అభివృద్ధి పనులకు అటవీ అధికారులు సహకరించాలి

ABN , First Publish Date - 2022-09-30T05:05:44+05:30 IST

ప్రజా అవసరాల కోసం అటవీ భూముల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ శాఖ అధికారులు సహకారం అందించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు.

అభివృద్ధి పనులకు అటవీ అధికారులు సహకరించాలి
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ

- జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ 

సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 29: ప్రజా అవసరాల కోసం అటవీ భూముల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ శాఖ అధికారులు సహకారం అందించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో గురువారం జిల్లాలోని ప్రభుత్వ భూములు లేనిచోట ప్రభుత్వ అవసరాల కోసం అటవీ భూములను వినియోగించుకోవడంపై కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, గోదాములు, నిర్మిస్తున్నారని అన్నారు. గిరిజనులు, అధికంగా నివసించే వీర్నపల్లి మండలంలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో మౌలిక వసతుల కల్పన పనులకు ప్రతిబంధకాలు ఎదురువుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రజా అవ సరాల కోసం చేపట్టే నిర్మాణ పనులకు అటవీ భూములను వినియోగించుకునేందుకు, అటవీ, రెవెన్యూ, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం 2016 ప్రోసీజరీ ప్రకారం ప్రజా అవసరాలు, ప్రభుత్వ పనులు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పెండింగ్‌ పనులను త్వరగా పూర్తిచేసేందుకు అటవీ శాఖ అఽధికారులు తమవంతు సహకారం అందించాలని అన్నారు. అటవీ చట్టంలోని నిబంధనల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు అన్ని విధాలుగా సహకారం అందించాలన్నారు. పోడు భూములపై హక్కులను కల్పించాల్సిందిగా పెట్టుకున్న అర్జీల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లే ఆస్కారం ఉంటుందని అన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, ఆర్డీవోలు శ్రీనివాసరావు, పవన్‌కుమార్‌, జిల్లా అటవీ అఽధికారి బాలమణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గంగారం, వీర్నపల్లి జడ్పీటీసీ గుగులోతు కళావతి, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఇన్‌చార్జి డీఆర్‌డీవో గౌతంరెడ్డి, గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, పంచాయతీరాజ్‌ ఈఈ సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-30T05:05:44+05:30 IST