తెల్లకార్డులపై ఆశలు

ABN , First Publish Date - 2022-07-18T06:31:59+05:30 IST

ప్రభుత్వం గతంలో రద్దు చేసిన తెలుపు రేషన్‌కార్డుల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తుండడంతో సంబందిత లబ్ధిదారుల్లో ఆశలు పెరుగుతున్నాయి.

తెల్లకార్డులపై ఆశలు

- క్షేత్ర స్థాయిలో పరిశీలన 

- జిల్లాలో 23,856 కుటుంబాలకు అవకాశం

- ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

జగిత్యాల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం గతంలో రద్దు చేసిన తెలుపు రేషన్‌కార్డుల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తుండడంతో సంబందిత లబ్ధిదారుల్లో ఆశలు పెరుగుతున్నాయి. తెలుపు రేషన్‌ కార్డుల ను తిరిగి పునరుద్ధరించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రెవెన్యూ అధికారులు పరిశీ లించారు. సుమారు 2016 సంవత్సరంలో వివిధ కారాణాల వల్ల పలు తెలుపు రేషన్‌కార్డులను అధికారులు రద్దు చేశారు. గతంలో రద్దయిన వాటిని ప్రామాణికంగా పరిశీలన జరపాలని ప్రభుత్వం సూచించింది.  గతంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనర్హులను పెద్ద సంఖ్యలో తొలగించింది. సదరు జాబితాలో జిల్లాకు చెందిన కార్డులు వేల సంఖ్యలో ఉన్నాయి. సంబందిత కార్డులను పున రుద్ధరించడానికి ప్రస్తుతం కసరత్తు జరుగుతుండడంతో లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వం ఆహార భద్రతా పథకం కింద నిరుపేద కుటుంబాలకు రేషన్‌ బియ్యం అందిస్తోంది. 2016 సంవత్సరంలో వివిధ కారణాలతో కార్డులు, కొన్ని కార్డులల్లో సభ్యుల పేర్లను అధికారులు తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అర్హులకు పునరుద్ధరణ చేయ డానికి పౌరసరాఫరా శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకుం టున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో మండలాల వారీగా వివరాలను పొందుపరిచారు. వాటిని ఆయా మండలాల తహసీల్దార్లు డౌన్‌లోడ్‌ చేసుకొని సర్వే చేయించడంపై దృష్టి సారించారు. 

పౌరసరాఫరాల శాఖలో పరిస్థితి ఇలా....

జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 587 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతి నెల పేదలకు ఉచిత బియ్యం, రేషన్‌ బియ్యం పంపిణీ జరుగుతోంది. జిల్లాలో మొత్తం 3,10,545 రేషన్‌ కార్డులుండగా ఇందులో 2,95,916 ఆహార భద్రతా కార్డులు, 14,483 అంత్యోదయ కార్డులు, 146 అన్నపూర్ణ కార్డులున్నాయి. ప్రతీనెల సుమారు 9,369 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని సుమారు 9,04,521 మందికి పౌరసరాఫరా శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు.


జిల్లాలో రద్దయిన కార్డులు


గతంలో ప్రభుత్వం రద్దు చేసిన రేషన్‌ కార్డుల జాబితాలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 23,856 ఉన్నాయి. ఇందులో మెట్‌పల్లిలో 2,969, మల్యాలలో 2,095, ధర్మపురిలో 1,915, వెల్గటూరులో 1,745, గొల్లపల్లిలో 1,698, కోరుట్లలో 1,484, మేడిపల్లిలో 1,442, జగిత్యాలలో 1,387, కథలాపూర్‌లో 1,345 కార్డులున్నాయి. అదే విధంగా ఇబ్రహీంపట్నంలో 1,326, మల్లాపూర్‌లో 1,111, పెగడపల్లిలో 968, కొడిమ్యాలలో 938, బుగ్గారంలో 933, రాయికల్‌లో 822, జగిత్యాల రూరల్‌ మండలంలో 807, బీర్‌ఫూర్‌లో 454, సారంగపూర్‌లో 417 రేషన్‌ కార్డులున్నాయి. జిల్లాలో అత్యధికంగా మెట్‌పల్లిలో 2,969, మల్యాలలో 2,095, అత్యల్పంగా బీర్‌పూ ర్‌లో 454, సారంగాపూర్‌లో 417 కార్డులున్నాయి.

