బంగారు బతుకమ్మ ఉయ్యాలో..

ABN , First Publish Date - 2022-09-26T06:20:43+05:30 IST

బతుకమ్మ సంబురాలు రేండేండ్ల తర్వాత మరోసారి శోభను సంతరించుకున్నాయి. కొవిడ్‌ మహమ్మారితో సాదాసీదాగా జరుపుకున్న బతుకమ్మ వేడుకలను మహిళలు ఈసారి ఉత్సా హంగా బతుకమ్మ వేడుకలను ప్రారంభించుకున్నారు.

బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఆవరణలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

 (ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల )

బతుకమ్మ సంబురాలు రేండేండ్ల తర్వాత మరోసారి శోభను సంతరించుకున్నాయి. కొవిడ్‌ మహమ్మారితో సాదాసీదాగా జరుపుకున్న బతుకమ్మ వేడుకలను మహిళలు ఈసారి  ఉత్సా హంగా బతుకమ్మ వేడుకలను ప్రారంభించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల తోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో  వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో తెలంగాణలోనే ప్రత్యే కంగా నిలిచిన బతుకమ్మ ఘాట్‌ వద్ద పురపాలకర సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మహిళలను అకట్టు కున్నాయి. తల్లీకూతుళ్ల ప్రతిమతో ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్పలో బతుకమ్మలను వేశారు. సిరిసిల్లలోని బీవైనగర్‌, గణేష్‌నగర్‌, తారకరామానగర్‌, వెంకంపేట, సర్దార్‌నగర్‌, అశోక్‌ నగర్‌, పద్మనగర్‌, సంజీవయ్యనగర్‌, శాంతినగర్‌, అటోనగర్‌, సిద్ధార్థనగర్‌, రెడ్డివాడ, అంభేద్కర్‌నగర్‌, విద్యానగర్‌, సాయినగర్‌, గీతానగర్‌, శివనగర్‌, సుభాష్‌నగర్‌, నెహ్రూనగర్‌, గాంధీనగర్‌, గోపాల్‌నగర్‌, పెద్దబజార్‌, తదితర ప్రాంతాల్లో మహిళలు సామూహికంగా బతుకమ్మ ఆటాపాటలతో సంబురంగా గడిపారు. వివిధ సంఘాలు, ప్రజాప్రతినిదులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

వేములవాడ : ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మ పండుగ సంబరాలు వేములవాడలో ఆదివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ ఉత్సవాల తొలిరోజు తంగేడుపూలు, గునుకపూలు, బొడ్డెమ్మలతో అందమైన బతుకమ్మను పేర్చిన మహిళలు సాయంత్రం వేళలో ఇంటి ముంగిళ్లలో బతుకమ్మ ఆడారు. అనంతరం వీధి కూడలిలో, రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో బతుకమ్మ ఆడారు. అనంతరం  ఆలయ ధర్మగుండంలో, మూలవాగులోని నీటి ప్రవాహంలో బతుకమ్మలను నిమజ్జ నం చేశారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం మహిళలు, బాలికలు ఆలయ ఆవరణలో కోలాటం, దాండియా ఆడారు.  

Updated Date - 2022-09-26T06:20:43+05:30 IST