అంచనాలు తలకిందులు

ABN , First Publish Date - 2022-11-30T01:05:58+05:30 IST

తగ్గిన దిగుబడి, తరుగు, తేమ పేరిట విధిస్తున్న కోత కారణంగా రైతులు ప్రైవేట్‌లోనే ధాన్యం విక్రయించుకోవడానికి మొగ్గు చూపడంతో కొనుగోలు కేంద్రాలకు ఆశించిన మేరకు ధాన్యం రావడం లేదు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులై కోతలు కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో అక్కడక్కడా వాటిని మూసివేస్తున్నారు.

   అంచనాలు తలకిందులు

- ఇప్పటికి కొన్నది 1.91 లక్షల టన్నులే

- చివరి దశలో కోతలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

తగ్గిన దిగుబడి, తరుగు, తేమ పేరిట విధిస్తున్న కోత కారణంగా రైతులు ప్రైవేట్‌లోనే ధాన్యం విక్రయించుకోవడానికి మొగ్గు చూపడంతో కొనుగోలు కేంద్రాలకు ఆశించిన మేరకు ధాన్యం రావడం లేదు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులై కోతలు కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో అక్కడక్కడా వాటిని మూసివేస్తున్నారు. ప్రభుత్వం వానాకాలం సీజన్‌కుగాను జిల్లాలో 4.6 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు రెండు లక్షల టన్నుల ధాన్యం కూడా రాలేదు. మరో 20 నుంచి నెల రోజుల్లో వరికోతలు, పంట నూర్పిడి పూర్తికానుండడంతో మూడు లక్షల టన్నులకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాదని భావిస్తున్నారు.

ఫ 4.6 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా

జిల్లాలో వానాకాలంలో 2,70,948 ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఎకరాకు 22 క్వింటాళ్ల చొప్పున 6 నుంచి 6.20 లక్షల టన్నుల వరిధాన్యం దిగుబడిగా వస్తుందని, అందులో రైతులు స్వంత అవసరాలకు వినియోగించే ధాన్యం, విత్తనపు పంటను మినహాయిస్తే 4 లక్షల 60 వేల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 353 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని తలపెట్టి నవంబరు 1 నుంచి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 342 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నెల రోజులుగా జిల్లావ్యాప్తంగా 31,001 మంది రైతుల నుంచి 1,91,492 టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ 394 కోట్ల 47 లక్షల రూపాయలు కాగా ఇప్పటి వరకు రైతులకు 213 కోట్ల 51 లక్షల రూపాయలను చెల్లించారు. ఇంకా 180 కోట్ల 96 లక్షల రూపాయలను రైతులకు చెల్లించాల్సి ఉన్నది.

ఫ 15 ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత

వరికోతలు పూర్తి కావస్తుండడం, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడంతో ఇప్పటికే డీసీఎంఎస్‌ సంస్థకు చెందిన 11 కొనుగోలు కేంద్రాలను, ఐకేపీకి చెందిన నాలుగు కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. ప్రతిరోజు కొన్ని కేంద్రాలు మూసివేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమయింది. ఒకవైపు గ్రామాల్లో 70 శాతం మేరకు వరి కోతలు పూర్తికాగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం మాత్రం నామమాత్రంగానే ఉంది.

ఫ కల్లాల వద్దే ప్రైవేట్‌ వ్యాపారులకు..

కల్లాల వద్దే రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. మద్దతు ధర కంటే క్వింటాలుకు 100 నుంచి 200 రూపాయలు తక్కువ చెల్లిస్తున్నా వెంటనే డబ్బులు రావడం, తాలు, తేమ అంటూ తూకంలో ధాన్యం కోతలు విధించకుండా కొనుగోలు చేయడంతోనే రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు ధాన్యం విక్రయించడానికి మొగ్గు చూపిస్తున్నారని సమాచారం. ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా వ్యాపారులు వచ్చి ధాన్యం కొనడానికి ఆసక్తి చూపిస్తుండడంతో స్థానిక వ్యాపారులు కూడా గ్రామాలబాట పట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.

ఫ సన్న రకాలకు మద్దతు ధర కంటే ఎఉక్కువ

సన్నరకం ధాన్యాన్ని మిల్లర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే క్వింటాలుకు 100 నుంచి 200 రూపాయలు ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్‌గా రైతులు తక్కువ ధరకే ధాన్యం విక్రయిస్తుండడంతో కొన్ని సీడ్‌ కంపెనీలు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి శుద్ధి చేసి ఫేత్‌ఫుల్‌ సీడ్‌ లేబుల్‌తో విత్తనాలుగా మార్కెట్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిసింది. కొందరు మిల్లర్లు గత సంవత్సరం కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం తీసుకున్న ధాన్యాన్ని అప్పుడే మార్కెట్‌లో విక్రయించుకొని ఆ డబ్బును వాడుకున్నందున ప్రస్తుతం తక్కువ ధరకు ధాన్యం కొని ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. వ్యవసాయశాఖ ఈ సీజన్‌లో ఎకరాకు 22 క్వింటాళ్లు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినా ముందుగా నాట్లు వేసిన పొలాల్లో మాత్రమే ఆ మేరకు దిగుబడి వచ్చింది. ఆలస్యంగా నాట్లు వేసినచోట 15 నుంచి 17 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చిందని రైతులు అంటున్నారు. వీటన్నింటి కారణంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాబడి తగ్గిపోయింది. ఇప్పటి వరకు 1,91,492 టన్నులు మాత్రమే కొనుగోలు కేంద్రాలకు రాగా ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు లక్షల టన్నులకు మించకపోవచ్చని భావిస్తున్నారు. ముందుగా వేసిన అంచనాల్లో లక్షా 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తగ్గే అవకాశం ఉంది.

Updated Date - 2022-11-30T01:05:58+05:30 IST

Read more