పేదల ఆరోగ్యానికి భద్రత

ABN , First Publish Date - 2022-08-25T05:32:50+05:30 IST

ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్నవారికి, ప్రత్యేకించి అధికారులు సిఫారసు చేసిన వారికే ఆరోగ్యశ్రీ సేవలు అందాయి.

పేదల ఆరోగ్యానికి భద్రత

- ఆహార భద్రత కార్డులపై ఆరోగ్యశ్రీ సేవలు

- వర్తించనున్న ఆయుష్మాన్‌ భారత్‌ 

- పేదలకు తప్పనున్న ఇబ్బందులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్నవారికి, ప్రత్యేకించి అధికారులు సిఫారసు చేసిన వారికే ఆరోగ్యశ్రీ సేవలు అందాయి. ఇకనుంచి ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్న వారందరికీ సేవలు అందనున్నాయి. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా 5 లక్షల రూపాయల వరకు రోగులకు వైద్యాన్ని అందించనున్నారు. జిల్లాలో 2,22,081 ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉండగా, 6,41,154 మంది లబ్ధి పొందుతున్నారు. వీరందరికీ నేరుగా ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేయడంతో అనేక మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2004లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. అప్పటివరకు అంతంత మాత్రంగానే గత ప్రభుత్వాలు తెలుపు రంగు రేషన్‌ కార్డులను జారీ చేయగా, కాంగ్రెస్‌ హయాంలో నిబంధనలను సడలించి అనేక మంది రేషన్‌ కార్డులను జారీ చేశారు. అంతేగాకుండా తెలుపు రంగు రేషన్‌ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం కార్డులను అందజేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యాన్ని అందించనున్నారు. ఈ పథకంతో జిల్లాలో వేల మంది ఆరోగ్యశ్రీ ద్వారా తమకు వచ్చిన రోగాలను ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి నయం చేయించుకున్నారు. మొదటిసారి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేసిన వారికే ఈ పథకాన్ని వర్తింపజేయగా, ఆ తర్వాత పొందిన రేషన్‌ కార్డులు కలిగి ఉన్న వారికి వైద్య సేవలు అందలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బడి, ముబ్బడిగా అర్హతలు లేని వారికి తెలుపు రంగు రేషన్‌ కార్డులను జారీ చేశారని, బోగస్‌ కార్డులు బాగా ఉన్నాయని భావించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో జారీ చేసిన రేషన్‌ కార్డులన్నింటినీ రద్దు చేసింది. వాటి స్థానంలో ఆహార భద్రతా కార్డులను తీసుకవచ్చింది. అర్హులైన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి కార్డులను మంజూరు చేసింది. 

కుటుంబానికి రూ.5 లక్షల వరకు వైద్యం..

జిల్లాలో ఆహార భద్రతా కార్డులు 2,09,543 ఉండగా, అంత్యోదయ కార్డులు 12,365, అన్నపూర్ణ కార్డులు 173 ఉన్నాయి.. అయితే గతంలో ఆరోగ్యశ్రీ కార్డులు పొందిన కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందాయి. కార్డుల్లో పేర్లు లేని వారికి, ఎలాంటి కార్డులు లేని వాళ్లు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఆయన సిఫారసుల మేరకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయ అధికారులు ఆరోగ్యశ్రీ సేవలు పొందేందుకు ధ్రువీకరిస్తేనే సేవలు అందిస్తున్నారు. ఈ అనుమతి పత్రాలు పొందడానికి చాలా సమయం పట్టేది. ఈ క్రమంలో అత్యవసర వైద్యం అందించాల్సిన రోగులు పత్రం జారీ అయ్యేలోపే మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. చేతిలో డబ్బులు లేక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అనేక మంది వైద్యం చేయించుకుని అప్పుల పాలయ్యారు. మూడేళ్ల క్రితం కేంద్రం ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని తీసుకవచ్చింది. దీని ద్వారా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్య సేవలను అందిస్తారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఎట్టకేలకు గత ఏడాది జూన్‌ నుంచి రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమల్లోకి తీసుకవచ్చింది. దీంతో పలువురు ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను పొందారు. అవగాహన లేక చాలా ఆ కార్డులను పొందలేకపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య భద్రతా కార్డులను పట్టుకుని వెళ్లిన వారందరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలు వర్తించే విధంగా సవరణలు చేసింది. ఆహార భద్రతా కార్డు గుర్తింపు నంబర్‌ ద్వారా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించే విధంగా సాఫ్ట్‌వేర్‌ను సవరించారు. ఆరోగ్యశ్రీ కార్డు, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు లేకుంటే నేరుగా ఆహార భద్రతా కార్డును పట్టుకుని వెళితే వైద్య సేవలను అందిస్తున్నారు. దీంతో కార్డులు ఉండి ఆరోగ్యశ్రీ కార్డులు లేని వాళ్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పేదలకు ఇబ్బందులు తప్పాయి. ప్రభుత్వ నిర్ణయంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-08-25T05:32:50+05:30 IST