ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి

ABN , First Publish Date - 2022-11-12T00:13:36+05:30 IST

జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లపై వరి కుప్పలు కనిపిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి
హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌ రూరల్‌, నవంబరు 11: జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లపై వరి కుప్పలు కనిపిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్‌ జిల్లా వరి పండించే ప్రాంతమని, ఐకేపీ సెంటర్లు ప్రారంభించినా కొనుగోళ్లను ప్రారంభించలేదన్నారు. 30 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారని, సీఎం స్పందించి వెంటనే దాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలన్నారు. ఐకేపీ సెంటర్లలో రైతులను ఇబ్బందులు పెట్టకుండా సకాలంలో పంటను దించుకొని వెంటనే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2014లో సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మెలకు, సంఘాలకు తన రాజ్యంలో అవకాశం లేదని చెప్పి, మున్సిపల్‌ కార్మికులపై వేటు వేసి 1,500 మందిని తొలగించారన్నారు. వీఆర్‌ఏలు 60 మంది చనిపోతే దరఖాస్తు ఇవ్వడానికిపోతే మొఖంపై కొట్టిన సంస్కృతి కేసీఆర్‌దన్నారు. తన లాంటి వాడు గెలిచి అసెంబ్లీకి వెళ్లితే కనీసం లోపలికి కూడా రానివ్వలేదన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజలు సీఎం కేసీఆర్‌కు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. ఐపీఎస్‌ అధికారులు ముఖ్యమంత్రికి జీతగాళ్లు కాదని, ఈ దేశం రాష్ట్రంలో ఒక భాగమని, ప్రజాస్వామ్య స్వేచ్ఛను, లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో సర్పంచ్‌లు అష్టకష్టాలు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం 14 ఫైనాన్స్‌ నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలన్నారు. యూటిలైజేషన్‌ సర్టిఫికేట్‌ సకాలంలో కేంద్రానికి పంపించకపోవడం వల్ల నిధులు విడుదల కావడం లేదని, అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని, దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్‌ పోస్టు సుంకరోళ్ల కంటే అధ్వానంగా మారిందన్నారు. నేడు రూ. 6500కోట్లతో అభివృద్ధి చేసిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రజల హక్కు లకు విలువ కట్టి నీచమైన, నీకృష్టమైన రాజకీయాలకు తెర లేపిన వ్యక్తి కేసీఆర్‌ అని అన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని డబ్బులు ఖర్చు పెట్టకపోతే డిపాజిట్‌ గల్లంతయ్యేదన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు, సర్పంచ్‌ నేరేళ్ల మహేందర్‌గౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అనుమాండ్ల శ్యాంసుందర్‌రెడ్డి, బీజేపీ పట్టణాధ్యక్షుడు గంగిశెట్టి రాజు, బీజేపీ నాయకులు మండల సాయిబాబా, పోతుల సంజీవ్‌, దేవేందర్‌రావు, నల్ల సుమన్‌, హృతిక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:13:36+05:30 IST

Read more