ముందస్తు అవకాశం

ABN , First Publish Date - 2022-11-30T00:57:18+05:30 IST

ఓటు హక్కు పొందేందుకు ప్రతి ఏటా నవంబరు, డిసెంబరు మాసాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నది. అయితే ఇక నుంచి 17ఏళ్లు పైబడిన వాళ్లు మూడు దఫాలుగా ముందస్తుగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

 ముందస్తు అవకాశం
పెద్దపల్లి పట్టణంలో ఓటర్ల నమోదుపై ఆరా తీస్తున్న కలెక్టర్‌(ఫైల్‌)

- కొత్త నిబంధన తీసుకువచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

- ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1 కటాఫ్‌ తేదీలు

- జిల్లాలో ఓటర్ల జాబితా సవరణపై అధికారుల దృష్టి

- 3,4 తేదీల్లో పోలింగ్‌ బూత్‌ల వద్ద అందుబాటులో బీఎల్‌వోలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఓటు హక్కు పొందేందుకు ప్రతి ఏటా నవంబరు, డిసెంబరు మాసాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నది. అయితే ఇక నుంచి 17ఏళ్లు పైబడిన వాళ్లు మూడు దఫాలుగా ముందస్తుగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఏటా ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్లు మాత్రమే ఇప్పటివరకు కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. తాజాగా ఏప్రిల్‌ 1 నాటికి, జూలై 1 నాటికి, అక్టోబరు 1 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, ప్రతి ఏటా జనవరి నెలలో ప్రకటించే తుది జాబితాలో చోటు కల్పించనున్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. కొత్తగా ఓటు హక్కు పొందే వారికి మాత్రం జవవరిలో ప్రకటించే తుది జాబితానే ఆధారం. ఏడాదికి ఒకసారే కొత్త ఓటర్ల నమోదును చేపడుతారు. ప్రతి ఏటా నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో ఓటర్ల జాబితా సవరణ చేపడుతారు. ఈ జాబితా ద్వారా కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి ఓటర్ల తొలగింపు, చిరునామాల మార్పు, గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గాల మార్పులతో జాబితాలను సవరిస్తూ ఉంటారు. జిల్లాలో పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు ముమ్మరంగా అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టిని సారించారు. స్వయంగా బూతులను సందర్శించి ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియ ఎలా సాగుతున్నదని ఆరా తీస్తున్నారు.

జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రామగుండం నియోజకవర్గంలో 259 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 2,02,697 మంది ఓటర్లు ఉన్నారు. మంథని నియోజకవర్గంలో 288 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 2,16,672 మంది ఓటర్లు, పెద్దపల్లి నియోజకవర్గంలో 287 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 2,33,412 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల నమోదు కోసం ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంతో పాటు విద్యా సంస్థల్లోనూ ప్రచారం చేస్తున్నారు. వచ్చేనెల 8వ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారందరు ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 3,4 తేదీల్లో ఆయా పోలింగ్‌ బూతుల వద్ద బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్లి నిర్ణీత ఫారాలను నింపి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు ఫారం-6, విదేశాల్లో ఉన్నవారు ఓటు హక్కు పొందేందుకు ఫారం 6ఏ, ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడంపై అభ్యంతరాలు స్వీకరించేందుకు, మరణించిన వారి పేర్లను తొలగించేందుకు ఫారం 7 వినియోగించాలి. చిరునామా మర్పు, జాబితాలో వివరాల సవరణ, వైకల్యం ఉన్న వాళ్లు ఓటు కోసం నమోదు చేసుకునేందుకు ఫారం 8, నియోజకవర్గ పరిధిలో చిరునామా మార్పిడి కోసం ఫారం 8ఏలో వివరాలు నమోదు చేసి బీఎల్‌వోలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓటు హక్కు ఉన్న వాళ్లందరు కూడా తమ ఓటు తాము ఉంటున్న పోలింగ్‌ బూత్‌లోనే ఉందా, లేదా, మొత్తానికే లేదా అని తెలుసుకునేందుకు ఠీఠీఠీ.ుఽఠిటఞ.జీుఽ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. జనవరి 1 నాటికి ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తిచేసి జనవరి 15వ తేదీ తర్వాత తుది జాబితాను ప్రకటించనున్నారు.

Updated Date - 2022-11-30T00:57:20+05:30 IST