గుర్తింపు సంఘంగా ఐఎన్‌టీయూసీ విఫలం

ABN , First Publish Date - 2022-09-14T05:11:25+05:30 IST

ఎన్టీపీసీలో గుర్తింపు సంఘంగా ఐఎన్‌టీయూసీ విఫలమైందని , వ్యక్తిగత ప్రయోజనాలు, ఎన్టీపీసీలో కాంట్రాక్టు పనులు దక్కించుకోవడమే లక్ష్యంగా ఐఎన్‌టీయూసీ నేత పని చేశాడని హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, డెమోక్రటిక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షడు సీహెచ్‌ ఉపేందర్‌ ఆరోపించారు.

గుర్తింపు సంఘంగా ఐఎన్‌టీయూసీ విఫలం
హెచ్‌ఎంఎస్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్న నాయకులు

- హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌. ఉపేందర్‌

జ్యోతినగర్‌, సెప్టెంబరు 13: ఎన్టీపీసీలో గుర్తింపు సంఘంగా ఐఎన్‌టీయూసీ విఫలమైందని , వ్యక్తిగత ప్రయోజనాలు, ఎన్టీపీసీలో కాంట్రాక్టు పనులు దక్కించుకోవడమే లక్ష్యంగా ఐఎన్‌టీయూసీ నేత పని చేశాడని హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, డెమోక్రటిక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షడు సీహెచ్‌ ఉపేందర్‌ ఆరోపించారు. ఎన్టీపీసీలో మంగళవారం జరిగిన విలేకరుల సవవేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రాజెక్టులో ఇసుక, మట్టి సప్లై కాంట్రాక్టు, రైల్వే లైన్‌, యాష్‌పాండ్‌ బూడిద కాంట్రాక్టును ఐఎన్‌టీయూసీ  ప్రధాన నేత దక్కించుకున్నాడని ఆరోపించారు. గుర్తింపు ఎన్నికల్లో మళ్లీ గెలవాలనే ఉద్దేశంతో  కార్మికులను కులాలుగా, మతాలుగా విడగొట్టే ప్రయత్నం ఐఎన్‌టీయూసీ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు.  కమీషన్లు తీసుకొని పదోన్నతులు, క్వార్టర్ల కేటాయింపులు చేస్తున్నారన్నారు. మూడు సంవత్సరాలుగా గుర్తింపు కార్మిక సంఘంగా ఐఎన్‌టీయూసీ పూర్తిగా విఫలమైందన్నారు. ఒకవైపు ప్రాజెక్టులో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండగా, కొత్తగా నియామకాలను చేపట్టకపోయినప్పటికీ ఐఎన్‌టీయూసీ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం శోఛనీయమన్నారు. ఇటీవల ఎన్టీపీసీ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ను సవరించే విషయంలో ఐఎన్‌టీయూసీ ఏకపక్షంగా యాజమాన్యానికి తలొగ్గి ఆ సంఘం నాయకులు సంతకాలు చేశారన్నారు. కొత్త స్టాండింగ్‌ ఆర్డర్ల ప్రకారం కొత్తగా చేపట్టే నియామకాల్లో శాశ్వత నియామకాలుండవని, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో టెన్యూర్‌ నియామకాలు మాత్రమే ఉంటాయన్నారు. ఉద్యోగుల ఆర్థిక అంశాలను లోకాయుక్త పరిధిలోకి తీసుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఉద్యోగి ప్రతీ ఏటా తమ ఆస్థుల వివరాలను యాజమాన్యానికి సమర్పించాల్సి ఉంటుందని, కారు, ఇళ్లు, మరేదైనా ఆస్థి, వస్తువు కొనుగోలు చేస్తే యాజమాన్యం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో తాము గుర్తింపు యూనియన్‌గా పని చేసిన క్రమంలో కార్మికుల హక్కుల పరిరక్షణ, మెరుగైన వేతన సవరణ చేయించామన్నారు. ఈనెల 19న జరిగే గుర్తింపు ఎన్నికల్లో విజ్ఞులైన ఉద్యోగులు డెమోక్రటిక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ను గెలిపించాలని ఉపేందర్‌ కోరారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంస్‌ ఎన్నికల పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. సమావేశంలో హెచ్‌ఎంఎస్‌ నాయకులు అనంతరెడ్డి, పురుషోత్తం రాజు, ఎం.గట్టయ్య, సుధాకర్‌, జే.మనోహర్‌రావు, మేకల రామస్వామి పాల్గొన్నారు.  


Read more