వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-29T06:03:45+05:30 IST

జలవనరుల లభ్యత అధికంగా ఉందని, జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి అధిక అవకాశం ఉన్న దృష్ట్యా ఆ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ విరివిగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జలవనరుల లభ్యత అధికంగా ఉందని,  జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి అధిక అవకాశం ఉన్న దృష్ట్యా ఆ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ  విరివిగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం  కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. 2022 -23 వార్షిక లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై  కలెక్టర్‌ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళిక కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2692 కోట్ల రుణాల మంజూరు లక్ష్యం కాగా ఇప్పటివరకు వివిధ కేటగిరీల కింద రూ.486 కోట్ల రుణాలు మంజూరు చేశారని, 18 శాతంగా ఉందని అన్నారు. షార్ట్‌ టర్మ్‌ పంంట రుణాల లక్ష్యం రూ.778 కోట్లకు కేవలం రూ.104 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వ్యవసాయ టర్మ్‌ లోన్‌ లక్ష్యం రూ.647 కోట్లు ఉండగా రూ.83 కోట్లు మాత్రమే అందించారన్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరునెలలు గడుస్తున్నా  ఆశించిన మేరకు రుణ మంజూరు లేదన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలోని  రైతులకు అధిక రుణాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాలో అమలు చేయాలన్నారు. ఎంఎస్‌ఎంఈ రుణాల మంజూరులోనూ కేవలం 11 శాతం మాత్రమే పురోగతి ఉందన్నారు. ఈ రంగంలో మరింత పురోగతి సాధ్యమైనంత త్వరగా సాధించాలన్నారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు రుణ మంజూరులో 43.6 శాతం లక్ష్య సాధన, పట్టణాల్లో 44 శాతం లక్ష్యసాధనపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకంలో అమలుపై బ్యాంకులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక రైతులు, యువతకు రుణ మంజూరు కన్సెంట్లను ఇవ్వాలన్నారు. పాడి గేదెల యూనిట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న రైతులకు రుణాలను మంజూరు చేయాలన్నారు. మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల ప్రజలకు వివిధ కేటగిరీలో యూనిట్‌ల స్థాపనకు ముందుకొస్తే రుణ మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.   సిరిసిల్ల చిన్న జిల్లా, అభివృద్ధికి అన్ని విధాలుగా వనరులు ఉన్నందున ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులతోపాటు బ్యాంకర్లు పాటుపడాలన్నారు. రుణాల మంజూరుతోపాటు రుణ రికవరీలపై కూడా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు రిసోర్సు పర్సన్‌ల సహాయంతో రుణగ్రిహీతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, రుణ చెల్లింపుల ప్రాధాన్యాన్ని వివరించి రికవరీల శాతం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు.  ఎల్‌డీఎం టీఎన్‌ మల్లికార్జున్‌ రావు ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణప్రణాళిక లక్ష్యాలు, సాధింపులు, ప్రగతి నివేదికను అందించారు.  సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బి.సత ప్రసాద్‌, డీఆర్‌డీవో గౌతమ్‌ రెడ్డి, యూబీఐ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ వంశీకృష్ణ, ఆర్‌బీఐ ఎల్‌డీవో ఎంఎస్‌ సాయి చరణ్‌, నాబార్డు డీడీఎం మనోహర రెడ్డి, బ్యాంకర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read more