సింగరేణిలో ‘గుర్తింపు’ ఎన్నికలపై పట్టింపేది..?

ABN , First Publish Date - 2022-09-08T05:46:07+05:30 IST

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రభుత్వానికి పట్టింపు లేనట్లుగా కనిపిస్తోంది.

సింగరేణిలో ‘గుర్తింపు’ ఎన్నికలపై పట్టింపేది..?

- హై కోర్టు పరిధిలోకి వెళ్లిన వివాదం

- టీబీజీకేఎస్‌కు నోటీసులు

- ఐదేళ్లు కావస్తున్నా స్పందించని ప్రభుత్వం

గోదావరిఖని, సెప్టెంబరు 7: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రభుత్వానికి పట్టింపు లేనట్లుగా కనిపిస్తోంది. సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాలు, రీజినల్‌ లేబర్‌ కమిషనర్లు కలిసి ఏర్పాటు చేసుకున్న కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ ఎన్నడో కొండెక్కింది. కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ ప్రాతిపదికనగా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు రెండు దశాబ్దాల క్రితం నుంచి జరుగుతున్నాయి. రెండేళ్ల కాలపరిమితితో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత నాలుగేళ్ల కాలపరిమితిని అంగీకరించి అదే కొనసాగుతున్నది. అయితే ప్రతి గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందు ఎన్నికల నిర్వహణకు జరుగాల్సిన తంతు మూడు నెలల ప్రహసనం. సింగరేణి ఉత్పత్తికి ఆటంకం కలుగకుండా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రభుత్వ శాఖల సంసిద్ధతను చూసుకుని ఎన్నికలు నిర్వహిస్తారు. 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందు గతంలో నాలుగేళ్ల కాలపరిమితితో ఎన్నికలు నిర్వహించారు కనుక ఈసారి కూడా నాలుగేళ్ల కాలపరిమితి అనుకున్నారు. కానీ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌కు లేఖ ఇచ్చేటప్పుడు ఆర్‌ఎల్‌సీ రెండేళ్ల గడువేనని ప్రకటించడంతో టీబీజీకేఎస్‌ కోర్టుకు వెళ్లింది. నాలుగేళ్లు తమ కాలపరిమితి అని కొట్టాడుతున్నది. అయితే 2017 అక్టోబరు 5న జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఇంకో నెల రోజులు అయితే ఐదేళ్లు గడిచిపోతాయి. ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించిన ఏ ప్రస్తావన సింగరేణిలో లేదు. ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరు మొదలుపెట్టాయి. పర్యవసానంగా మూడు మాసాల క్రితం ఆర్‌ఎల్‌సీ ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యానికి సూచన చేసింది. సింగరేణి యాజమాన్యం కూడా రెండు మాసాల క్రితం ఎన్నికలు నిర్వహించేందుకు తాము సంసిద్ధమేనని అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. 

‘మునుగోడు’ ప్రభావం..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుబంధంగా ఉన్న సింగరేణిలో కార్మిక సంఘం ఉంటే ఆ కార్మిక సంఘం జయాపజయాల పరిస్థితులను బట్టి ఎన్నికలు నిర్వహించడం రాజకీయ సాంప్రదాయం. సింగరేణి ప్రాంతంలో టీబీజీకేఎస్‌గా పదేళ్ల నుంచి రెండుసార్లు విజయం సాధిస్తూ వస్తున్నది. టీబీజీకేఎస్‌ను కార్మికులు ఆదరించేందుకు యూనియన్‌గా కాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ ప్రభావమే అధికంగా ఉంటుంది. ప్రస్తుతం మునుగోడు ఎన్నికలు సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంత ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అంత ఆసక్తిగా కనిపించడం లేదు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌కు ప్రతికూల ఫలితం వస్తే ఈ ప్రభావం మొత్తం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుందనే భావనతో ఎన్నికలు నిర్వహించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు సింగరేణిలో కమ్యూనిస్టు పార్టీలకు అనుబంధంగా బలమైన కార్మిక యూనియన్లు ఉన్నాయి. మునుగోడులో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్న కమ్యూనిస్టులతో సింగరేణిలో తలనొప్పులు ఎందుకని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం పట్టుబట్టిన జాతీయ కార్మిక సంఘాలు చివరికి న్యాయపోరాటానికి సిద్ధపడ్డాయి. ఈ న్యాయ పోరాటంలో బీఎంఎస్‌, సీఐటీయూ ఈ అంశాన్ని కోర్టు పరిధికి తీసుకెళితే మరింత జఠిలమవుతుంది కనుక తాము అందుకు సిద్ధంగా లేమని వైదొలిగాయి. ఏఐటీయూసీ చేసిన ఈ న్యాయ పోరాట ప్రతిపాదనను హెచ్‌ఎంఎస్‌, ఐఎన్‌టీయూసీ ఆమోదించినా ఆ తరువాత శ్రద్ధ చూపలేదు. కానీ ఏఐటీయూసీ మాత్రం సింగరేణిలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలి లేదా అన్ని కార్మిక సంఘాలకు యాజమాన్యంతో చర్చించే హక్కును కల్పించాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసినప్పటికీ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. ఎన్నికల విషయంలో టీబీజీకేఎస్‌ వైఖరి ఏంటి అని ఏఐటీయూసీ తరపు న్యాయవాది టీబీజీకేఎస్‌కు కూడా నోటీసులు పంపించారు. ఇప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికల అంశం హైకోర్టు పరిధిలో ఉంది. 

ఇప్పట్లో లేనట్టేనా..?

నవంబరులోపు సింగరేణి ఎన్నికలపై స్పష్టత రాకుంటే డిసెంబరు నుంచి మార్చి వరకు సింగరేణిలో ఉత్పత్తి మాసాల ప్రక్రియ ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా ఈ మాసాల్లో ఎన్నికల నిర్వహణ జరుగలేదు. ఇందుకు యాజమాన్యం కూడా అంగీకరించదు. ఈ పరిణామాల నేపథ్యంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 2023 మే, జూన్‌ మాసాల వరకు జరుగుతాయా అనే అనుమానం ఉంది. అప్పటికి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైతే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. 11 అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలో కార్మిక సంఘాల మాతృ సంస్థలకు సింగరేణి గుర్తింపు ఎన్నిక మినీ అసెంబ్లీ ఎన్నికల వేడిని పుట్టిస్తాయి. అప్పుడు క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి అనుకూలత లేని వాతావరణం ఉంటే సింగరేణి ఎన్నికలు ఉంటాయా.. ఉండవా.. అనేది ప్రశ్నార్థకంగా మారనున్నది. కార్మికులకు సంబంధించిన ప్రధానమైన హక్కుల సాధన, లాభాల వాటా, బోనస్‌ తదితర అంశాలన్నీ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతాయి. కనుక గుర్తింపు కార్మిక సంఘం ప్రాధాన్యం కూడా సింగరేణిలో క్రమంగా తగ్గుతూ వస్తున్నది. కార్మికుల సంఖ్య 1.2లక్షల నుంచి 36వేలకు తగ్గిపోవడంతో కార్మికుల అభిప్రాయం, ఎన్నికల ప్రాధాన్యం కూడా ఇదే నిష్పత్తిలో తగ్గుతూ వస్తున్నది. కార్మిక సంఘాల ప్రాబల్యం, గుర్తింపు కార్మిక సంఘం ప్రభావం సింగరేణి యాజమాన్యంపై కూడా క్రమంగా తగ్గుతోందనే అభిప్రాయం కార్మికుల్లో వ్యక్తమవుతున్నది. 

Updated Date - 2022-09-08T05:46:07+05:30 IST