సజీవంగా గుంటిమడుగు ప్రాజెక్టు

ABN , First Publish Date - 2022-06-08T05:03:11+05:30 IST

మానేరు నదిపై నలభై సంవత్సరాల నుంచి నిర్మించాలని భావిస్తున్న గుంటిమడుగు ప్రాజెక్టు ప్రతిపాదనలు సజీవంగానే ఉన్నాయి.

సజీవంగా గుంటిమడుగు ప్రాజెక్టు
గుంటిమడుగు వద్ద పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఇంజనీరింగ్‌ అధికారులు(ఫైల్‌)

- మళ్లీ సర్వేచేసిన నీటి పారుదల శాఖాధికారులు

- కిష్టంపేట చెక్‌డ్యామ్‌ పనుల నిలిపివేత

- ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మానేరు నదిపై నలభై సంవత్సరాల నుంచి నిర్మించాలని భావిస్తున్న గుంటిమడుగు ప్రాజెక్టు ప్రతిపాదనలు సజీవంగానే ఉన్నాయి. ఐదేళ్ల క్రితం ఇక్కడ సర్వేచేసిన అధికారులు ఒక్క ఎకరం ముంపు లేకుండా గుంటి మడుగు వద్ద బ్యారేజీ నిర్మించేం దుకు అవకాశాలున్నాయని ప్రభుత్వానికి ప్రతిపాదన లు పంపించారు. అయితే ఆ ప్రతిపాదనలు కార్య రూపం దాల్చకపోగా, పదిహేను రోజుల క్రితం నీటి పారుదల శాఖాధికారులు మరొకసారి సర్వే నిర్వ హించడంతో గుంటి మడుగు ప్రాజెక్టు నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. మానేరు వాగుపై కాల్వ శ్రీరాంపూర్‌ మండలం పెద్దరాతుపల్లి శివారులోగల గుంటి మడుగు, సుంకరి కోటల మధ్య నీటి ప్రవా హం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మానేరు వాగు 800 నుంచి 1200 మీటర్ల వెడల్పు వరకు ఉం టుంది. గుంటిమడుగు వద్దకు వచ్చేసరికి ఇరువైపు లా రెండు గుట్టలు విస్తరించి ఉండడంతో అక్కడ 400 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. రెండు గుట్టల మధ్య నుంచి మానేరు వాగు పారుతుం డడంతో ఇక్కడ చిన్నబ్యారేజీ నిర్మిస్తే పరిసర గ్రామాల్లోని భూములకు సాగు నీరందనున్నదని భావించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే సుమారు 150టీఎంసీల నీళ్లు వృథాగా గోదావరిలో కలుస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో నలభై సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే జిన్నా మల్లారెడ్డి తొలుత గుంటి మడుగు వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదిం చారు. ఆ తర్వాత గీట్ల ముకుంద రెడ్డి కూడా ఒక సారి సర్వే చేయించారు. కానీ ముందుకు సాగ లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గుంటి మడుగు ప్రాజెక్టు ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. 

యాభై వేల ఎకరాలకు నీరు..

జిల్లాకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు డి-83, డి-86 కాలువల ద్వారా సుమారు 1,72,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ కాలువల ద్వారా వచ్చే నీళ్లు ఆయకట్టు చివరి ప్రాంతంలోగల కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, ముత్తారం, మంథని మండలాల్లోని భూముల కు సాగు నీరందడం లేదు. 2016లో ఐడీసీ పదవి పొందిన కాల్వశ్రీరాంపూర్‌ మండలానికి చెందిన ఈద శంకర్‌రెడ్డి అందరు మరిచిపోయిన గుంటి మడుగు ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తీసుక వచ్చారు. గుంటిమడుగు వద్ద చిన్నపాటి బ్యారేజీ నిర్మిస్తే పలు గ్రామాల్లోని సుమారు 50 వేల ఎకరాల భూములకు సాగు నీరందుతాయని శంకర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు దృష్టికి తీసుకవెళ్లడంతో వాళ్లు సర్వేకు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించిన వ్యాప్కోస్‌ సంస్థకు సర్వే చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం ఆ సంస్థకు ఐడీసీ నుంచి సుమారు 90 లక్షల రూపాయల వరకు చెల్లించారు. 2017 మార్చి 9వ తేదీన అప్పటి కలెక్టర్‌ డాక్టర్‌ అళగు వర్షిణి, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ నల్ల వెంకటేశ్వర్లు, మరో సీఈ అనిల్‌ కుమార్‌, ఈద శంకర్‌రెడ్డి, వ్యాప్కోస్‌ సంస్థ ఇంజినీర్లు గుంటి మడుగు వద్దకు వెళ్లి మానేరు వాగుపై బ్యారేజీ నిర్మాణానికి సర్వే నిర్వహించారు. 400 మీటర్ల వెడల్పులు మానేరుకు ఇరువైపులా రిటైనింగ్‌ గోడలు నిర్మించి ఒక్క ఎకరం భూమి కూడా ముంపునకు గురికాకుండా 5 టీఎంసీ ల నీటి సామర్థ్యంతో బ్యారేజీని నిర్మించవచ్చని, మానేరులో 8కిలోమీటర్ల పొడవునా, హుస్సేనిమియా వాగులో 9 కిలోమీటర్ల పొడవునా నీటి నిల్వ ఉం టుందని అంచనా వేశారు. వ్యాప్కోస్‌ సంస్థ ప్రభు త్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. 20ఎకరాల భూములకు గ్రావిటీ కాలువల ద్వారా, 30 వేల ఎకరాల భూములకు ఎత్తిపోతల ద్వారా సాగు నీటిని సరఫరా చేయవచ్చని ప్రతిపాదించారు. 

మరోసారి సర్వేకు ఆదేశం..

కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, ముత్తారం, మంథని మండలాలతో పాటు కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పలు గ్రామాల రైతులకు సాగు నీటిని అందించవచ్చని నివేదికలో పేర్కొన్నారు. సుమారు 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనావేశారు. అప్పటికే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీరియస్‌గా దృష్టి సారించడంతో గుంటి మడుగు ప్రతిపాదన అటకెక్కింది. ఆ తర్వాత మానేరు నదిపై ప్రభుత్వం 22 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రతిపాదనలు తీసుకుని మంజూరు చేసింది. అందులో భాగంగా గుంటిమడుగు సమీపంలో కిష్టంపేట వద్ద 22 కోట్లు, మొట్లపల్లి వద్ద 16 కోట్లతో చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. మరోసారి గుంటిమడుగు చేపట్టాలని రైతుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఐడీసీ మాజీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి చేసిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం మరోసారి సర్వేకు అధికారులను ఆదేశించింది. దీంతో కిష్టంపేట, మొట్లపల్లి చెక్‌ డ్యామ్‌ పనులను నిలిపివేశారు. ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖాధికారులు సర్వేచేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో ప్రతిపాదనలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. 

Updated Date - 2022-06-08T05:03:11+05:30 IST