పూల పండుగొచ్చె

ABN , First Publish Date - 2022-09-25T06:14:28+05:30 IST

ఆడపడుచులు ఆనందంగా జరుపుకునే పూల పండుగకు వేళైంది. తీరొక్క పూలను పూజించే బతుకమ్మ పండుగ ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుకానుంది.

పూల పండుగొచ్చె
సిరిసిల్లలో బతుకమ్మ సంబరాలు

- నేటి నుంచి ఎంగిలి పూల బతుకమ్మ 

- అక్టోబరు 3న పెద్ద బతుకమ్మ

- ఆడ పడుచులు పుట్టింటికి వస్తున్న వేళ 

- సర్కారు బతుకమ్మ సారె 


(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఆడపడుచులు ఆనందంగా జరుపుకునే పూల పండుగకు వేళైంది. తీరొక్క పూలను పూజించే బతుకమ్మ పండుగ ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుకానుంది. తొమ్మిది రోజుల పాటు సాగే పూల జాతరకు జిల్లా మహిళలు సిద్ధమయ్యారు. బతుకమ్మ సంబరాలతో మహిళలే కాదు ప్రకృతి కూడా పుకలరిస్తుంది.  బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలు స్తుంది. పల్లెలు, పట్టణాల్లో వాకిళ్లు పూల తోటలను తలపిస్తాయి.  బతుకమ్మ పండుగ వేళ  పుట్టింటికి వచ్చే ఆడపడుచులు  తంగేడు పువ్వు ముచ్చట్లు... గునుగు పువ్వు సంబరాల మధ్య ఆటాపాటలతో సందడిగా గడుపుతారు. మహాలయ అమవాస్య ఆదివారం నుంచి చిన్న బతుకమ్మలతో మొదలై నవమి రోజున పెద్ద బతుకమ్మతో ఉత్సవాలు ముగుస్తాయి.  అక్టోబరు 3న సద్దుల (పెద్ద) బతు కమ్మను నిర్వహించనున్నారు. 

ఆనందోత్సవాలను నింపే బతుకమ్మ 

సంవత్సరం పొడవునా ఎన్ని పండుగలు జరుపు కుంటున్నా బతుకమ్మ పండుగ మాత్రం కుటుం బంలో ఆనందోత్సాహాలను నింపుతుంది.  తొమ్మిది రోజులపాటు ఆటాపాటలతో సాగిపోయి దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మతో ముగి సే పండుగ కోసం ఆడ పడుచులందరూ ఎదురు చూస్తారు. తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ వెనక అనేక కథలు, గాధలు ఉన్నాయి.  

 ప్రకృతి పులకరించే పండుగ 

బతుకమ్మ పండుగ అంటే మహిళలే కాదు ప్రకృతి కూడా పుకలరిస్తుంది. ఆడపడుచులు పుట్టింటికి వచ్చి సందడి చేసే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. బతుకమ్మ పండుగ రోజులు పల్లెబాటలకు ఇరువైపులా పసుపు పార బోయిసినట్లుగా తంగేడు.. ఏ దిక్కున చూసినా పలకరించే కట్ల పూలు, ప్రతీ ఇంటి గడప ముందు కనిపించే మందారాలు,  గన్నేరు.. నేలంతా పరుచు కునే గుమ్మడి ఇలా.. తీరొక్క రంగుల పూలు ఆడ పడుచుల్లో ఆనందాన్ని నింపుతాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్ద బతుకమ్మను మహిళలు జరుపుకుంటే.. అందుకు ఐదు రోజుల ముందు పిల్లలు బొడ్డెమ్మ పండుగను జరుపుకున్నా రు. బొడ్డెమ్మ తరువాత వచ్చే అమవాస్య నుంచి మహిళలు బతుకమ్మ సంబరాలను ప్రారంభిస్తారు. మగవారంతా తంగేడు, గునుగు పూలను పచ్చిక బయల్లలోంచి సేకరించి తీసుకొస్తారు. ఇంటిల్లిపాది ఎంతో ఉత్సాహంగా బతుకమ్మను పేరుస్తారు. చివరి రోజున పెద్ద బతుకమ్మ పేర్చి గౌరి దేవిని కీర్తిస్తూ ప్రధాన కూడలి వద్ద మహిళలు ఆడి పాడుతారు. చీకటి పడుతున్న వేళ ఊరి శివారులో ని వాగులు, చెరువుల వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి పెద్ద బతుకమ్మకు వీడ్కోలు పలుకుతారు. రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆడ పడుచులు  వాయినాలు ఇచ్చుకుంటారు. 

