సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-09-08T07:11:52+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు.

సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సత్యనారాయణ, తదితరులు

 - 15 వేల మందితో ర్యాలీ నిర్వహించాలి

- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌

కరీంనగర్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి డీజీపీతో కలిసి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కార్యక్రమ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పాటించాలని అన్నారు. 16న జిల్లాలోని జిల్లాకేంద్రంతోపాటు అన్ని నియోజకవర్గాల్లో 15 వేల మందితో ర్యాలీని నిర్వహించాలని సూచించారు.  17న జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించాలని, ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి గ్రామ పంచాయతీ వరకు అందరు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాన్నారు. సమైక్యత కార్యక్రమ నిర్వహణకు ప్రతి నియోజకవర్గానికి 30 లక్షల నిధులను  కేటాయిస్తామన్నారు. చివరిరోజు 18న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, అల్పాహారం, భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి నోడల్‌ అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులతో మాట్లాడుతూ వజ్రోత్సవ నిర్వహణకు ముందుగానే ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, ట్రైనీ కలెక్టర్‌ లెనిన్‌, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఖుస్రోషాఖాన్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి టి రాజ్యలక్ష్మీ, జిల్లా యువజన, సంక్షేమాధికారి కె రాజవీరు, డీటీడబ్ల్యూవో ఎం గంగారాం పాల్గొన్నారు. 

Read more