నేడు దళితబంధు లబ్ధిదారులకు వాహనాల పంపిణీ

ABN , First Publish Date - 2022-04-05T05:45:06+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితబంధు లబ్దిదారులకు మంగళవారం గూడ్స్‌ వాహనాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

నేడు దళితబంధు లబ్ధిదారులకు వాహనాల పంపిణీ
డాక్టర్లతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

  కరీంనగర్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితబంధు లబ్దిదారులకు మంగళవారం గూడ్స్‌ వాహనాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో దళితబంధు పథకంపై క్లస్టర్‌ అధికారులు, గ్రౌండింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు మున్సిపల్‌ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితబంధు లబ్దిదారులకు మంగళవారం డాక్టర్‌బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో 300 గూడ్స్‌ వాహనాలను మంత్రుల చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేయాలన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోని 100 మంది దళితబంధు లబ్దిదారులకు ప్రొసీడింగ్స్‌, పాస్‌బుక్కులను అందజేయాలన్నారు. కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గ దళితబంధు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పారు. క్లస్టర్‌ వారీగా ఎంతమంది దళితబంధు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయినది సోమవారం సాయంత్రంలోగా నిర్ధారించుకోవాలని  చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేశ్‌, ఎన్‌వైకే కో ఆర్డినేటర్‌ రాంబాబు, జిల్లా డిస్ర్టిక్ట్‌ మేనేజర్‌ లక్ష్మణ్‌ కుమార్‌, డీఆర్‌డీఏ శ్రీలత పాల్గొన్నారు. 


 బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ నిబంధనలు పాటించని వారిపై చర్యలు


బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ రూల్స్‌-2016 పాటించని  ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  పది బెడ్స్‌ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న ఆసుపత్రులలో మురికినీటి శుద్ధి ప్లాంట్‌, 25 బెడ్స్‌ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న ఆసుపత్రుల్లో సీఎఫ్‌వో నిర్మాణం చేపట్టాలన్నారు. మున్సిపల్‌లోని ఘన వ్యర్థాలను బయో వ్యర్థాలతో కలపడం లేదని మున్సిపల్‌ కమిషనర్లు నిర్ధారించాలని అన్నారు. సమావేశంలో సీపీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. 


 ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలి


సుభాష్‌నగర్‌: ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. సోమవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని పిల్లల వార్డు, కొవిడ్‌ వార్డు, లాండ్రి, ధర్మశాల, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. అవుట్‌ పేషంట్‌, ఎస్‌ ఎంసీయూ బ్లాక్‌ సందర్శించి, వార్డులో చేరిన పిల్లల వివరాలను ప్రతిరోజు పంపించాలని డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను  ఆదేశించారు. సాదారణ ప్రసవాల వార్డులో ఉన్న బాలింతలతో మాట్లాడి, ఆసుపత్రిలో వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. ఆసుపత్రిలోని లేబర్‌ రూములో పిల్లల డాక్టరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, ఆర్‌ఎంవో డాక్టర్‌ జ్యోతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, డాక్టర్‌ అలీం పాల్గొన్నారు.

Read more