ఎట్లా బతికేది?

ABN , First Publish Date - 2022-07-19T05:29:31+05:30 IST

భారీ వర్షాలు ముంపు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి...

ఎట్లా బతికేది?

  - దయనీయస్థితిలో ‘నారాయణపూర్‌’ ముంపు గ్రామాలు

- వరద నీటితో తడిసిన ఇళ్లు

- ఎటు చూసినా బురదే

- ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకోలు

ఆ మహిళ పేరు సిరిగిరి లీలావతి.. గంగాధర మండలం ఇస్తారుపల్లి గ్రామం. ఈ నెల 13న అధికారులు గ్రామానికి వచ్చి వరద వచ్చే అవకాశం ఉందని, వెంటనే గ్రామాన్ని ఖాళీ చేయాలని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులను తీసుకుని కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు  వెళ్లింది. వాళ్లు అలా పునరావాస కేంద్రానికి చేరుకున్నారో లేదో నారాయణపూర్‌ నుంచి వచ్చిన వరద ఆమె ఇంటిని ముంచెత్తింది. వరద తగ్గుముఖం పట్టడంతో రెండు రోజులకు ఇంటికి చేరుకుంది. ఇల్లును చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. ఎటు చూసినా బురదే.. వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. తినడానికి ఉంచుకున్న బియ్యం, పప్పు, ఇతర నిత్యావసరాలు నీళ్లలో నాని మురిగి పోయాయి. మట్టి ఇల్లు కావడంతో ఓ పక్క గోడ కూలిపోయింది. నారాయణపూర్‌ రిజర్వాయర్‌ కట్టినప్పటి నుంచి తమది ఇదే పరిస్థితి అని ఆమె తెలిపింది. వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని, తమ గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని కోరుతోంది.

మరో మహిళ పేరు కల్లెం రాజేశ్వరి. ఇస్తారుపల్లికి చెందిన ఈమె ఇల్లు నారాయణపూర్‌ వరద నీటిలో మునిగిపోయింది. మట్టి ఇల్లు కావడంతో ఇప్పుడో, అప్పుడో కూలిపోయే స్థితికి చేరుకుంది. గంగాధర పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వచ్చి చూసే సరికి ఎక్కడ చూసినా బురదే కనిపించింది.  తడిసిన ఇంట్లో ఉంటే కూలి ప్రాణాలు పోతాయని భయపడి ఇంటి ఎదుట డేరా వేసుకుని అందులో ఉంటున్నారు. ప్రభుత్వం తమకు పరిహారం అందించి తమను ఆదోకోవాలని ఆమె కోరుతోంది.

జూన్‌ 13 సాయంత్రం.. ఒకవైపు భారీ వర్షం కురుస్తోంది.. గంగాధర మండలంలోని నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. క్షణక్షణానికి నీటిమట్టం పెరుగుతోంది.  రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంతలో అధికారులు వచ్చి వారిని గంగాధరలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. రిజర్వాయర్‌ ప్రమాదకర స్థితికి చేరుకోవడంతో కట్టకు ఒకచోట గండి పెట్టారు. ఒక్కసారిగా వరద నీరు రావడంతో ఎల్లమ్మ చెరుకు కట్ట తెగిపోయింది. ఇస్తారుపల్లిలోని పలు ఇళ్లు నీట మునిగాయి. వరద తగ్గిన తర్వాత గ్రామానికి వచ్చిన ప్రజలు తమ ఇళ్లను చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నిత్యావసరాలు నీటి పాలయ్యాయని, ఎక్కడ చూసినా బురదే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా సమస్యలతో సహవాసం చేస్తూ ఎట్లా బతికేది అని వారు ప్రశ్నిస్తున్నారు.

- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌

భారీ వర్షాలు ముంపు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి... ఆదుకోండి మహాప్రభో అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకున్నా వారి మొర ఆలకించే వారు లేక పోవడంతో ముంపు గ్రామాల ప్రజలు గ్రామాలు వదిలి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మూల్లెమూట సర్దుకొని పక్క ఊర్లకు తరలివెళ్తున్నారు... గంగాధర మండలంలోని నారాయణపూర్‌ రిజర్వాయర్‌ ముంపు గ్రామాలైన నారాయణపూర్‌, మంగపేట, చర్లపల్లె బాధితుల కన్నీటిగాథ ఇది. గంగాధర మండలంలోని నారాయణపూర్‌ చెరువు, మంగపేట ఎల్లమ్మ చెరువులను కలిపి 2005లో నారాయణపూర్‌ రిజర్వాయర్‌గా మార్చారు.  ఇప్పటికీ రిజర్వాయర్‌ కట్ట ఎత్తును పెంచలేదు. దీంతో భారీ వర్షం కురిస్తే రిజర్వాయర్‌గా మార్చిన ఈ రెండు చెరువుల్లోకి ఎగవ నుంచి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతోంది. రిజర్వాయర్‌ పరిధిలోని నారాయణపూర్‌, మంగపేట, చర్లపల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. తమ గ్రామాలను ముంపు ప్రాంతాలుగా ప్రకటించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ద్వారా పరిహారం ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు. వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటీవల వారంరోజులపాటు ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు నారాయణపూర్‌ రిజర్వాయర్‌లోకి భారీ వరద నీరు చేరడంతో ప్రమాదకరస్థాయికి చేరింది. సామర్థ్యానికి మించి నీటివరద పోటెత్తి కట్టపై నుంచి దూకడంతో ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు కట్ట చివర గండిపెట్టారు. రిజర్వాయర్‌ కట్ట పూర్తిగా తెగితే నారాయణపూర్‌, ఇస్తారుపల్లి గ్రామాలు తుడిచి పెట్టుకుపోతాయని హెచ్చరించడంతో ఆయా కుటుంబాల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమై ఆయా కుటుంబాల వారిని సురక్షిప్రాంతమైన గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వర్షాలు, వరద తగ్గడంతో తిరిగి గ్రామాలకు చేరుకున్న ముంపు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ ఇళ్లు పూర్తిగా తడిసిపోయాయని, ప్రమాదకరంగా మారిన ఈ ఇళ్లలో ఎలా బతుకుతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- ఊళ్లు తరలుతున్నాయి..

 ఇన్నాళ్లు సమస్యలతో సహవాసం చేస్తూ న్యాయం జరుగుతుందని ఎదురు చూశామని, ఇక తమకు న్యాయం చేసే వారు కనిపించడం లేదని ఉన్న ఊరును వదిలి పొరుగు గ్రామాలకు తరలివెళ్తున్నారు. నారాయణపూర్‌లో 406 కుటుంబాలు ఉంటే ఇప్పటికే 18 కుటుంబాల వారు గంగాధరకు చేరుకొని అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌లోని బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురవుతున్న మంగపేట గ్రామానికి చెందిన 113 ముంపు బాధిత కుటుంబాల వారు గంగాధరతోపాటు ఇతర గ్రామాలకు వెళ్లారు. మంగపేట గ్రామంలో 256 కుటుంబాలు ఉండగా వాటిలో 113 కుటుంబాలు ఇప్పటికే ఊరు వదిలి వెళ్లిపోయాయి. మిగిలిన మరికొందరు గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు గ్రామం పక్కనే ఉన్న గుట్టపై నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి తాము చదును చేసుకున్న ఈ గుట్టను తమకు అప్పగించాలని వారు కోరుతున్నారు. చర్లపల్లి (ఎన్‌) గ్రామంలో ముంపునకు గురవుతున్న ఐదుకుటుంబాల వారు ఐదేళ్ళ క్రితమే ఊరు వదిలి వెళ్లిపోయారు. మరికొంత మంది వరద సమస్యలను తట్టుకోలేక గ్రామాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కన్నతల్లిలాంటి ఉన్న ఊరును వదిలి వేరో చోట నివాసమేర్పరచుకోలేని స్థితిలో ఉన్న మరికొంత మంది ముంపు బాధితులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. 

Updated Date - 2022-07-19T05:29:31+05:30 IST