలుకు అయ్యే వ్యయాన్ని ఏడాది అద్దెకు పెడుతూ ప్రతిపాదన చేశారు. జనవరి నుంచి డిసెంబరు వరకు 5ట్రాక్టర్లను అద్దెకు తీసుకునేందుకు రూ.40లక్షలు కేటాయించారు. వాస్తవానికి పట్టణ ప్రగతి, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ట్రాక్టర్ల కొనుగోలుకు వెసులుబాటు ఉంది. రూ.40లక్షలతో నాలుగు ట్రాక్టర్లు కొనుగోలు చేయవచ్చు. కానీ ఏడాది కిరాయికే రూ.40లక్షలు ప్రతిపాదనలు చేశారు.

ప్లకార్డుతో నిరసన..

ఓసీపీ5 బ్లాస్టింగ్‌లతో దుమ్ము లేచి సమీప డివిజన్ల కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ పెద్దెల్లి తేజస్వినిప్రకాష్‌ ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఓసీపీ-5 బ్లాస్టింగ్‌ను, దుమ్మును అరికట్టేలా తీర్మానం చేయాలంటూ పట్టుబట్టారు. దీనికి మేయర్‌ అంగీకారం తెలుపలేదు. కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ మహంకాళి స్వామి మాట్లాడుతూ ఓసీపీ-5తో ఇబ్బందులు పడుతున్నామని టీఆర్‌ఎస్‌ కార్పొరేటరే సింగరేణి వేడుకల వద్ద నిరసన తెలిపారని, తమ డివిజన్‌లోని సీఎస్‌పీ కాలనీ ఓసీపీ-5 దుమ్ము, సీఎస్‌పీ డస్ట్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనిపై ఒక కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ ధరణి స్వరూప మాట్లాడుతూ తన డివిజన్‌లో పనులు జరుగడం లేదని చెప్పారు. పైప్‌లైన్‌ మార్చాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పనులు జరుగక జనానికి ముఖం చూపించలేక పోతున్నామని, వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌, అధికారులనుద్దేశించి స్వరూప ఘాటు వాఖ్యలు చేశారు. తనకు సమాధానాలు వద్దని, పనులు కావాలన్నారు. సమావేశం ముగిస్తున్నట్టు మేయర్‌ ప్రకటించారు.

అనంతరం మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌ మాట్లాడారు. రామగుండం నగరపాలక సంస్థలో ముందస్తుగా అభివృద్ధి పనులకు ఆమోదం తీసుకుంటున్నామని, పట్టణ ప్రగతి నిధులు మంజూరైతేనే టెండర్లు నిర్వహిస్తామని అన్నారు. మార్చి బడ్జెట్‌ వరకు ఎన్నిక కోడ్‌ వస్తుందనే కారణంగా ఒకే సారి పనులకు ఆమోదం తీసుకుం టున్నట్టు ఆయన తెలిపారు. అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిషనర్‌ సుమన్‌రావు, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు, కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:40:44+05:30 IST

Read more