తెలంగాణలోనే అతిపెద్ద బతుకమ్మ ఘాట్‌

బతుకమ్మ సంబరాలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఘాట్‌ కొత్త శోభను తెచ్చింది. 2018లో మంత్రి కేటీఆర్‌ చొరవతో జిల్లా యంత్రాంగం బతుకమ్మ ఘాట్‌ నిర్మించింది. కేవలం 28 రోజుల్లోనే రూ .1.60 కోట్ల వ్యయంతో సిరిసిల్ల మానేరు వాగు తీరంలో అందరూ అబ్బురపడే విధంగా నిర్మాణం జరిగింది. 40 ఫీట్ల వెడల్పు రోడ్డు, ఇరువైపులా పుట్‌పాత్‌లు, చెట్లు, లైట్లు ఏర్పాట్లు చేశారు. 120 ఫీట్లతో ఘాట్‌ నిర్మాణం చేపట్టడంతోపాటు గ్రానైటుతో తీర్చిదిద్దారు. 8,700 చదరపు అడుగులలో బతుకమ్మలు వేయడానికి తెప్పను నిర్మించారు. తెప్ప మధ్యలో తల్లీకూతుళ్ల ప్రతిమలను ఏర్పాటు చేయడంతోపాటు ఆకర్షణీయంగా కనిపించడం కోసం లైట్లను ఏర్పాటు చేశారు.


రోజుకో పేరు.. ఫలహారం 

బతుకమ్మకు రోజుకో పేరుతో పిలుచుకుంటూ ఫలహారాన్ని సమర్పించుకుంటారు. మాపటేల ఆటాపాటలతో రకారకాల ఫలహారాలు బతుకమ్మ కు సమర్పించి వాయిునాలుగా ఇచ్చి పుచ్చుకుం టారు. పల్లెల బాధలను, గాథలను, మంచి చెడుల ను తెలియజెప్పే పాటలతో గడిపే మహిళలు గౌరమ్మకు అందించే ఫల హారాలు ఇలా ఉంటాయి..

మొదటి రోజు : ఎంగిలిపూల బతుకమ్మగా పేరుస్తారు. ఈ రోజు నువ్వులు, బెల్లం, మొక్కజొన్న పేలాలు సమర్పిస్తారు. 

రెండో రోజు : అటుకుల బతుకమ్మ. సప్పిడి పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం.

మూడో రోజు : ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు బెల్లం, పాలతో ప్రసాదం.

నాలుగో రోజు : నానబియ్యం బతుకమ్మ. నాని  న బియ్యం, పాలలో నానబెట్టిన బియ్యంపిండితో బెల్లం కలిపి ప్రసాదం చేస్తారు. 

ఐదో రోజు : అట్ల బతుకమ్మ. బియ్యం నానబెట్టి దంచి తీసిన పిండితో తయారు చేసిన అట్లు ప్రసాదంగా తీసుకెళ్తారు. 

ఆరో రోజు : అలిగిన బతుకమ్మ. కొన్ని చోట్ల బతుకమ్మను పేర్చడం, ఆడడం చేయరు. ఆ రోజు బతుకమ్మ అలిగిందని అతివలు విశ్వసిస్తారు. ఒకవేళ బతుకమ్మ ఆడినా ప్రసాదం ఏమీ చేయరు. 