పక్షం రోజుల పాటు పరిశీలన 

జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేషన్‌ కార్డుల పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరిశీలన చేపట్టనున్నారు. జాబితా ఆధారంగా పరిశీలన ప్రారంభించారు. అందుబాటులో ఉన్న లబ్ధిదారులను కలిసి విచారణ జరుపుతున్నారు. ఒక వేళ లబ్ధిదారులు వలస వెళ్లితే, స్థానికంగా అందుబాటులో లేకపోతే పోస్టు ద్వారా నోటీసు అందించనున్నారు. ఇందుకు వారు స్పందించాల్సి ఉం టుంది. పరిశీలన ఆధారంగా అర్హులు, అనర్హులను గుర్తించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయనున్నారు. తొలుతగా రెవెన్యూ అధికారులు, రెండవ దశలో ఆర్డీఓలు పరిశీలించనున్నారు. అనంతరం ప్రభుత్వానికి తుది నివేధికను అందించ నున్నారు. ఈ మేరకు రేషన్‌ దుకాణాలు, గ్రామ పంచాయతీ కార్యాల యాల వద్ద సంబంధిత జాబితాలను ప్రదర్శించనున్నారు. ఫీల్డ్‌ వెరిఫి కేషన్‌ సిబ్బంది చేసిన పరిశీలనలో సుమారు 10 నుంచి 20 శాతం వరకు కార్డులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ర్యాండమ్‌ పరిశీలన, అనూహ్య పరిశీలన చేయాలన్న ఆదేశాలున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ ఇందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. 

కొత్తగా పేర్లు నమోదుకు అవకాశంపై సందిగ్ధం

జిల్లాలో గతంలో కార్డులో నుంచి పేరు తొలగింపుకు గురయిన వారికి తిరిగి నమోదు చేయడంపై సందిగ్ధ పరిస్థితులున్నాయి. అప్పట్లో కార్డులను రద్దు చేయడానికి, కొన్ని కార్డులల్లో నుంచి కుటుంబ సభ్యుల పేర్లు తొలగించడానికి అనేక కారణాలున్నాయని అధికారులు భావిస్తు న్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం, కుటుంబం నుంచి వేరుపడడం, ఒక కార్డు నుంచి మరో కార్డులో సభ్యుల చేరిక, వలసలు వెళ్లడం, ఒక వేళ చనిపోవడం, రెండు కార్డులలో పేర్లు ఉండడం, ఇతర కారణాలతో పలువుర్ని తొలగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు అర్హులయిన వారు సైతం నష్టపోయారు. ఒకవేళ అర్హులైన కార్డు నుంచి పేరు తొలిగిపోతే, తదుపరి మంజూరు చేసిన కార్డుల్లో పేర్లు నమోదు చేసుకో వడం, కొత్తగా కార్డు పొందడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తు న్నారు. ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో సుమారు 20,067 ధరఖాస్తులు రేషన్‌ కార్డుల్లో చేర్పులు, మార్పులు కోరుతూ పెండింగ్‌లో ఉన్నట్లు సంబందిత వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో పాత రేషన్‌ కార్డుల్లో చోటుచేసుకున్న పలు తప్పు ఒప్పుల సవరణ దాదాపుగా నాలుగేళ్లుగా నిలిచిపోయాయి. 


అందని ప్రభుత్వ సాయం


జిల్లాలో పలు కుటుంబాలు అన్ని అర్హతలున్నప్పటికీ రేషన్‌ కార్డులు లేకపోవడంతో సర్కారు సాయం అందక అవస్థలు ఎదుర్కొంటున్నారు. రేషన్‌ దుకాణాల్లో నిత్యవసర వస్తువులు పొందలేక పోతున్నారు. వివిధ ప్రభుత్వ పనులకు రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డులను కొలమానంగా పరిగణిస్తుండడంతో కార్డులు లేని కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యాయి. రేషన్‌ కార్డు లేకపోవడం వల్ల వివిధ పనుల్లో చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం

- చందన్‌ కుమార్‌, జిల్లా పౌరసరాఫరా అధికారి

జిల్లాలో గతంలో రద్దయిన రేషన్‌ కార్డుల పునరుద్ధరణ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతాం. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు పూర్తి చేశాము. ఇప్పటికే జాబితాను సిద్ధం చేశాము. మండలాల వారీగా కార్డుల రద్దయిన వారి జాబితా రూపొందించాం. పక్షం రోజుల్లో రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదికలను అందించ తనున్నారు.  


Read more