టీఆర్‌ఎస్‌లో పెరుగుతున్న ఆశావహులు

ABN , First Publish Date - 2022-06-07T06:19:15+05:30 IST

పెద్దపల్లి టీఆర్‌ఎస్‌లో ఆశావహుల సంఖ్య పెరుగుతున్నది.

టీఆర్‌ఎస్‌లో పెరుగుతున్న ఆశావహులు

- పెద్దపల్లిలో పోటీకి సై అంటున్న ఈద శంకర్‌రెడ్డి, నల్ల మనోహర్‌ రెడ్డి 

- బీసీల నుంచి పోటీ పడుతున్న చిరుమల్ల రాకేష్‌


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి టీఆర్‌ఎస్‌లో ఆశావహుల సంఖ్య పెరుగుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు తహతహలాడుతున్న పలువురు నేతలు పార్టీ అధినేత కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను ఆకర్శించే పనిలో నిమగ్నమయ్యారు. పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకుని వెళుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పార్టీ వరుసగా రెండుసార్లు టిక్కెట్‌ ఇచ్చింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తానిపర్తి భానుప్రసాదరావుపై 62,677 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, రెండోసారి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావుపై 8,466 ఓట్ల తేడాతో గెలుపొందారు. 40 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలిచిన అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి కావడం విశేషం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పరంగా గతంలో కంటే ప్రస్తుతం మరింత వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నది. దాని ప్రభావం ఆ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా పడుతున్నది. గత ఎన్నికల్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నలుగురైదుగురు మినహా అందరు సిట్టింగ్‌లు, ఓటమి చెందిన అభ్యర్థులకు కూడా టిక్కెట్లు ఇచ్చారు. గత ఎన్నికల్లో కూడా పార్టీకి చెందిన పలువురు నాయకులు టిక్కెట్‌ ఆశించారు. ఈసారి సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తారా, కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే స్పష్టత రావాల్సి ఉన్నది. గతంలో కంటే ఆయా నియోజకవర్గాల్లో పలువురు పాత అభ్యర్థులను మార్చి కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో పాటు ఐడీసీ మాజీ చైర్మన్‌ ఈద శంకర్‌ రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి చెందిన టీఎస్‌టీఎస్‌ మాజీ చైర్మన్‌ సీహెచ్‌ రాకేష్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్‌ రెడ్డి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. అలాగే సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పని చేసి రాజీనామా చేసిన పరిపాటి వెంకట్రామిరెడ్డి నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అంతా భావించారు. ఆయనకు కేసీఆర్‌ అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద రావు కూడా ఇక్కడి నుంచి టిక్కెట్‌ ఆశిస్తూ వచ్చారు. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించడంతో ఆయన ఎమ్మెల్యే టిక్కెట్‌పై ఆశలు వదులుకున్నారు. 

- మళ్లీ రెడ్డి వర్గానికేనా?

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల వారీగా రెడ్డి కులస్తులకు ఒక్క పెద్దపల్లి నియోజకవర్గం నుంచే టిక్కెట్‌ ఇస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారికి టిక్కెట్‌ ఇవ్వనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. పార్టీ అధినేతకు, కేటీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఈద శంకర్‌ రెడ్డి, సీహెచ్‌ రాకేష్‌ టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. మరో నేత నల్ల మనోహర్‌ రెడ్డి నల్ల ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి చొచ్చుకుని వెళుతున్నారు. గత ఎన్నికల్లో కూడా సదరు నాయకులంతా టిక్కెట్‌ ఆశించారు. ఈసారి మాత్రం తీవ్రంగా యత్నాలు చేస్తున్నారు. నల్ల మనోహర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై ఆశలు పెంచుకున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కూడా మళ్లీ పోటీ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఒకవేళ పార్టీ ఆయనకు టిక్కెట్‌ ఇవ్వకుంటే తన కుమారుడు దాసరి ప్రశాంత్‌ రెడ్డికి గానీ, ఆయన కోడలు, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ మమతారెడ్డికి గానీ టిక్కెట్‌ అడిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌, బీజేపీలు గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులను బట్టి టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇక్కడి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డికి ఇస్తారా లేక మరెవరికైనా ఇస్తారా వేచి చూడాల్సిందే. ఆశావహులు మాత్రం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. 

 

Read more