మహిళలు, యువతులను వేధిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-09-29T05:54:11+05:30 IST

మహిళలు, యువతులను వేధించే పొకిరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌కమిషనర్‌ వి సత్యనారాయణ అన్నారు.

మహిళలు, యువతులను వేధిస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న సీపీ వి సత్యనారాయణ

  - బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

- సీపీ వి సత్యనారాయణ

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 28: మహిళలు, యువతులను వేధించే పొకిరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌కమిషనర్‌ వి సత్యనారాయణ అన్నారు. బుధవారం కమిషనరేట్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసి అడిషనల్‌ డీజీపీ స్వాతిలక్రా పర్యవేక్షణలో ప్రత్యేకంగా షీటీం ఏర్పాటు చేశారన్నారు. పోకిరీల వేధింపులు భరించకూడదని, బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, యువతులు, విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తున్న వారిని పట్టుకుని చట్టప్రకారం శిక్షించేందుకు కమిషనరేట్‌ వ్యాప్తంగా 20 షీటీం బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు. కమిషనరేట్‌లో షీటీం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. వేధింపులకు గురవుతున్నవారు షీటీంకు ఫిర్యాదు చేసేందుకు నేరుగా పోలీసు ఠాణాలకు రానవసరం లేకుండానే 9440795182 ఫోన్‌ నంబర్‌ ద్వారా వాట్సప్‌, టెక్ట్స్‌ మెస్సేజ్‌, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ డయల్‌ 100, హాక్‌ ఐ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. కరీంనగర్‌ షీటీం ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళలు ఎక్కువగా ఉండే జనసమ్మర్థ ప్రాంతాల్లో షీటీం పోలీసులు మఫ్టీలో ఉంటూ అసభ్యకరంగా ప్రవర్తించేవారి కదలికలను సీక్రెట్‌ కెమెరాల ద్వారా రికార్డు చేసి పట్టుకుంటామన్నారు. వేధింపుల తీవ్రతనుబట్టి నిందితులపై క్రిమినల్‌ కేసులు  నమోదు చేస్తామన్నారు. 

- సైబర్‌ కాంగ్రెస్‌...

విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబర్‌ కాంగ్రెస్‌ పేరుతో 50 ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులను ఎంపికచేసి వారికి సైబర్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం ద్వారా 10 నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 11న సైబర్‌గ్రాండ్‌ ఫినాలే విజయవంతంగా నిర్వహించామన్నారు.  

- రక్షణ, నిబంధనలు పాటించిన వారికే టపాసుల లైసెన్స్‌లు

దుకాణాల వద్ద సరైన రక్షణ చర్యలు, నియమ నిబంధనలు పాటించిన వారికే టపాసుల లైసెన్స్‌లు జారీ చేస్తామని పోలీస్‌కమిషనర్‌ వి సత్యనారాయణ అన్నారు. దీపావళి సందర్భంగా టపాసుల విక్రయాలు జరిపే వ్యాపారులతో బుధవారం కమిషనరేట్‌ కేంద్రంలో సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు సకాలంలో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. టపాసుల విక్రయాల కోసం వ్యాపారులు మొదట వివిధ ప్రభుత్వ శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు పొందిన తర్వాతనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అనంతరం దరఖాస్తులను పరిశీలించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో భద్రతను పరిశీలించి అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ ఎస్‌ శ్రీనివాస్‌, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ విజయసారధి, స్పెషల్‌బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

Read more