‘రైతుబంధు’ కోసం నిరీక్షణ

ABN , First Publish Date - 2022-06-12T05:43:33+05:30 IST

వానాకాలం సీజన్‌ ప్రారంభమైనా రైతుల ఖాతాల్లో ‘రైతుబంధు’ సొమ్ము జమ కాలేదు.

‘రైతుబంధు’ కోసం నిరీక్షణ

- మొదలైన వ్యవసాయ పనులు

- రైతుల ఖాతాల్లో జమ కాని డబ్బులు

- పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బందులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వానాకాలం సీజన్‌ ప్రారంభమైనా రైతుల ఖాతాల్లో ‘రైతుబంధు’ సొమ్ము జమ కాలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు డబ్బులను జమ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 2,86,770 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఆరుతడి పంటలను సాగు చేసే భూములను ఇప్పటికే చదును చేశారు. తొలకరి జల్లులు కురియగానే విత్తనాలు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. దుక్కి దున్నేందుకు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతుల వద్ద పెట్టుబడి సొమ్ము లేక సతమతం అవుతున్నారు. యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో డబ్బులు రైతుల ఖాతాల్లో జమకాలేదు. బ్యాంకుల్లో పాత రుణాలు చెల్లిస్తేనే అధికారులు కొత్తగా రుణాలు ఇస్తారు. రైతుబంధు డబ్బులు కూడా రాకపోవడం గమనార్హం. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018 యాసంగి సీజన్‌ నుంచి రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. మొదటి సంవత్సరం ఎకరానికి రూ. 4 వేలు ఇవ్వగా, ఆ తర్వాత సీజన్‌ నుంచి రూ. 5 వేలు అందిస్తున్నది. ప్రతి ఏటా రెండు సీజన్లకు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. సీజన్‌ ఆరంభానికి 15 రోజుల ముందు నుంచే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సొమ్మును ఇస్తున్నది. పట్టా కలిగిన ప్రతి రైతుకు సాయాన్ని ఎలాంటి సీలింగ్‌ లేకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, ఐటి చెల్లింపుదారులకు కూడా సాయాన్ని ఇస్తున్నారు. 

ఆందోళనలో రైతులు..

గత ఏడాది వానాకాలం సీజన్‌లో జిల్లాలోని 1,32,587 మంది రైతులకు 127 కోట్ల 93 లక్షల 45 వేల 313 రూపాయలను అందజేసింది. యాసంగి సీజన్‌లో 1,38,196 మంది రైతులకు 135 కోట్ల 73 లక్షల 33 వేల 729 రూపాయలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఈ సీజన్‌లో రైతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఆదిరెడ్డి పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో ఎంత మంది రైతులు పట్టాలు కలిగి ఉంటారో వారందరికీ రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ, ఇంతవరకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే తొలకరి జల్లులు పడాల్సి ఉండగా, రాష్ట్రానికి ఇంకా నైరుతి రుతు పవనాలు రాలేదు. మరో నాలుగైదు రోజుల సమయం పట్టవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొంటున్నారు. ఆరుతడి పంటలను సాగు చేసే రైతులు ట్రాక్టర్లతో దుక్కులు దున్నించారు. తమ వద్ద డబ్బులు లేకున్నా ఉద్దెరకు దుక్కులను దున్నించుకున్నారు. పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తే అప్పుడే భూమిలో విత్తనాలు వేయాలని రైతులు భావిస్తున్నారు. పెట్టుబడి సాయాన్ని ఇప్పుడు, అప్పుడు అని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ ఇంకా డబ్బులను విడుదల చేయలేదు. బడ్జెట్‌ లేమితో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నది. దీంతో ఈ సీజన్‌లో పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యమయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. 

Read more