ఆర్భాటంగా ప్రారంభం.. నిర్వహణపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-11-25T00:31:30+05:30 IST

తెలంగాణలోనే మోడల్‌ నిలుస్తుందని భావించిన సిరిసిల్ల రైతు బజార్‌ వెలవెలబోతోంది.

ఆర్భాటంగా ప్రారంభం.. నిర్వహణపై నిర్లక్ష్యం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

తెలంగాణలోనే మోడల్‌ నిలుస్తుందని భావించిన సిరిసిల్ల రైతు బజార్‌ వెలవెలబోతోంది. పూర్తిస్థాయిలో వినియోగించకపోవడంతో షెడ్ల గోడలు పగుళ్లు చూపుతున్నాయి. ఆధునిక హంగులతో జిల్లా కేంద్రంలోని మానేరు వాగు తీరంలో రైతులు, వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని రైతుబజార్‌ నిర్మించారు. 2020 జూన్‌ 23న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు రైతు బజార్‌ను ప్రారంభించారు. మొదట్లో మార్కెట్‌ కమిటీ అధీనంలో ఉండగా తరువాత సిరిసిల్ల మున్సిపల్‌కు బదలాయించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన రైతు బజార్‌ అలంకార ప్రాయంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల గాంధీ చౌక్‌ వద్ద పాత మార్కెట్‌లోనే పొద్దంతా క్రయ విక్రయాలు జరుగుతుండగా రైతు బజార్‌లో ఉదయం మూడు, నాలుగు గంటలపాటు విక్రయాలు సాగుతున్నాయి. అదికూడా కొద్దిమంది రైతులు మాత్రమే వస్తున్నారు. వచ్చినవారు కూడా షెడ్లలో ఉండలేక రైతుబజార్‌కు వస్తున్న కొద్దిమంది వినియోగదారులను తమ వద్దకు వచ్చే విధంగా రైతుబజార్‌లోని రోడ్డుపైనే కూర్చుంటున్నారు. మరోవైపు నిర్మాణాలు నిరుపయోగంగా మారడంతో పగుళ్లు చూపుతున్నాయి. పెచ్చులు మీదపడుతాయనే భయంతో రైతులు అటువైపు చూడడమే మానేశారు. రైతుబజార్‌ నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తుండగా కాంట్రాక్టర్‌ పనుల్లో నాణ్యతా లోపం బయటపడు తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

2.14 ఎకరాల్లో నిర్మాణం

జిల్లాలో రైతులు, వినియోగదారులకు మధ్య దళారుల ప్రమేయం లేకుండా, నాణ్యమైన కూరగాయలు అందుబాటు ధరలో లభిస్తాయని భావించి సిరిసిల్ల మానేరు తీరంలో 2.14 ఎకరాల్లో రూ.5.15 కోట్లతో ఆధునిక హంగులతో రైతుబజార్‌ నిర్మించారు. సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంస్థకు చెందిన స్థలం కావడంతో మంత్రి కేటీఆర్‌ వారిని ఒప్పించి మరోచోట స్థలాన్ని కేటాయించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలంలో రైతుబజార్‌ను నిర్మించారు. పార్కింగ్‌ సమస్య లేకుండా వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించారు. పూర్తిస్థాయిలో వినియోగంలోకి మాత్రం రావడం లేదు.

38 కూరగాయలు, 34 మాంసం దుకాణాలు

సిరిసిల్ల రైతుబజార్‌లో రైతులు కూర్చోవడానికి వీలుగా శిల్పారామం కట్టడాలను తలపించే విధంగా విక్రయ దుకాణాలను నిర్మించారు. 38 కూరగాయలు, 34 మాంసం విక్రయ దుకాణాలను నిర్మించారు. వీటితోపాటు పండ్లు, పూలు అమ్ముకోవడానికి ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. వినియోగదారులు రైతులకు ఉపయోగపడే విధంగా మరుగుదొడ్ల సౌకర్యం, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేశారు. అన్ని వసతులతో నిర్మించిన మార్కెట్‌లో మాత్రం ఇప్పటివరకు మాంసం, పూలు, పండ్ల విక్రయాలు కొనసాగడం లేదు. కేవలం కొందరు రైతులు మార్కెట్‌కు వచ్చి రోడ్డుపైనే కూర్చొని అమ్మకాలు సాగిస్తున్నారు. వర్షాలు పడిన సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. షెడ్లలో కూడా వర్షపు జల్లులు పడుతుండడంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరోవైపు రైతుబజార్‌ శిథిలావస్థకు చేరుకుంటుండడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2022-11-25T00:31:33+05:30 IST