ఆర్థిక గణాంక సర్వే

ABN , First Publish Date - 2022-09-11T05:24:05+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ అభివృద్ధి పథకాల రూపకల్పనకు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు కావాల్సిన పటిష్ట సమాచారాన్ని సేకరించేందుకు ప్రతి ఏటా నిర్వహించే ఆర్థిక గణాంక సర్వేకు సంబంధిత అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఆర్థిక గణాంక సర్వే

- ఈనెల నుంచి వచ్చే ఏడాది జూన్‌ వరకు నిర్వహణ

- 8 గ్రామాలు, 8 పట్టణాల్లో సర్వే వివరాల సేకరణ

- నివేదిక ఆధారంగానే అభివృద్ధి పథకాల రూపకల్పన

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ అభివృద్ధి పథకాల రూపకల్పనకు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు కావాల్సిన పటిష్ట సమాచారాన్ని సేకరించేందుకు ప్రతి ఏటా నిర్వహించే ఆర్థిక గణాంక సర్వేకు సంబంధిత అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేను వాస్తవానికి జూన్‌ 1వ తేదీ నుంచే నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాల వల్ల ఆలస్యమయ్యింది. ఈ నెల 12వ తేదీన సహాయ గణాంకాధికారులకు, సిబ్బందికి కరీంనగర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 8 పట్టణాలను, 8 గ్రామాలను సర్వే నిర్వహించేందుకు గాను ఎంపిక చేశారు. పట్టణ విభాగంలో రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని ప్రాంతాన్ని నాలుగు విభాగాలుగా, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో సుల్తానాబాద్‌, పూసాలలో, పెద్దపల్లి మున్సిపాలిటీని రెండు విభాగాలుగా ఎంపిక చేశారు. అలాగే జూలపల్లి మండలం కాచాపూర్‌, ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఎదులాపురం, ముత్తారం మండలం ఓడేడు, అడవిశ్రీరాంపూర్‌, ధర్మారం మండలం రచ్చపల్లి, పాలకుర్తి మండలం జన్నారంతో పాటు పాలకుర్తిలో ఈ సర్వేను నిర్వహించనున్నారు. దేశానికి స్వాతంత్య్ర సిద్ధించిన తర్వాత 1958వ సంవత్సరం నుంచి సామాజిక, ఆర్థిక సర్వేలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ సర్వేను ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. 

రెండేళ్ల తర్వాత..

సర్వేలో ప్రధానంగా కుటుంబ వినిమయ ఖర్చులు, ఆరోగ్యం, విద్య అంశాలపై కుటుంబాలు చేస్తున్న ఖర్చులు, అసంఘటిత రంగంలో వున్న వ్యవసాయేతర వ్యాపార సంస్థల ఆదాయ, వ్యయాల వివరాలు వస్తువుల తయారీ, వాణిజ్య, సేవా రంగాలకు సంబంధించిన సంస్థల నుంచి వివరాలు సేకరించనున్నారు. అలాగే రైతుల స్థితిగతులు, భూమి, పశు సంపదకు సంబంధించిన సమాచారం, రుణాలు, పెట్టుబడి సమాచారం, తాగు నీరు, పారిశుధ్యం, గృహ వసతి సౌకర్యాలు, మురికి వాడల అంచనా, జాతీయ పర్యాటకం, ఆయుష్‌ వ్యవస్థ అంచనాలపై వివరాలను సేకరించనున్నారు. ఇందులో సురక్షిత తాగునీటి సేవలను ఎంత మంది సద్వినియోగం చేసుకుంటున్నారు, శానిటరీ సేవలు, చేతులను శుభ్రపరుచుకునేందుకు సబ్బులు, నీటిని వినియోగిస్తున్న వాళ్లు ఎంత మంది, మొబైల్‌ ఫోన్‌ కలిగి ఉన్న వ్యక్తులు, టెక్నాలజీ సేవలను, ఇంటర్‌నెట్‌ సేవలను ఎంత మంది వినియోగించుకుంటున్నారు. కంప్యూటర్‌ కలిగి ఉన్న కుటుంబాల శాతంను నమోదు చేయనున్నారు. అలాగే అధికారిక ఆర్థిక సంస్థల్లో ఖాతాలు కలిగి ఉన్న వయోజనులు, మహిళల శాతం, 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల పిల్లల జననాల నమోదు నిష్పత్తి, ప్రజా రవాణా వ్యవస్థ ఎంత మంది జనాభాకు అందుబాటులో ఉంది, గత 12 నెలల్లో నియత, అనియత విద్య శిక్షణలో భాగస్వాములైప యువకులు, వయోజనుల సంఖ్య, విద్య, ఉపాధి, శిక్షణ పొందని యువకుల సంఖ్య, ఏడాదిలో వివిధ వ్యాధుల చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య, ఇందుకు చేసిన ఖర్చు వివరాలను సేకరించనున్నారు. ఈ వివరాలను కుటుంబ పెద్ద నుంచి గానీ, సమాచారం పూర్తిగా అందించగల కుటుంబ సభ్యుల నుంచి సేకరించనున్నారు. ఇది 79వ రౌండ్‌ సర్వే అని జిల్లా ప్రణాళిక శాఖాధికారి గంప రవీందర్‌ తెలిపారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా సర్వేను నిర్వహించలేదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరు వరకు ఈ సర్వేను పూర్తి చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నివేదికను పంపించనున్నామన్నారు. ఈ సర్వే ఆధారంగా కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు ప్రజల అవసరాలకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించనున్నారు. తమ ప్రాంతాలకు వచ్చే సర్వే బృందాలకు విశ్వసనీయమైన సమాచారాన్ని అందించాలని సీపీవో గంప రవీందర్‌ ప్రజలను కోరారు. 

Read more