యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2022-11-28T01:43:16+05:30 IST

సిరిసిల్ల మానేరు నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక తీసుకునే వీలున్నా అక్రమ దారులు నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు.

 యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
ఎల్లారెడ్డిపేటలో పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లు (ఫైల్‌)

- జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఘాట్‌, గంగమ్మ గుడికి ముప్పు

- పట్టించుకోని అధికారులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సిరిసిల్ల మానేరు నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక తీసుకునే వీలున్నా అక్రమ దారులు నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు నోరు మెదపక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ పలుకుబడి, కాసుల మాటున అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అవసరాలకు సాయినగర్‌ ప్రాంతంలోని మానేరు వాగులో రెవెన్యూ ఆధ్వర్యంలో ఇసుక తీసుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. దీంతోపాటు వే బిల్లులు కూడా జారీ చేస్తున్నారు. కానీ కొందరు అక్రమదారులు రాత్రులు, తెల్లవారుజామున ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక తరలింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో సిరిసిల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల మానేరు తీరంలో గంగమ్మ గుడితోపాటు బతుకమ్మ ఘాట్‌ వద్ద పూర్తిగా ఇసుక తీయకుండా నిషేధాజ్ఞలు ఉన్నాయి. కొందరు బతుకమ్మ ఘాట్‌ వద్ద ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. బతుకమ్మ ఘాట్‌, రైతుబజార్‌ ముందు నుంచే దర్జాగా ఇసుకను తరలిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మరోవైపు బతుకమ్మ ఘాట్‌ వద్ద ఇసుకను తొలగించడంతో గంగమ్మ గుడి వరకు వేసిన విద్యుత్‌ స్తంభాలు పడిపోయే పరిస్థితి నెలకొంది. బతుకమ్మ ఘాట్‌ చుట్టూ ఇసుక తీయడంతో టైల్స్‌ కుంగిపోతున్నాయి. నిత్యం వందల సంఖ్యలో వాకింగ్‌ కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి తోడుగా పోలీస్‌ శిక్షణ కోసం యువతీ, యువకులు రన్నింగ్‌ ప్రాక్టీస్‌కు వస్తున్నారు. గుంతలు ఏర్పడడంతో పరుగెత్తడానికి ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ట్రాక్టర్‌ ద్వారా ఇసుకను తరలిస్తున్న వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా, ఫిర్యాదు చేసినా రాజకీయ పలుకు బడిని ఉపయోగిస్తుండడంతో భయపడుతున్నారు.

మానేరు పొడవునా అక్రమ‘దారులు’

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఎగువ మానేరు ప్రాజెక్ట్‌ నుంచి దిగువ మానేరు వరకు మానేరు వాగులో ఇసుక తరలించడానికి అక్రమ దారులను ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఊరి శివార్లలో కుప్పలుగా పోసి లారీల ద్వారా తరలిస్తున్నారు. మరికొందరు సిద్దిపేట, కామారెడ్డి వరకు ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి లారీలకు అందిస్తున్నారు. సిరిసిల్ల మానేరు తీరంలోని సిరిసిల్లలోని పెద్దూర్‌, సర్ధాపూర్‌, తంగళ్లపల్లి మండలం పరిధిలో కట్కూరు, మండెపల్లి రాళ్లపేట, గండిలచ్చపేట ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర, వెంకటాపూర్‌ శివారులోని మానేరు వాగుతోపాటు చిట్టివాగు నుంచి ఇసుకను కామారెడ్డికి తరలిస్తున్నారు. బోయినపల్లి మండలం మాన్వాడ మల్లాపూర్‌, గంభీరావుపేట మండలంలో మల్లుపల్లె, మల్లారెడ్డిపేట గ్రామాల మీదుగా ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌, కొండాపూర్‌, ఇల్లంతకుంట మండలం పొత్తూర్‌తోపాటు జవారిపేట బిక్కవాగు నుంచి కూడా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతోపాటు వేములవాడ మూలవాగు నుంచి పలు గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా మళ్లీ యఽథావిధిగా దందా సాగిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలించే వాహనాలకు మైనర్లను డ్రైవర్లుగా పెట్టుకుంటున్నారు. వాహనాలకు నంబర్లు కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఉన్నత అధికారులు స్వయంగా రంగంలోకి దిగి ఇసుక వాహనాలను పట్టుకొని జరిమానాలు వేశారు. ఎక్కువ శాతం అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడమనేది అనేక అనుమానాలకు తావిస్తోందని, రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా వాహనాలతో పులువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.

ఇసుక అక్రమ రవాణాపై చర్యలు

- విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ సిరిసిల్ల

సిరిసిల్ల జిల్లా కేంద్రం అవసరాలకు సాయినగర్‌ ప్రాంతంలోని మానేరు వాగులో ఇసుకను కేటాయించాం. వే బిల్లులు పొంది ఇసుకను నిర్ణయించిన సమయంలో పొందాలి. బతుకమ్మ ఘాట్‌, గంగమ్మ గుడి ఇతర ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం.

Updated Date - 2022-11-28T01:43:17+05:30 IST