పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌

ABN , First Publish Date - 2022-06-07T06:12:38+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మానేరు రివర్‌ ఫ్రంట్‌, కేబుల్‌ బ్రిడ్జితో గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌
మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులను పరిశీలిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

-రూ.410 కోట్ల మానేరు రివర్‌ ఫ్రంట్‌

-మంత్రి గంగుల కమలాకర్‌  

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 6: రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మానేరు రివర్‌ ఫ్రంట్‌, కేబుల్‌ బ్రిడ్జితో గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి కేబుల్‌ బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. దిగువ మానేరు జలాశయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. 410 కోట్ల రూపాయలతో నీటిపారుదల, పర్యాటకశాఖల సమన్వయంతో పనులు చురుకుగా కొనసాగుతున్నాయని తెలిపారు. మొదటి దశలో ఎల్‌ఎండీ గేట్ల నుంచి 3.7 కిలోమీటర్ల మేరకు 200 మీటర్ల వెడల్పుతో దిగువకు ఉన్న నీటి ప్రవాహానికి ఇరువైపులా 16 అడుగుల ఎత్తు వరకు ప్రహారీలను నిర్మిస్తామన్నారు. భారీ ప్రహారీతో సుమారు 300 మీటర్ల మేర ఎత్తు నీళ్లు నిలుస్తాయన్నారు. ఇందుకోసం అడుగు భాగాన్ని మూడు మీటర్ల లోతుకు చదును చేస్తామన్నారు. నీటి మట్టం నుంచి రెండు దిక్కుల 4.8 మీటర్ల ఎత్తులో పాదచారులు నడిచేందుకు ట్రాక్‌, పర్యాటకులు కూర్చుని వీక్షించేందుకు బెంచీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎల్‌ఎండీ నుంచి కేబుల్‌ బ్రిడ్జి వరకు రిటైనింగ్‌ వాల్‌, థీమ్‌ పార్కులు, లైటింగ్‌, కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణం, బోటింగ్‌, ప్లోటింగ్‌ రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అల్గునూర్‌ బ్రిడ్జికి, కేబుల్‌ బ్రిడ్జికి ఇరువైపులా నీరు నిల్వ ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.  మొదటి దశలో ఈ నిర్మాణాల తర్వాత ఇరువైపులా హోటళ్ల నిర్మాణాలు, బృందావన్‌ గార్డెన్‌ ఏర్పాటుతోపాటు వాటర్‌ ఫౌంటెయిన్లు, ఇతరత్రా నిర్మాణాల్ని పర్యాటకులు వీక్షించేలా చేపట్టబోతున్నామని తెలిపారు. రాష్ట్రప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ మానేరు రివర్‌ ఫ్రంట్‌తో కరీంనగర్‌ ముఖచిత్రం మారనుందని, చక్కటి పర్యాటక కేంద్రంగా నగరం మారుతుందని వెల్లడించారు. కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌లో అధికనిధులు కేటాయించడం వల్ల మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పురుడు పోసుకుందని తెలిపారు. నగరానికి ఆనుకొని ఉన్న వాటర్‌ బాడీని ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు రూపుదిద్దుకుందని, ఇందులో భాగంగా ఎల్‌ఎండీ గేట్ల నుంచి చేగుర్తి వరకు చెక్‌డ్యాంలు నిర్మించామని తెలిపారు. కేబుల్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం తుదిదశకు చేరుకున్నాయని, త్వరలో డైనమిక్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేసి ఆగస్టు 15 వరకు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, మేయర్‌ వై సునీల్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, వీర్ల వెంకటేశ్వర్‌రావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-07T06:12:38+05:30 IST