ఏడో రోజు : వేపకాయల బతుకమ్మ. సకినాలు చేసే పిండిని వేపకాయలంత పరిమాణంలో ముద్ద లా చేసి నూనెలో వేయించి ప్రసాదం చేస్తారు. పప్పు బెల్లం కూడా తయారు చేస్తారు. 

ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న బెల్లం, నెయ్యితో చేసిన ఫలహారం. 

తొమ్మిదో రోజు: పెద్ద బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పేర్చి ఫలహారాలతో సాగనంపుతారు. చివరి రోజు సద్దుల బతుకమ్మగా పిండి వంటలతో ఉత్సాహంగా గడుపుతారు. రకరకాల పిండి వంటలతో పోటీ పడతారు.  ఇంటిల్లిపాది బతుకమ్మను సాగనంపుతారు. 


 2.18 లక్షల మంది 

ఆడపడుచులకు సర్కారు సారె 

బతుకమ్మ పండుగకు ప్రభుత్వం తరపున విభిన్న రంగుల్లో తయారు చేసిన చీరల పంపి ణీ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ చీరల పంపిణీ ని లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ అడపడుచులందరికీ అందించే సర్కారు సారె సిరిసిల్ల మరమగ్గాలపై విభిన్న రంగులు, డిజైన్లతో చీరలను ఉత్పత్తి చేశారు. ఈసారి 24 డిజైన్లు, పది రంగులు కలిపి 240 వెరైటీల్లో జరీ పోగుల అంచులతో అతివలను ఆకర్షించే విధంగా తయారు చేశారు. బతుకమ్మ చీరల తయారీకి రూ.339.73 కోట్లు ఖర్చు చేశారు. కోటి చీరల ఉత్పత్తిలో ఈ సారి మహిళలకు చీర, జాకెట్‌ బట్టను విడివిడిగా అందిస్తున్నారు. 92 లక్షల చీరలు యువతులు, మహిళలకు, 6 మీటర్లతో చీరలు ఉత్పత్తి చేస్తే వృద్ధుల కోసం 9 మీటర్లతో  8 లక్షల చీరలను తయారు చేశా రు. రేషన్‌ కార్డు అధారంగా మహిళలకు చీరల ను అందిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల 18 వేల 725 మంది లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేస్తున్నారు. 

సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమలోనే 2017 నుంచి బతుకమ్మ చీరలను తయారు చేస్తున్నా రు. రూ.225 కోట్లతో 94 లక్షల చీరల ఉత్పత్తికి మొదట శ్రీకారం చుట్టారు.   ఆ తరువాత క్రమంలో చీరల డిజైన్లలో అనేక మార్పులు తీసుకొచ్చారు. 2018లో రూ.280 కోట్లతో 98 లక్షల చీరలను 80 రంగుల్లో అందించారు. 2019లో రూ.320 కోట్లతో వంద రంగుల్లో జరి అంచు పోగులతో తయారు చేశారు. 2020లో రూ.330 కోట్లతో 225 రంగుల్లో కోటి చీరలను వెండి, జరీ అంచుల్లో అందించారు. 2021 సం వత్సరంలో రూ.350 కోట్లతో కోటి చీరలను తయారు చేయించారు. ప్రస్తుతం రూ.339 కోట్లతో చీరల ఉత్పత్తి వేగంగా కోటి చీరల ఉత్పత్తి చేశారు. జిల్లాలో సిరిసిల్లలో 33,803 మంది ఆడపడుచులు ఉండగా బోయినపల్లిలో 14421, చందుర్తి  13,451, ఇల్లంతకుంట  18, 948, కోనరావుపేట  17,770, ముస్తాబాద్‌ 18,660, రుద్రంగి  6638, తంగళ్లపల్లి 17,788, వీర్నపల్లి  5549, వేములవాడ రూరల్‌  9344, వేములవాడలో 25006,ఎల్లారెడ్డిపేటలో 19566 అడపడుచులకు చీరలు అందిస్తున్నారు.

Updated Date - 2022-09-25T06:14:28+05:30 IST