అంబరాన్నంటిన దసరా సంబరాలు

ABN , First Publish Date - 2022-10-07T06:12:06+05:30 IST

జిల్లా అంతటా విజయదశమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. భక్తుల ప్రత్యేక పూజలు, శమీపూజలతో ఆలయాలు కిటకిటలాడాయి.

అంబరాన్నంటిన దసరా సంబరాలు
అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించిన రాంలీల కార్యక్రమానికి హాజరైన మంత్రి గంగుల కమలాకర్‌

- ఘనంగా శమీపూజలు

- పలు చోట్ల మంత్రి గంగుల హాజరు

మహాశక్తి ఆలయంలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్‌

కరీంనగర్‌, కల్చరల్‌, అక్టోబరు 6: జిల్లా అంతటా విజయదశమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. భక్తుల ప్రత్యేక పూజలు, శమీపూజలతో ఆలయాలు కిటకిటలాడాయి. శమీ పత్రాలను పెద్దలకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అందజేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భక్తులు వాహన పూజలు చేయించుకున్నారు. పలు చోట్ల ఆలయ ఆవరణల్లో రావణ, మహిషాసుర సంహారలీల కార్యక్రమాలను చేపట్టారు.

హాజరైన బుల్లి, వెండితెర కళాకారులు

అంబేద్కర్‌ స్టేడియంలో నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు నేతృత్వంలో దసరా వేడుకలు, క్రాకర్స్‌ షో ఆదుర్స్‌ అనిపించాయి. వేడుకలను మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావుతో కలసి జ్యోతిప్రకాశనం చేసి ప్రారంభించగా గోగుల ఈవెంట్స్‌ నిర్వాహకుడు, తెలంగాణ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోగుల ప్రసాద్‌ నేతృత్వంలో అతిథిగా హీరో సంపూర్ణేశ్‌బాబు, హాస్య నటుడు ఆర్‌ఎస్‌ నంద పాల్గొన్నారు. శ్రావణభార్గవి, చిలువేరు శ్రీకాంత్‌ పాటలు, జబర్దస్త్‌ కమేడియన్స్‌ రాజమౌళి, ఇమ్మానియేల్‌, నవీన్‌ల హాస్యం, జానులిరి జానపద నృత్యం, డాక్టర్‌ వైష్ణవి శాస్త్రీయ నృత్యం, సంగెం రాధాకృష్ణ బృందం సెమీ క్లాసికల్‌ నృత్యం, జుగెలర్‌ కిషన్‌ ప్రదర్శన, కిరణ్‌ నృత్యం, రంజిత్‌ కుమార్‌ బృందం పేరిణి నృత్యం, వై రాజు మిమిక్రి మంత్రముగ్ధుల్ని చేశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నగరవాసులు ఆద్యంతం ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ జీవి శ్యాంప్రసాద్‌లాల్‌, డిప్యూటీమేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. గిద్దెపెరుమాండ్ల దేవస్థానంలో పెద్ద ఎత్తున భక్తులు పూజల్లో పాల్గొన్నారు. మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

మహాశక్తి ఆలయంలో..

శమీపూజ, వాహన పూజలతో చైతన్యపురి మహాశక్తి దేవాలయం జనంతో కిక్కిరిసిపోయింది. పూజల్లో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని అన్నారు. అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. రాంనగర్‌ రమాసత్యనారా యణస్వామి, అభయాంజనేయస్వామి ఆలయంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌ ఆధ్వర్యంలో శమీ పూజ ఘనంగా నిర్వహించారు. మార్క్‌ఫెడ్‌గ్రౌండ్‌లో స్థానిక కార్పొరేటర్‌ బోనాల శ్రీకాంత్‌ నేతృత్వంలో మహిషాసుర సంహారలీల, శమీ పూజ జరుపగా మంత్రి గంగుల కమలాకర్‌  తదితరులు హాజరయ్యారు. వావిలాలపల్లిలోని హనుమాన్‌ సహిత కనకదుర్గ ఆలయంలో శమీపూజలో కార్పొరేటర్‌ బండారి వేణు, స్థానికులు పాల్గొన్నారు. శ్రీపురం కాలనీలో చిన్నారులు 23 ఫీట్ల రావణాసురుని విగ్రహం స్వయంగా రూపొందించి దహనం చేశారు.


Read more