ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-02-16T06:01:23+05:30 IST

జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు
తెలంగాణ చౌక్‌లో మేయర్‌ సునీల్‌రావు ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

- జిల్లావ్యాప్తంగా అన్నదానం, పండ్ల పంపిణీ 

- సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు తెలంగాణకే పెద్దపండుగ 

-జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ క్రియాశీలపాత్ర పోషించాలి

- రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ 

కరీంనగర్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని 15,16,17 తేదీల్లో మూడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. మొదటి రోజు అన్నదానం, పండ్ల పంపిణీ, రెండవ రోజు రక్తదానం, మూడవ రోజు మొక్కలు నాటడంతో పాటు బీసీ వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజికసేవా  కార్యక్రమా లను చేపట్టాలని టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాశాఖ పార్టీశ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్‌లో నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ జననం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వరమని, ఆయన కారణజన్ముడని అన్నారు. 68వ పుట్టినరోజు వేడుకలను మూడురోజులపాటు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు.  జిల్లా ప్రజల పక్షాన కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని అన్నారు. కేసీఆర్‌ తెలంగాణ ఆస్తి అని, కేసీఆర్‌ పుట్టిన గడ్డపై పుట్టడం మన అదృష్టమన్నారు. ఎందుకు మా గడ్డపై ఆయన పుట్టలేదని ఇతర ప్రాంతాలవారు భావిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం ఫిబ్రవరి 17 కోసం తెలంగాణతో పాటు దేశ, ప్రపంచంలోని ప్రతి తెలంగాణ బిడ్డ ఎదిరిచూస్తున్నారని చెప్పారు. అన్ని మతాలవారు వారివారి పండుగలతోపాటుగా సీఎం కేసీఆర్‌ జన్మదినం పండుగను పెద్దపండుగగా భావిస్తారని అన్నారు. వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం, తెలంగాణ ప్రజల ప్రార్థనలు, దీవెనలు సీఎం కేసీఆర్‌పై చిరకాలం ఉంటాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడు సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని దిగ్విజయంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారన్నారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.   ఈ ప్రగతి దేశం మొత్తం చేరాలని త్వరలోనే దేశం పగ్గాలు చేపట్టి అభివృద్ధి సాధించాలని, ఆయన నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆకాంక్షించారు. మేయర్‌ సునీల్‌రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల కల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును సాకారం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరుస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుపుతున్న సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరారు. అలాగే 42వ డివిజన్‌లో కార్పొరేటర్‌ మేచినేని వనజ అశోక్‌రావు ఆధ్వర్యంలో, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. మానకొండూర్‌  మండల కేంద్రంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావులు దివ్యాంగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని, జాతీయ రాజకీయాల్లో కూడా రాణిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చొప్పదండి మండలం కేంద్రలో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-02-16T06:01:23+05:30 IST