అనీమియా ముక్త్‌ జిల్లాగా చేద్దాం

ABN , First Publish Date - 2022-09-25T06:18:08+05:30 IST

కరీంనగర్‌ను అనీమియా ముక్త్‌ జిల్లాగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అన్నారు.

అనీమియా ముక్త్‌ జిల్లాగా చేద్దాం
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ

- జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 24: కరీంనగర్‌ను అనీమియా ముక్త్‌ జిల్లాగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అన్నారు. శనివారం నగరంలోని టీఎన్‌జీవోస్‌ ఫంక్షన్‌హాల్‌లో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  పిల్లలకు పోషకాహారం పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ మాట్లాడుతూ మహిళల్లో రక్తహీనత నుంచి విముక్తి లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పని చేస్తుందన్నారు. జిల్లాలో అంగన్‌వాడీలు, ఆశాల కార్యకర్తల సహకారంతో మహిళలందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ రక్తహీనత వల్ల మహిళల్లో అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని అన్నారు. కరీంనగర్‌ జిల్లా రక్తహీనత నిర్మూలన(అనీమియా మక్త్‌) జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో మహిళలందరికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోషణలోపం ఉన్న చిన్నారులకు అంగన్‌వాడీలో ఇచ్చే ఆహారమే కాకుండా ఉట్నూరు ఐటీడీఏ నుంచి మిల్లెట్‌ ఫుడ్‌ను తెప్పించి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇస్తామన్నారు. అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ మాట్లాడుతూ పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారి బరువును పెంచే దిశగా ప్రతి మంగళవారం 10 నిమిషాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార మేళాను జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, సీడబ్ల్యూసీ చైర్మన్‌ ధనలక్ష్మి, కార్పొరేటర్‌ జితేందర్‌ పాల్గొన్నారు. 

Read more