గర్భిణుల నమోదులో మండలం ముందుండాలి

ABN , First Publish Date - 2022-09-10T06:37:13+05:30 IST

కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణుల నమోదులో మొదటి స్థానంలో నిలవాలని, సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు.

గర్భిణుల నమోదులో మండలం ముందుండాలి
పీహెచ్‌సీలో రికార్డులు తనిఖీ చేస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

కోనరావుపేట, సెప్టెంబరు 9: కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణుల నమోదులో మొదటి స్థానంలో నిలవాలని, సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి, అంగన్‌వాడీ సెంటర్లు, క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య, జ్వరాలు, క్షయ, డెంగ్యూ వ్యాధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు డెంగ్యూ, మలేరియా వంటి లక్షణాలు ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. క్షయ వ్యాధిని అరికట్టేందుకు పటిష్ట కార్యాచరణలో ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60 శాతం సాధారణ కాన్పులు చేసేలా చూడాలని ఆదేశించారు. నేషనల్‌ క్వాలిటీ అష్షూరెన్స్‌ స్టాండర్డ్‌ గుర్తింపు కోసం కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ నెల 25న రాష్ట్ర బృందం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుమన్‌రావు, కోనరావుపేట వైద్యాధికారి మోహనకృష్ణ, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆంబులెన్స్‌ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా స్పందించిన కలెక్టర్‌ ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో తయారు చేసిన లడ్డూలను, పోషక పదార్థాలను ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అరుణ కలెక్టర్‌కు చూపించగా సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, ఎంపీటీసీ నర్సింహచారి, సర్పంచ్‌ రేఖ, డిప్యూటీ వైద్యాధికారి రజిత, ఎంసీహెచ్‌ ప్రోగ్రాం అధికారి మీనాక్షి, ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రాం అధికారి డా.మహేష్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-09-10T06:37:13+05:30 IST