గురుకులంలో తాగునీటి కష్టాలు

ABN , First Publish Date - 2022-08-02T05:18:54+05:30 IST

మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో (బాలికలు)లో తాగునీటి కోసం విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.

గురుకులంలో తాగునీటి కష్టాలు
మంచి నీటి నల్లాల వద్ద విద్యార్థినులు ఇబ్బందులు

- చెడిపోయిన ఆర్వో ప్లాంట్‌

- ఇబ్బందుల్లో విద్యార్థినులు

తిమ్మాపూర్‌, ఆగస్టు 1: మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో (బాలికలు)లో తాగునీటి కోసం విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యను బోధిస్తున్నారు. 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లు పూర్తయితే  మరో 200 మంది విద్యార్థులు పాఠశాలకు వస్తారు. కోట్ల నిధులు వెచ్చించి సకల సౌకర్యాలతో నూతనం భవనం నిర్మించారు. గత ఏడాది ఈ భవనంలోకి పాఠశాలను మార్చారు. విద్యార్థులకు తాగునీటి కోసం 1000 ఎల్‌పీహెచ్‌ ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆర్వో ప్లాంట్‌ పని చేయడం లేదు. నెలలు గడిచినా దానికి మరమ్మతులు చేయించకపోవడంతో విద్యార్థినులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. పాత భవనం వద్ద గల ఆర్వో ప్లాంట్‌ వద్దకు తాగునీరు తెచ్చుకుంటున్నారు. రాత్రి సమయంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాములు, తేళ్లు కనిపిస్తుండడంతో భయపడుతున్నారు. 


 వర్షం కురిస్తే పాఠశాల ఆవరణ అంతా నీల్లే


గురుకుల పాఠశాల భవనం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌కు సమీపంలో ఉంది. దీంతో పాఠశాల పరిసారాల్లో ఎప్పుడూ నీరు జాలువారుతుంటాయి.  ఓ వైపు వర్షం నీరు, జాలు వారుతున్న నీటితో నేల అంతా చిత్తడిగా మారుతుంది. ఈ  బురదలో పాత భవనం వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకునేందుకు విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. 


 రెండు, మూడు రోజుల్లో మరమ్మతులు చేయిస్తాం

- రాఘవరెడ్డి, ప్రిన్సిపాల్‌ 

 వాటర్‌ ప్లాంట్‌ ఈ మధ్యలోనే చెడిపోయింది. రెండు, మూడు రోజుల్లో మరమ్మతులు చేయిస్తాం. ప్రస్తుతం పాత భవనం వద్ద నున్న ప్లాంట్‌ నుంచి విద్యార్థులు నీటిని తెచ్చుకుంటున్నారు. డ్యాం కట్ట దగ్గరగా ఉండడంతో పాఠశాల ఆవరణలో నీరు జాలువారుతోంది. పాములు బెడద ఎక్కువగానే ఉంది. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.


Read more