ఘనంగా చిన్న బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-26T05:47:07+05:30 IST

నగరంలోని ఆలయాలు, వీధులన్నీ బతుకమ్మ పాటలతో మార్మోగాయి. ఎంగిలిపూలు పేరుతో చిన్న బతుకమ్మ వేడుకలను మహిళలు ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు.

ఘనంగా చిన్న బతుకమ్మ

 కరీంనగర్‌ కల్చరల్‌, సెప్టెంబరు 25: నగరంలోని ఆలయాలు, వీధులన్నీ బతుకమ్మ పాటలతో  మార్మోగాయి. ఎంగిలిపూలు పేరుతో చిన్న బతుకమ్మ వేడుకలను మహిళలు ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. టవర్‌సర్కిల్‌ వద్ద మహిళలు బతుకమ్మ ఆడారు. గంజ్‌లోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయం ఎదుట వ్యాపారుల కుటుంబాలకు చెందిన స్త్రీలు బతుకమ్మ ఆడారు. రామచంద్రాపూర్‌ కాలనీలో అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఏర్పాట్లను స్థానిక కార్పోరేటర్‌ చొప్పరి జయశ్రీవేణు పర్యవేక్షించారు. జ్యోతీనగర్‌ కుర్మవాడ వద్ద గల గోకుల్‌నగర్‌ చౌరస్తాలో మహిళలు బతుకమ్మ ఆడారు. మంత్రి గంగుల కమలాకర్‌ నివాసంలో మంత్రి సతీమణి గంగుల రజితతో పాటు మహిళలు బతుకమ్మ ఆడారు. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఎంపి, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ పాల్గొనగా ఎంపి సతీమణి అపర్ణ మహిళలతో కలసి బతుమ్మ ఆడారు. భగత్‌నగర్‌ 33వ డివిజన్‌లోని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు నివాసం ఎదుట మేయర్‌ సతీమణి అపర్ణ మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. రాంనగర్‌ 37వ డివిజన్‌లో రమాసత్యనారాయణస్వామి, అభయాంజనేయస్వామి ఆలయం ముందు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చల్ల హరిశంకర్‌ విస్తృత ఏర్పాట్లు చేయగా ఆయన సతీమణి డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి స్థానిక మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. వావిలాలపల్లి అల్ఫోర్స్‌ విద్యా సంస్థల్లో జరిగిన బతుకమ్మ వేడుకలకు అతిథులుగా జడ్పీ సీఈవో ప్రియాంక కర్ణన్‌, కార్పొరేటర్‌ గందె మాధవి, విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ వి నరేందర్‌రెడ్డి, ఆయన సతీమణి డాక్టర్‌ వనజారెడ్డి హాజరయ్యారు. చైతన్య జూనియర్‌ కళాశాలలో జరిగిన వేడుకల్లో చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్‌ నరేందర్‌రెడ్డి, డీన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏజీఎం శ్రీనివాస్‌, విద్యార్థినులు పాల్గొన్నారు.


Read more